కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కులో తనపై జరిగిన దాడి ఘటనపై నటి చౌరాసియా స్పందించారు. అసలు ఆరోజు ఏం జరిగిందో మీడియాతో చెప్పుకొచ్చారు. ఆ రోజు నటి కేబీఆర్ పార్కుకు వాకింగ్‌కు వెళ్లిన సమయంలో నటి చౌరాసియాపై దుండగుడు దాడి చేసి, ఆమె ఖరీదైన ఫోన్‌ను లాక్కెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ఘటనపై బుధవారం చౌరాసియా మాట్లాడుతూ.. తాను ఎప్పటిలాగే కేబీఆర్ పార్క్‌లో సాయంత్రం 6 గంటలకు వాకింగ్ కోసం వెళ్ళానని, రాత్రి 8 గంటల సమయంలో పార్క్ నుంచి బయటకు వస్తుంటే, ఒక వ్యక్తి తనపై దాడి చేశాడని చౌరాసియా తెలిపారు.
తన మొబైల్ ఫోన్, డైమండ్ రింగ్ లాక్కోవడానికి ప్రయత్నించాడని.. అప్పుడే తన మొహంపై గుద్దాడని చెప్పింది. ‘‘నా దగ్గర డబ్బులు లేవని ఫోన్ పే చేస్తానని చెప్పా. నెంబర్ చెప్పమని అడిగా. అదే ఆ టైంలో రెండు సార్లు 100 కి డయల్ చేశా. నేను 100 నెంబరుకి డయల్ చేయడం చూసి.. నన్ను పొదల్లోకి తోసేశాడు. పెద్ద బండరాయి తలపై వేయబోయాడు. నేను దాన్నుంచి పక్కకు తప్పుకుని, దుండగుడి ప్రైవేట్ పార్ట్స్‌పై కాలితో తన్నా. ఆ తర్వాత ఫెన్సింగ్ దూకి తప్పించుకుని బయటికి వచ్చేశా. ఎదురుగా ఉన్న స్టార్‌బక్స్ వద్ద ఉన్న డ్రైవర్లు వచ్చారు. వారి ఫోన్ నుంచే తీసుకొని పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాను. పోలీసులు వెంటనే స్పందించారు. ఆగంతుకుడు ఐదు అడుగుల ఎత్తులో ఉంటాడు. 22 నుంచి 25 ఏళ్ల వయసు ఉంటుంది. మరోసారి చూస్తే తప్పకుండా గుర్తు పడతా’’నని అన్నారు.
‘‘నిందితుడు దొంగతనం కోసమే వచ్చినట్టు అనిపించింది. విచక్షణారహితంగా కొట్టాడు. బండరాయికి నా తల బాదాడు. నాకు స్పృహ తప్పినంత పని అయింది. అపస్మారక స్థితికి వెళ్లినట్లు అనిపించింది. లైంగికంగా దాడికి ప్రయత్నించినట్లు అర్ధం అయింది. అంతేకాక, దుండగుడు ‘నిన్ను చంపేస్తా.. తగల బెడతా’ అంటూ రాయి విసిరాడు. నిందితుడు కాలి నడకనే వచ్చినట్లు తెలుస్తోంది.’’ అని నటి చౌరాసియా తెలిపారు. ఇది తెలిసిన వారి పనే అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు ఆమె స్నేహితులను ప్రశ్నిస్తున్నారు.
సీసీటీవీ కెమెరాల ద్వారా సంఘటన జరిగిన రోజు రాత్రి నుంచి ఒంటి గంట వరకు ఆమె చెప్పిన పోలికలున్న వారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. ఎల్ అండ్ టీ ఏర్పాటు చేసిన కెమెరాలతోపాటు కేబీఆర్ పార్కు చుట్టూ ఉన్న దుకాణాల కెమెరాలను పరిశీలిస్తున్నారు.
Also Read: Robbery: కుక్కలు చనిపోవడం, దోపిడీ చేశాక చంపేయడం.. ఇది ఆ గ్యాంగు పనేనా?
Also Read: భోజనం చేసే మధ్యలో నీళ్లు ఎందుకు తాగకూడదు? తాగితే ఏమవుతుంది?