తెలంగాణలో ఆర్టీసీలో ఫెస్టివల్ ఛాలెంజ్‌ మొదలైంది. దసరా నుంచి సంక్రాంతి వరకు ఈ ఛాలెంజ్‌ కొనసాగనుంది. ఈ టైంలో ఎక్కువ కిలోమీటర్లు నడిపేలా ప్రయత్నాలు చేస్తోంది తెలంగాణ ఆర్టీసీ. దీన్ని ఛాలెంజ్‌ను స్వీకరించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఉద్యోగులకు లేఖలు రాశారు.


తెలంగాణ ఆర్టీసీ ప్రస్తుతం సగటున రోజుకు 32 లక్షల కిలోమీటర్లకుపైగా ప్రయాణిస్తోంది. దాన్ని మరో లక్ష కిలోమీటర్లకు పెంచాలని భావిస్తోంది. అందుకే పండగల సీజన్‌ మొత్తాన్ని ఓ ఛాలెంజ్‌గా తీసుకొని పని చేయాలని సజ్జనార్‌ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. 


దసరా నుంచి తెలంగాణలో ప్రధానమైన పండగ సీజన్ మొదలవుతుంది. దసరా, బతుకమ్మ ఫెస్టివల్, దీపావాళి, క్రిస్మస్, సంక్రాంతి ఇలా ఒకదాని తర్వాత ఒకటి పండుగలకు జనాలు సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. అందుకే వారిని ఫోకస్డ్‌గా చేసుకొని ప్లాన్ చేస్తోంది. 


దసరా నుంచి సంక్రాంతి వరకు అంటే వంద రోజుల పాటు ఈ గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్ ఉండబోతోంది. ఈ టైంలో సిబ్బంది సెలవులు, వీకాఫ్‌లు తీసుకోకుండా పని చేయాలని సూచించారు సజ్జనార్. సిబ్బంది కొరత వల్ల చాలా సర్వీసులు రద్దు చేయాల్సి వస్తోందని అలాంటివి లేకుండా సెలవులు పోస్ట్‌పోన్ చేసుకోవాలని కోరారు. 


ఇలా సెలవులు రద్దు చేసుకొని పని చేసే వాళ్లకు కచ్చితంగా ప్రతిఫలం ఉంటుందన్నారు సజ్జనార్. వారికి క్యాష్ అవార్డులు ఇస్తామని ప్రకటించారు. రోజుకు కోటిన్నర రూపాయాల అదనపు ఆదాయాన్ని టార్గెట్ ఫిక్స్ చేశారు. అంటే వంద రోజుల్లో 150 కోట్లకుపైగా ఆదాయాన్ని సమకూర్చాలని ప్లాన్ చేశారు.