Naresh Vs Ramya Raghupathi: నటుడు నరేష్, ఆయన మూడో భార్య రమ్య రఘుపతి వ్యవహారంలో ఊహించని మలుపు చోటు చేసుకుంది. తాజాగా నటుడు నరేష్ తనకు ప్రాణహాని ఉందని కోర్టును ఆశ్రయించారు. తనను చంపడానికి రమ్య రఘుపతి ప్రయత్నిస్తోందని నరేష్ ఆరోపించారు. సుపారీ ఇచ్చి హత్య చేయించాలని రమ్య ప్రయత్నిస్తోందని నరేష్ అంటున్నారు. రమ్య రఘుపతి బెంగళూరుకు చెందిన రాకేష్ శెట్టి అనే వ్యక్తితో తనను అంతం చేయించడానికి ఒప్పందం కుదుర్చుకుందని నరేష్ వాదిస్తున్నారు. ఈ మేరకు నరేష్ ఆధారాలు కూడా బయటపెట్టారు. తన ఇంటి గేటు ఎదుట కొందరు తిరుగుతున్నారని, వారు రెక్కీ చేస్తున్నారని ఆరోపిస్తూ వీడియో ఫుటేజీలను కూడా విడుదల చేశారు.
అంతేకాకుండా, ఏపీ మాజీ పీసీసీ చీఫ్, ఉమ్మడి ఏపీలో మాజీ మంత్రి అయిన రఘువీరా రెడ్డితో ఫోన్ చేయించి బెదిరింపులు చేస్తున్నారని అన్నారు. ఫోన్ హ్యాక్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని వాపోయారు. రమ్య వేధింపులను తట్టుకోలేకపోతున్నానని, తన నుంచి విడాకులు ఇప్పించాలని నరేష్ కోర్టును కోరారు.
2010లో నరేష్ - రమ్య రఘుపతి పెళ్లి
2010 మార్చి 3న బెంగళూరులో రమ్య రఘుపతిని మూడో వివాహం చేసుకున్నారు. నరేష్ ఆరోపణల ప్రకారం.. ‘‘పెళ్లికి నేను ఒక్క రూపాయి కట్నం కూడా తీసుకోలేదు. రమ్యకు 30 లక్షల బంగారం చేయించింది మా అమ్మ విజయ నిర్మల. పెళ్లి అయిన కొన్ని నెలల నుండే రమ్య నుంచి నాకు వేదింపులు మొదలయ్యాయి. తన తల్లితో పాటుగా బెంగళూరులోనే ఉండాలని రమ్య షరతు విధించింది. రమ్యకు నాకు 2012 లో రణ్ వీర్ అనే బాబు పుట్టాడు. తర్వాత నాకు తెలియకుండానే పలు బ్యాంకులు, కొంత మంది వ్యక్తుల దగ్గర నుంచి రమ్య డబ్బు వసూలు చేసింది. నా పేరు చెప్పి లక్షల్లో అప్పులు చేసింది. అప్పులు తీర్చుకునేందుకు 10 లక్షలు చెల్లించాను. నా కుటుంబ సభ్యుల నుంచి రమ్య మరో 50 లక్షలు కూడా తీసుకుంది.
‘‘నా ఆస్తి మొత్తం కాజేయడానికి రమ్య ప్రయత్నించింది. అప్పు ఇచ్చిన వారు ఇంటికి వచ్చి నన్ను వేధించేవారు. ఆస్తి ఇవ్వడానికి ఒప్పుకోకపోవడంతో నన్ను చంపేందుకు ప్రయత్నించింది. సుపారీ గ్యాంగ్ ను మాట్లాడుకుని నన్ను చంపాలనుకుంది. 2022 ఏప్రిల్ లో కొంతమంది అగంతకులు నా ఇంట్లో చొరబడ్డారు. 24 లక్షలు రికవరీ చేయడానికి వచ్చామని మాయ మాటలు చెప్పారు. ఘటనపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాను. తనకు నేను డబ్బులు ఇవ్వకపోవడంతో పలు రకాలుగా చంపాలని చూసింది. కాంగ్రెస్ లీడర్ రఘువీరారెడ్డి తో ఫోన్ చేయించి బెదిరించింది. నన్ను చంపేస్తారని భయంతో ఎక్కడికి ఒంటరిగా వెళ్ళటం లేదు.
హ్యాకింగ్ కూడా
‘‘రమ్య తనకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ద్వారా హ్యాకింగ్ నేర్చుకుంది. నా ఫోన్ ను హ్యాక్ చేసి పర్సనల్ మెసేజ్‌లు కూడా చూసేది. రమ్య వల్ల నరకయాతన అనుభవించాను. రమ్య వేధింపులు భరించలేకపోతున్నాను. నాకు కోర్టు ద్వారా విడాకులు ఇప్పించండి’’ అని వీకే నరేష్ కోర్టును కోరారు.