Sivabalakrishna Corruption : హెచ్‌ఎండీఏ (HMDA) మాజీ డైరెక్టర్ (Former Director) శివబాలకృష్ణ (Sivabalakrishna )అవినీతి వ్యవహారంలో...తవ్వుతున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకవైపు అతని కుటుంబసభ్యులు, స్నేహితులను కలిపి విచారిస్తున్నారు. రెండు రియల్ ఎస్టేట్ సంస్థ ( Real Estate)ల్లో పెట్టబడులు పెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులను ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. నగదు, బంగారం, వెండి, వాచ్‌లు, స్మార్ట్ ఫోన్లే కాదు...120 ఎకరాలకు పైగా భూములను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు రంగారెడ్డి, భువనగిరి, సిద్దిపేట, జనగాం, చౌటుప్పల్, బీబీనగర్ ప్రాంతాల్లో ఎకరాల కొద్దీ భూములను ఉన్నట్లు తేలింది. లాకర్లు ఓపెన్ చేసినప్పుడు లభించిన పలు భూ పత్రాలపైనా శివబాలకృష్ణతో పాటు కుటుంబసభ్యులను ప్రశ్నించారు ఏసీబీ అధికారులు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ కొన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు ఇష్టమొచ్చినట్లు అనుమతులు ఇచ్చినట్లు ఏసీబీ గుర్తించింది. శివబాలకృష్ణ తన బినామీల పేరిట ఆస్తులు కూడబెట్టడమే కాకుండా అపార్ట్ మెంట్ కు అనుమతిస్తే ఫ్లాట్, విల్లాలకు అనుమతిస్తే...ఓ విల్లాను తన పేరుతో రాయించుకున్నట్లు తెలుస్తోంది.
కుటుంబసభ్యుల పేర్లతో పెట్టుబడులు, షేర్లు
అవినీతి అనకొండ శివబాలకృష్ణ, హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఆస్తులను చూసి....ఏసీబీ అధికారులే మతి పోతోంది. తవ్వుతున్న కొద్దీ ఒక్కొక్కటిగా లెక్కకు మించి బయటపడుతున్నాయి. కుటుంబ సభ్యులతో పాటు స్నేహితుల పేర్లతో భారీగా బినామీ ఆస్తులను కూడబెట్టినట్లు విచారణలో వెల్లడైంది. కుటుంబసభ్యులు, బాలకృష్ణ స్నేహితుల్ని సైతం ఏసీబీ విచారించింది. బాలకృష్ణతో సంబంధం ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులను కూడా ప్రశ్నించింది. ఆ సంస్థలకు లబ్ధి చేకూర్చి శివ బాలకృష్ణ వాటాలు తీసుకున్నట్టు అధికారులు గుర్తించారు. బాలకృష్ణ సోదరుడు శివసునీల్‌ను ఏసీబీ అధికారులు విచారించారు. సునీల్, అతని భార్య పేరుతోనూ భారీగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ప్రధానంగా రెండు రియల్ ఎస్టేట్ కంపెనీలతో శివబాలకృష్ణ పలు లావాదేవీలు జరిపినట్టు తెలిసింది. శివసునీల్ రెండు రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టబడులు పెట్టినట్లు తేల్చారు. ఆ రియల్ ఎస్టేట్ సంస్థలు ఎల్బీనగర్, బంజారాహిల్స్‌లోని హైరైజ్ టవర్స్‌ను నిర్మిస్తున్నాయి. పలువురు రియల్ ఎస్టేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీల్లోనూ బినామీల పేరిట షేర్లు కొనుగోలు చేశారు.
కాల్ డేటాపై ఏసీబీ దృష్టి
బాలకృష్ణ సెల్‌ఫోన్ డేటాపై ఏసీబీ దృష్టి సారించింది. కాల్ డేటా తీసుకొని విచారిస్తే...బినామీల వివరాలు, అండగా నిలిచిన అధికారులు, గత ప్రభుత్వంలో అండగా నిలిచిన రాజకీయ నేతలు ఎవరన్నది వెల్లడవుతుందని భావిస్తోంది. ఇప్పటి వరకు ఆయనకు 30 మంది అధికారులు సహకరించినట్లు గుర్తించారు. వీరిలో కొందర్ని ఇప్పటికే విచారించారు. బాలకృష్ణ ఇంట్లో రూ. 99.60 లక్షలు నగదు, 1988 గ్రాముల బంగారం, సిల్వర్ 6 కేజీలు సీజ్ చేశారు. 8.26 కోట్లు రూపాయలు విలువైన ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన ఆస్తుల విలువ మార్కెట్ వ్యాల్యూలో ఇంకా ఎక్కువ ఉంది. మిగిలిన బీనామీలపై విచారణ చేస్తున్నారు.