మూడనమ్మకం, అనుమానం ఈ రెండు ఉప్పల్‌లో రెండు హత్యలకు దారి తీశాయి. బ్లాక్ మ్యాజిక్‌తో కోరికలు తీరుతాయని... తర్వాత నష్టపోయామన్న భావనతో వ్యక్తినే లేపేయాలని ప్లాన్ చేశాడు నిందితుడు. ఈ తతంగమంతా చూస్తే పోలీసులకు మైండ్‌ బ్లాంక్‌ అయింది. 


ఈ నెల 14న ఉదయం 7గంటలకు ఉప్పల్‌లో రెండు హత్యలు కలకలం రేపాయి. తండ్రీకొడుకును దుండగులు తెల్లవారు జామున హత్య చేసి పరారయ్యారు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులకు చాలా షాకింగ్ విషయాలు తెలిశాయి. సీసీ కెమెరాలతో కేసును పోలీసులు ఛేదించి నిందితులను అరెస్టు చేశారు. 


ఉప్పల్‌ పీఎస్‌ పరిధిలో తండ్రీ కుమారుడి హత్య కేసులో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సాంకేతిక ఆధారాలతో, ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన నమూనాలతో కేసును ఛేదించారు పోలీసులు. ప్రధాన నిందితుడైన వినయ్ రెడ్డితోపాటు యల్లా బాలకృష్ణను 17న అదుపులోకి తీసుకున్నారు. మర్డర్ ఇన్వెస్టిగేషన్‌లో ముందు అక్కడ సీసీ కెమెరాలో ఇద్దరు కనిపించారు. సీసీ కెమెరాలు ఫాలోఅవుతూ A1 వినయ్ యోగేందర్ రెడ్డి, A2 బాలకృష్ణని సోమవారం సాయంత్రం 4 గంటలకి సుచిత్ర వద్ద అరెస్ట్ చేశారు. హత్యకు కారణం క్షుద్రపూజలు అని నిందితుల ప్రాథమిక విచారణలో తేలింది.


1991లో హైదరాబాద్‌లోని తుకారాంగేట్‌ వద్ద రాజకీయ కక్షల కారణంగా వినయ్‌ తండ్రి పరమ యోగేందర్ రెడ్డి హత్యకు గురయ్యాడు. ఆ తరవాత అతను తన అన్న, సోదరితో కలిసి ఉప్పల్‌లోని అమ్మమ్మ ఇంట్లో పెరిగాడు. అతను తరచూ తన మామతో కలిసి నరసింహ ఇంటికి వెళ్లేవాడు. తాతా అని పిలుస్తూ ఆయన చేసే పూజలకు ఆకర్షితుడయ్యాడు. 


ఇలాంటి పూజలతో ఏమైనా చేయగలడన్న మూఢనమ్మకం ఏర్పరుచుకున్నాడు వినయ్. తన గవర్నమెంట్ ఉద్యోగంలో పాస్ చేయించాలని కోరాడు. ఆ ఒప్పందం ప్రకారం నిందితుడు 2016లో ఎస్సై ఎగ్జామ్ పాస్ కావడానికి ఆరు లక్షల నరసింహకు ఇచ్చాడు. క్షుద్ర పూజలు చేయించాడు. కానీ ఫలితం కనిపించలేదు. దీంతో నరసింహ ప్లాన్ మార్చాడు.  


ఎంటెక్ కూడా చదివి విదేశాలకు వెళ్లేందుకు, పలు సమస్యలు పరిష్కారం కోసం పూజలు ప్రారంభించాడు.  దీనికి లక్షల రూపాయల డబ్బు ఇచ్చాడు వినయ్‌. ఆ తర్వాత 2019లో విదేశాలకు వెళ్లేందుకు గ్రహాలు సరిగా లేవని 11000 వసూలు చేసి గ్రహ పూజ చేయించి ఆస్ట్రేలియా వెళ్ళమని పూజారి నరసింహ చెప్పాడు. ఉద్యోగం వచ్చేందుకు వలి అనే వ్యక్తికి 12 లక్షల 50 వేలు చెల్లించే విధంగా ఒప్పందం కూడకుదుర్చుకున్నాడు. 


క్షుద్ర పూజలు చేయించినా ఎటువంటి లాభం లేకపోవడంతో నరసింహపై అనుమానం కలిగిన వినయ్‌ తాను ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వమని కోరాడు. దీంతో వలి 10 లక్షలు తిరిగి ఇచ్చాడు. మిగతా డబ్బు కోసం పలుమార్లు అడిగినప్పటికీ ఆ విషయాన్ని దాటు వేస్తుండడంతో తనను ఏమైనా చేయిస్తాడేమో అని అనుమానం కలిగింది వినయ్‌కు. ప్రతి పౌర్ణమికి చెడు జరుగుతూ ఉండటంతో డబ్బు అడగకుండా ఉండడానికి వలి క్షుద్ర పూజలు చేస్తున్నాడని వినయ్‌కు అనుమానం మరింత బలపడింది. 


హత్యకు రెండు రోజుల ముందు వినయ్‌కి యాక్సిడెంట్ జరగింది. దీనికి కూడా కూడా పూజలు కారణమని మరింత కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో నరసింహ కుటుంబం కదలికలపై రెక్కీ చేపట్టాడు. ఎదురుగా హాస్టల్ రూమ్ తీసుకొని నరసింహ ఇంటిపై నిఘా వేస్తూ అతని కదలికలపై దృష్టి సారించారు. 14న తెల్లవారుజామున నరసింహ బయట ఉండడం చూసి నిందితుడు కత్తులతో మెడపై నరికి చంపాడు. కాపాడ్డానికి వచ్చిన కొడుకుపై కూడా కత్తెలతో దాడి చేసి నరికి చంపాడు. ఈ హత్యలో పాల్గొన్న ఐదు మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.