Manchu Vishnu Comments : హైదరాబాద్‌లోని జల్‌పల్లిలో మంగళవారం రాత్రి మీడియా ప్రతినిధులపై మంచు మోహన్‌ బాబు చేసిన దాడి సంచలనంగా మారుతోంది. దీనిపై ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణు స్పందించారు. ఇలాంటి ఘటన దురదృష్టకరమన్నారు. ఈ ఘర్షణలో మోహన్ బాబుకి కూడా గాయాలు అయినట్టు విష్ణు తెలిపారు. అందుకే ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు పేర్కొన్నారు. 


మోహన్ బాబును పరామర్శించిన నటుడు విష్ణు అక్కడే విలేకర్లతో మాట్లాడారు. కుటుంబాన్ని అతిగా ప్రేమించడమే తన తండ్రి చేసిన పెద్ద తప్పుగా అభిప్రాయపడ్డారు. అందుకే ఇలాంటి సమస్యలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు ఎవరికీ కొత్తకాదని... ప్రతి ఫ్యామిలీలో ఇలాంటివి సర్వసాధారణమన్నారు. దీన్ని సంచలనంగా మార్చొద్దని విజ్ఞప్తి చేశారు. 


ఉమ్మడి కుటుంబంగా కలిసి మెలిసి ఉంటామని ఆనుకున్నామని అన్నారు విష్ణు. కానీ ఇలా జరిగిందని ఇది తమను ఎంతగానో బాధపెడుతోందన్నారు. ప్రజల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. జరుగుతున్న విషయాలను ప్రజలకు చెప్పడం కరెక్టే కానీ హద్దు మీరి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. 


Also Read: గతి తప్పిన మంచు కుటుంబ వివాదం - మోహన్ బాబు చుట్టూ బిగస్తున్న ఉచ్చు


మంగళవారం రోజు రాత్రి కూడా మీడియాను చూసిన మంచు మనోజ్‌ అందరికీ నమస్కారం చేస్తూనే వచ్చారని తెలిపారు విష్ణు. అప్పుడే ఓ మీడియా ప్రతినిధి ముఖంపై మైక్ పెట్టి ప్రశ్నలు అడిగారని అన్నారు. దీంతో క్షణికావేశానికి లోనైనా మోహన్ బాబు కొట్టారని తెలిపారు. ఇలా జరగడం దురదృష్టకరమైన ఘటనగా అభివర్ణించారు. 


దాడి జరిగిన తర్వాత ఆ మీడియా ప్రతినిధి ఫ్యామిలీతో మాట్లాడినట్టు మంచు విష్ణు చెప్పారు. వారికి కావాల్సిన సాయంచేయడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఎవరిపైనో కక్షతోనో కావాలనో కొట్టలేదని ఏదో ఆ క్షణానికి అలా జరిగిపోయిందన్నారు. ఉద్దేశపూర్వకంగా జరిగిందని మాత్రం కాదన్నారు.  


కన్నప్ప సినిమా పోస్ట్‌ ప్రొడెక్షన్‌ పనుల కోసం లాస్‌ఏంజెల్స్‌లో ఉన్నప్పుడు ఫ్యామిలీ ఇష్యూస్ తెలిసాయని వెల్లడించారు విష్ణు. వెంటనే అన్నింటినీ విడిచి పెట్టి వచ్చేశాను అన్నారు. తనకు ఫ్యామిలీ ఫస్ట్ అన్నారు మా నాన్న మాట నాకు వెదవాక్కు అన్నారు విష్ణు. ఆయన చెప్పింది మంచి అయినా చెడు అయినా చేస్తానంటూ చెప్పుకొచ్చారు. జరుగుతున్న పరిణామాలతో కలత చెందిన తన తల్లి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుందన్నారు విష్ణు. 


Also Read: మీడియాకు క్షమాపణలు చెప్పిన మంచు మనోజ్‌- నాన్న దేవుడంటూ కన్నీటి పర్యంతం


జరుగుతున్న వివాదంలో బయట వ్యక్తులు ప్రేమేయం ఉంటే సాయంత్రం లోపు వారంతా తప్పు ఒప్పుకోవాలని సూచించారు మంచు విష్ణు. లేకంటే తానే ఆ పేర్లు బయటపెడతానంటూ వార్నింగ్ ఇచ్చారు. తండ్రి చెప్పింది చేస్తాను కానీ తన సొదరుడిపై ఎప్పుడూ దాడి చేయలేదన్నారు. సినిమాలు, మా అసోసియేషన్ గురించి తప్ప వేరే విషయాలు మాట్లాడుకోమన్నారు. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందన్నారు. 


అంతకంటే ముందు జర్నలిస్టులతో కలిసి ధర్నా చేసిన మంచు విష్ణు సోదరుడు మంచు మనోజ్‌ దాడిని ఖండించారు. తన తండ్రిని క్షమించాలని ఈ విషయాన్ని వదిలేయాలని వేడుకున్నారు. తనకు అండగా ఉండేందుకు వచ్చిన ఇద్దరు మీడియా ప్రతినిధులపై దాడి చేయడం ఆవేదన కలిగించిందన్నారు. వాళ్లకు ఏ అవసరం ఉన్నా సరే తను అండగా ఉంటానని ఓ ఫోన్ కాల్ చేస్తే వస్తానని పేర్కొన్నారు. జరుగుతున్న పరిణామాలకు తన అన్న విష్ణు, వినయ్ కారణమంటూ చెప్పుకొచ్చారు. ఏం జరిగిందో చెప్పేందుకు సాయంత్రం ప్రెస్‌మీట్ పెడుతున్నట్టు వెల్లడించారు.