Siva Balakrishna Case : హెచ్ఎండీఏ (Hmda)మాజీ డైరెక్టర్  శివ బాలకృష్ణ (Siva Balakrishna) కేసులో ఏసీబీ అధికారులు తవ్వే కొద్ది అక్రమాలు బయటపడుతున్నాయి. వందల కోట్ల ఆస్తులు అక్రమంగా సంపాదించినట్లు ఏసీబీ (Acb)గుర్తించింది. ఎనిమిది రోజుల కస్టడీలోకి తీసుకొని విచారించడంతో...సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సత్యనారాయణ (Satyanarayana), భరత్‌ (Bharath)ఇద్దరూ శివ బాలకృష్ణకు బినామీలుగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో బినామీలను ఏసీబీ అధికారులు విచారించారు. వారి పేర్లతోనే విలువైన భూములు, స్థలాలు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. గురువారం మరోసారి సత్యనారాయణ, భరత్ లను విచారించాలని నిర్ణయించారు. కస్టడీ సమయంలో శివ బాలకృష్ణ సరైన సమాధానాలు చెప్పకపోవడంతో.. మరింత లోతుగా బినామీలను ప్రశ్నించేందుకు ఏసీబీ రెడీ అయింది. ఈ కేసులో  శివ బాలకృష్ణ అనుచరులు, బినామీలు, కుటుంబసభ్యులను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. 


అనుమతుల ద్వారా కోట్ల రూపాయలు వసూలు
ఎనిమిది రోజులు కస్టడీలో శివబాలకృష్ణ...ఓ సీనియర్​ ఐఏఎస్​ అధికారి పేరును అవినీతి నిరోధక శాఖ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఆ​ అధికారి ఆదేశాల ప్రకారమే వివాదాస్పద భూములకు అనుమతులు జారీ చేసినట్లు తేలింది. అనుమతుల ద్వారా కోట్ల రూపాయలను శివ బాలకృష్ణ అక్రమంగా సంపాదించినట్లు ఏసీబీ గుర్తించింది. పలు వివాదస్పద భూములకు అనుమతులు ఇప్పించినందుకు ఐఏఎస్​కు భారీగా లబ్ధి చేకూరిందని శివబాలకృష్ణ వెల్లడించాడు. వాటిల్లో తనకూ వాటాలు ముట్టినట్లు అంగీకరించాడు. సదరు ఐఏఎస్ ఆదేశాల మేరకు అనుమతులిచ్చిన ప్రాజెక్టుల వివరాలను, ఆ సమయంలో తమకు అందిన డబ్బులతో కొనుగోలు చేసిన భూముల వివరాలు ఏసీబీకి చెప్పినట్లు తెలుస్తోంది. 


ఐఏఎస్ పేరుతో భూముల రిజిస్ట్రేషన్
ఐఏఎస్ అధికారి ఎవరి పేరుతో స్థిరాస్తులను రిజిస్ట్రేషన్ చేయించారు ? ఆ భూములు ఎక్కడ ఉన్నాయి ? వాటి విలువ ఎంత ? అన్న వివరాలను శివబాలకృష్ణ కస్టడీలో బహిర్గతం చేసినట్లు తెలుస్తోంది. కొంత డబ్బును ఐఏఎస్ ఇంటికెళ్లి ఇచ్చినట్లు చెప్పడం ప్రాధాన్యం సంతరించుకొంది. సీనియర్ ఐఏఎస్ అధికారితో  తరచూ వాట్సాప్​లో మాట్లాడేవాడని ఏసీబీ విచారణలో తేలింది. అక్రమార్జనను ఆస్తులుగా మార్చుకునేందుకు బినామీలతోనూ సంభాషించినట్లు ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఆయా డీల్స్ జరిగిన సమయంలో శివబాలకృష్ణకు ఐఏఎస్​కు మధ్య జరిగిన ఫోన్ కాల్స్, వాట్సప్ సంభాషణలతోపాటు ఇద్దరి ఫోన్ లొకేషన్లకు సంబంధించి డేటాను సేకరించే పనిలో నిమగ్నమైంది ఏసీబీ.  


శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో రంగంలోకి ఈడీ
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. శివబాలకృష్ణ కేసు వివరాలు ఇవ్వాలని ఏసీబీని కోరింది. కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌, దర్యాప్తులో స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాలను ఇవ్వాలని ఈడీ ఆదేశించింది. రూ.250 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను పోగు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇందులో బినామీల పేరిటే 214 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు తేలింది. అత్యధికంగా జనగామ జిల్లాలో 102 ఎకరాలు, యాదాద్రి జిల్లాలో 66, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 39, సిద్దిపేట జిల్లాలో 7 ఎకరాల వ్యవసాయ భూములను గుర్తించారు. శివబాలకృష్ణ పేరుతో మొత్తం 29 ఇళ్ల స్థలాలు ఉన్నాయి. విశాఖపట్నం, విజయనగరంలో కూడా స్థలాలు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది.