Adani Data Center and Aero Space Park in Telangana: హైదరాబాద్: తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తరువాత పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు వస్తున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంపై సీఎం రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy)తో అమర్ రాజా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గల్లా జయదేవ్ (Galla Jayadev) బుధవారం సమావేశమై చర్చించారు. తెలంగాణలో ఇన్వెస్ట్ చేసేందుకు  తాము సిద్ధంగా ఉన్నట్లు అదానీ గ్రూప్ (Adani Group) మరోమారు ముందుకు వచ్చింది. బుధవారం సెక్రెటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డితో పోర్ట్స్ - సెజ్ సీఈవో, గౌతమ్ అదాని పెద్ద కుమారుడు కరణ్ అదానీ (Karan Adani), అదాని ఎరో స్పేస్ సిఇఓ ఆశీష్ రాజ్ వన్షి లతో చర్చలు జరిపారు. 


వసతులు, రాయితీలు కల్పిస్తుందని రేవంత్ రెడ్డి భరోసా 
పారిశ్రామిక అభివృద్ధికి, ఉపాధి కల్పనకు కొత్త పరిశ్రమలకు తెలంగాణ ప్రభుత్వం తగినన్ని వసతులు, రాయితీలు కల్పిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. అదానీ గ్రూప్ పెట్టుబడులను ఆహ్వనించినట్లు తెలిపారు. ఇప్పటికే అదానీ గ్రూపు చేపట్టిన పాత ప్రాజెక్టులను కొనసాగిస్తామని, కొత్త ప్రాజెక్టులకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అదానీ గ్రూప్ ప్రతినిధులు కోరారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ తెలంగాణలో పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పనకు తమ కంపెనీ ముందు నిలబడుతుందన్నారు. రాష్ట్రంలో ఏరో స్పేస్ పార్కుతో పాటు డేటా సెంటర్ ప్రాజెక్టు నెలకొల్పేందుకు అదానీ గ్రూప్ సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు జరిపింది. వీటికి సంబంధించిన ప్రస్తుత పరిస్థితిపై పాటు కొత్త ప్రాజెక్టుల స్థాపనపై  సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఐటి ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్  రంజన్, సీఎం సెక్రటరీ షానవాజ్ ఖాసిమ్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


అమర్ రాజా భారీ పెట్టుబడులు
తెలంగాణలో పెట్టుబడులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అమర్ రాజా కంపెనీ (Amar Raja) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గల్లా జయదేవ్ సంప్రదింపులు జరిపారు. అమర రాజా ఎనర్జీ & మొబిలిటీ (గతంలో అమర రాజా బ్యాటరీస్) రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లిలో లిథియం అయాన్ బ్యాటరీల తయారీకి సంబంధించిన గిగా ప్రాజెక్టు నెలకొల్పుతోంది. ఈ పరిశ్రమల స్థాపనకు సంబంధించిన పురోగతిపై బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గల్లా జయదేవ్ తో చర్చలు జరిపారు.  తెలంగాణ ప్రభుత్వం అందించే సహాయ సహకారాలపై సమావేశంలో చర్చించారు.  


అడ్వాన్స్డ్ ఎనర్జీ స్టోరేజ్ టెక్నాలజీని ప్రవేశ పెట్టేందుకు మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లిలో అమర రాజా ఒక గిగా కారిడార్‌ను ఏర్పాటు చేస్తోంది. దేశంలోనే పెద్దదైన అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ (ACC), లిథియం-అయాన్ బ్యాటరీ తయారీ ఫ్యాక్టరీని ఇక్కడ నెలకొల్పుతోంది. తెలంగాణ న్యూ ఎనర్జీ పార్క్, బ్యాటరీ ప్యాక్ అసెంబ్లింగ్ యూనిట్, శంషాబాద్‌లోని ఇ-పాజిటివ్ ఎనర్జీ ల్యాబ్స్ పేరుతో రీసెర్చ్ అండ్ డెవెలప్మెంట్ హబ్ ను ఏర్పాటు చేయనుంది. మొత్తం రూ.9,500 కోట్ల పెట్టుబడులకు కంపెనీ ముందుకొచ్చింది. దీంతో దాదాపు 4,500 మందికి ఉద్యోగాలు లభిస్తాయి.