Medaram Jathara: తెలంగాణ రాష్ట్రంలో జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర... ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతర. ఈ జాతర ప్రతి రెండేళ్లకోసారి జరుగుతుంది. కుంభమేళ తర్వాత అంత పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చేది ఈ జాతరకే.  ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో జరిగే ఈ జాతరకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. తొలినాళ్లలో ఈ జాతరను ప్రధానంగా గిరిజనులు జరుపుకునేవారు.. రాను రాను అమ్మవార్ల మహిమలు తెలిసి అందరూ మొక్కుతున్నారు. మేడారం జాతరకు  దేశ, విదేశాల నుంచి సుమారు కోటి మంది భక్తులు హాజరవుతారని అంచనా. దీంతో భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు... నిర్వాహకులు, అధికారులు.


మేడారం భక్తులకు ఉచిత వైఫై సేవలు
ఈనెల 21 నుంచి 24 వరకు జరగనున్న మేడారం జాతర జరగనుంది. జాతర జరిగే ప్రాంతం... అటవీ ప్రాంతంలో కావడంతో భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా కమ్యూనికేషన్‌ సేవలపై ఫోకస్‌ పెట్టారు. సెల్ ఫోన్  సిగ్నల్స్, ఇంటర్నెట్, వైఫై సేవలకు ఇబ్బంది కలగకుండా BSNL ఏర్పాట్లు చేస్తోంది. జాతరలో సిగ్నలింగ్ వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు... భక్తులకు ఉచిత వైఫై సేవలు అందించేందుకు కృషి చేస్తున్నారు. భక్తులు అధికంగా ఉండే 16 ప్రధాన  ప్రాంతాల్లో ప్రజలందరూ ఉచితంగా వైఫై సేవలను వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మేడారం జాతరలో ఈనెల 15 నుంచి 25 వరకు ఉచిత వైఫై సేవలు అందించనుంది బీఎస్‌ఎన్‌ఎల్‌. 16 చోట్ల హాట్ స్పాట్ సేవలను కూడా అందుబాటులోకి  తేనుంది. గట్టమ్మ గుడి, కొత్తూరు రోడ్డు, కొత్తూరు పాఠశాల, ఊరట్టం క్రాస్‌రోడ్డు, కాజ్‌వే, రెడ్డిగూడెం పాఠశాల, హరిత హోటల్‌, నార్లాపూర్‌, ఇంగ్లిష్‌ మీడియం పాఠశాల, ఐటీడీఏ గెస్ట్‌ హౌస్‌, బస్టాండ్‌, వాచ్‌ టవర్‌, ఆసుపత్రులు, జంపన్నవాగు, ఆర్టీసీ  బస్టాండ్‌, ములుగు ప్రవేశద్వారం లో. మేడారంలోని వరి పొలాల్లో హాట్‌స్పాట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ హాట్‌స్పాట్‌ సెంటర్ల నుంచి వంద అడుగుల లోపు ఉన్న ఏ నెట్‌వర్క్ యూజర్ అయినా సులభంగా లాగిన్ అయి వైఫై సేవలను  ఉపయోగించుకోవచ్చు. 10 నుండి 20 Mbps వేగంతో 1 GB వరకు డేటాను ఉపయోగించవచ్చు. 


మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఆధార్‌ తప్పనిసరి 
మేడారం జాతరకు వెళ్లే భక్తులకు అధికారులకు కొన్ని ఆంక్షలు కూడా పెట్టారు. సమ్మక్క-సారలమ్మకు నిలువెత్తు బంగారం (బెల్లం) ఇచ్చి మెుక్కు తీర్చుకోవాలంటే కచ్చితంగా ఆధార్ కార్డు ఉండాల్సిందే అంటున్నారు. నిలువెత్తు బంగారం సమర్పించే  భక్తుల వివరాలను తప్పనిసరిగా సేకరించాలని... వ్యాపారులకు ఆదేశాలు జారీ చేసింది ఎక్సైజ్‌ శాఖ. నిలువెత్తు బెల్లం కొనుగోలు చేసే... భక్తుల నుంచి ఆధార్‌, ఫోన్‌ నెంబర్‌, అవసరమైతే ఇంటి అడ్రస్‌ తీసుకోవాలని తెలిపింది. వివరాలన్నీ ఇచ్చిన  భక్తులకే బెల్లాన్ని విక్రయించాలని వ్యాపారులకు హుకుం జారీ చేశారు. జాతర పేరుతో కొందరు అక్రమార్కులు బెల్లాన్ని గుడుంబా(సారా) తయారీ కోసం పక్కదారి పట్టించే అవకాశం ఉండటంతో... ఈ నిబంధన పెట్టామంటున్నారు ఎక్సైజ్‌ అధికారులు.  జాతరలో మెుక్కలు చెల్లించుకునేందుకు ఉపయోగించే బెల్లాన్ని.. గుడుంబా తయారీ కోసం విక్రయిస్తే లక్ష రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. 


మేడారం జాతరకు ఆర్టీసీ సేవలు
మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) కూడా సేవలు అందించేందుకు సిద్ధమైంది. జాతర వచ్చే భక్తుల కోసం 6 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. భక్తుల రద్దీ దృష్ట్యా ఈనెల 18  నుంచి 25వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను నడపుతున్నట్టు తెలిపింది. మహాలక్ష్మి పథకం కింద... జాతరకు వచ్చే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈనెల 16న మేడారంలో టీఎస్ఆర్టీసీ బేస్  క్యాంప్‌ను ప్రారంభిస్తామని తెలిపారు ఆర్టీసీ అధికారులు. మేడారం జాతరలో దాదాపు 14 వేల మంది ఆర్టీసీ సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల నుంచి మేడారానికి భక్తుల రద్దీ ఎక్కువగా  ఉంటుందని... దీంతో ఆయా జిల్లాల్లో 51 ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్లను గుర్తించారు. ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్లలో ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌.