YS Vijayamma : వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉన్న ఆమెను చూసేందుకు షర్మిల తల్లి విజయమ్మ బయలుదేరారు. విజయమ్మ ఇంటి నుంచి బయటకు వస్తుండగా ఆమె వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. విజయమ్మ కారుకు పోలీసుల వాహనాన్ని అడ్డుపెట్టారు. దీంతో ఆగ్రహించిన విజయమ్మ కారు దిగి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. మహిళా కానిస్టేబుల్స్ విజయమ్మను అడ్డుకున్నారు. దీంతో విజయమ్మ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విజయమ్మను పోలీసులు గృహనిర్బంధం చేశారు. 



పోలీసులపై విజయమ్మ ఆగ్రహం 


"నేనేం ధర్నా చేసేందుకు పోతున్నానా. నా కూతురిని చూసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్తుంటే అడ్డుకుంటారా? నా ఇంటి వద్ద అల్లరి చేయాలను కుంటే ఆపండి. నేను ఇక్కడే ధర్నా చేస్తాను. మైక్ పెట్టి మాట్లాడమంటారా? రాష్ట్రం మొత్తం కార్యకర్తల్ని పిలవమంటారా? బంద్, ధర్నాలు, గొడవలు చేయమంటారా? నేను నా కూతురిని చూడడానికి వెళ్తున్నా? కావాలంటే నా వాహనం వెనకాలా రండి.  లేకపోతే నా కారులో ఒకరిద్దరూ రండి. తమాషాలు చేస్తున్నారా, పోలీసులను చూడలేదా, ప్రభుత్వాలు చూడలేదా? మేము ప్రభుత్వాలను నడిపినవాళ్లమే? మీలాంటి వాళ్లను చూసినవాళ్లమే. మీరు ఇలానే నన్ను ఆపితే రాష్ట్రం మొత్తం బంద్ కు పిలుపునిస్తాను." -వైఎస్ విజయమ్మ 


ప్రభుత్వాన్ని విమర్శిస్తే దాడులు చేస్తారా? 


పోలీసులు విజయమ్మ వాహనాన్ని అడ్డుకోవడంతో ఇంటి ముందే ఆమె ధర్నాకు దిగారు. 10 నిమిషాల్లో వైఎస్ షర్మిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.  కుమార్తెను చూడటానికి వెళ్తుంటే అడ్డుకుంటారా? అని ప్రశ్నించారు. షర్మిల చేసిన నేరమేంటి? ప్రభుత్వాన్ని విమర్శిస్తే దాడులు చేస్తారా? అంటూ మండిపడ్డారు. పాదయాత్ర చేయడం రాజ్యాంగ విరుద్ధమా? అని ప్రశ్నించారు. ప్రజల కోసం నిరసన తెలపడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు అన్నారు. ప్రజా సమస్యలపైనే షర్మిల మాట్లాడుతోందన్న విజయమ్మ.... షర్మిల వచ్చే వరకూ దీక్ష కొనసాగిస్తానన్నారు. షర్మిలను అరెస్ట్‌ చేయడంతో ఆమె భర్త అనిల్‌  ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు బయలుదేరి వెళ్లారు. పాదయాత్ర చేయడం తప్పా,  నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుందని అనిల్ తెలిపారు.


షర్మిల పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ 


వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. షర్మిల పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. సీఎం కేసీఆర్, రాజకీయ, మతపరమైన వ్యాఖ్యలు చేయొద్దని కోర్టు సూచించింది. షర్మిల తన పాదయాత్రలో భాగంగా ఎలాంటి అభ్యంతర వ్యాఖ్యలు చేయకూడదని సూచించింది. 


షర్మిల అరెస్ట్ 


 వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వరంగల్ జిల్లాలో పాదయాత్ర సందర్భంగా సోమవారం టీఆర్‌ఎస్‌ నేతలు షర్మిల ప్రచార రథం, వాహనాలపై దాడి చేశారు.  ఈ దాడికి నిరసనగా ప్రగతి భవన్‌కు ముట్టడికి వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. ప్రగతి భవన్ కు వస్తున్న షర్మిలను మార్గమధ్యలో పోలీసులు అడ్డుకున్నారు. టీఆర్‌ఎస్‌ నేతల దాడిలో ధ్వంసమైన కారు షర్మిల స్వయంగా డ్రైవ్‌ చేసుకుంటూ సీఎం క్యాంప్‌ ఆఫీస్‌కు బయలుదేరారు. రాజ్‌భవన్‌ రోడ్డులో వైఎస్‌ షర్మిలను ఆమెను అడ్డుకున్న పోలీసులు అరెస్ట్‌ చేశారు. కారులోంచి దిగేందుకు షర్మిల నిరాకరించడంతో.. కారును క్రేన్‌ ద్వారా లిఫ్ట్‌ చేసి ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అనంతరం బలవంతంగా కారు డోరు తెరిచి షర్మిలను కిందకు దించారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య షర్మిలను ఎస్ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల వ్యవహరించిన తీరుపై వైఎస్‌ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ధ్వంసం చేసిన వాహనాన్ని కేసీఆర్‌కు చూపించడానికి వెళ్తుంటే అడ్డుకుంటారా అంటూ మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.  ఐపీసీ 353, 333,327 సెక్షన్ల కింద ష‌ర్మిలపై  కేసు న‌మోదు చేశారు పోలీసులు.