ACB Raids on Ibrahimpatnam RDO AO Srinivas Reddy: తెలంగాణలో రెవెన్యూ శాఖలో మరో భారీ అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస రెడ్డి నివాసాలు,కార్యాలయాలపై గురువారం ఉదయం నుంచి అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏక కాలంలో దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే బలమైన ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ డీఎస్పీ ఆనంద్ నేతృత్వంలో కేసు నమోదు చేసుకున్న అధికారులు ఈ విస్తృత తనిఖీలను చేపట్టారు. 

Continues below advertisement

హైదరాబాద్‌ నగరంలోని హస్తినాపురం డివిజన్ పరిధిలో ఉన్న సంతోషిమాత కాలనీలోని శ్రీనివాస రెడ్డి ప్రధాని నివాసంతోపాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ఆయన బంధువులు, అత్యంత ఆప్తులు, స్నేహితులకు చెందిన మొత్తం 15 ప్రాంతాల్లో ఏసీబీ ప్రత్యేక బృందాలు ఏకకాలంలో సోదాలు జరుపుతున్నాయి.  ఈ అధికారి గతంలో మహేశ్వరం, బాలాపూర్‌, శంషాబాద్ వంటి కీలక ప్రాంతాల్లో తహశీల్దార్‌గా సుదీర్ఘకాలం  విధులు నిర్వహించారు. ఆయా సమయాల్లో కూడా ఆయనపై అనేక ల్యాండ్ సెటిల్‌మెంట్లు, భారీ అవినీతి ఆరోపణలు వెల్లువెత్తినట్టు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి. 

15 ప్రత్యేక బృందాలతో ముమ్మరం సోదాలు

ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో రంగంలో దిగిన ఏసీబీ అధికారులు అత్యంత ప్లాన్డ్‌ విధానంలో ఈ దాడులను నిర్వహించారు. గురువారం ఉదయం నుంచే ప్రారంభమైన ఈ ఆపరేషన్‌లో దాదాపు 15 ఏసీబీ ప్రత్యేక  బృందాలు ఏక కాలంలో రంగంలోకి దిగాయి. శ్రీనివాసరెడ్డికి చెందిన నివాసాల్లో లభించిన కీలక భూపత్రాలు, బ్యాంకు లావాదేవీలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లు, నగదు, బంగారు  ఆభరణాలకు సంబంధించిన వివరాలపై ఏసీబీ అధికారులు ప్రస్తుతం సుదీర్ఘంగా ఆరా తీస్తున్నారు. 

Continues below advertisement

సోదాలు ఇంకా కొనసాగుతుండటంతో అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు, బంగారు ఆభరణాలు, స్థిర, చరాస్తుల విలువకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు పరీశీలిస్తున్నారు. తనిఖీలు పూర్తిగా ముగిసిన అనంతరం స్వాధీనం చేసుకున్న ఆస్తుల వివరాలను అక్రమాస్తుల అంచనా విలువను ఏసీబీ అధికారులు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. 

వివాదాస్పద కెరీర్‌  

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి శ్రీనివాస రెడ్డి రెవెన్యూ శాఖలో అనేక వివాదాస్పద పోస్టింగ్‌లలో పని చేశారు. గతంలో రంగారెడ్డి జిల్లాలోని అత్యంత ఖరీదైన భూములు ఉండే మహేశ్వరం, బాలాపూ్, శంషాబాద్‌లలో తహశీల్దార్‌గా పని చేసిన కాలంలోనే ఈయనపై ఎక్కువ ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో ల్యాండ్‌ ప్రొటెక్షన్ వింగ్‌లో తహశీల్దార్‌గా కూడా ఈయన బాధ్యతలు స్వీకరించారు. 

కలెక్టర్‌ కార్యాలయం నుంచి 2026మే నెలలో డిప్యూటేషన్‌పై ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయానికి శ్రీనివాస రెడ్డి బదిలీ అయ్యారు. ప్రస్తుతం అక్కడ ఆయన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా కొనసాగుతున్నారు. ఈ స్వల్ప వ్యవధిలోనే ఆయనపై మళ్లీ ఆదాయానికి మించిన ఆస్తుల ఫిర్యాదులు అందాయి. వీటి ఆధారంగానే అధికారులు చర్యలు తీసుకున్నారు.