Andhra News : ఏపీ మాజీ మంత్రి నారాయణకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. చిత్తూరు కోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు తీర్పును సవాల్ చేస్తూ నారాయణ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. తీర్పు రిజర్వ్ చేసింది. తీర్పు వెల్లడించే వరకూ తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. తాము తీర్పు ఇచ్చే వరకూ చిత్తూరు కోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు ఉత్తర్వులు పక్కన పెట్టాలని ఆదేశించింది. దీంతో నారాయణకు బెయిల్ కొనసాగుతున్నట్లయింది. హైకోర్టు తుది తీర్పును బట్టి పోలీసులు తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
తుది తీర్పు ఇచ్చే వరకూ నారాయణపై చర్యలొద్దన్న హైకోర్టు
చిత్తూరు మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పును జిల్లా కోర్టు కొట్టివేయడం సమంజసం కాదని నారాయణ తరపు న్యాయవాదులు హైకోర్టులో వాదించారు. అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్ట్ ఇచ్చిన మార్గదర్శక సూత్రాలను తప్పించుకునేందుకే ఐపీసీలోని 409 సెక్షన్ పెట్టారని న్యాయవాది అన్నారు. నారాయణ 2014లోనే విద్యాసంస్థల డైరెక్టర్ పదవికి రాజీనామా చేసిన పత్రాలను కోర్టుకు అందించించారు. జిల్లా కోర్టు కేవలం పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినలేదనే ఉద్దేశంతోనే బెయిల్ రద్దు చేసిందన్నారు. సహనిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నారాయణపై కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను సస్పెండ్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో అరెస్ట్
పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీకేజీ కేసులో మాజీమంత్రి నారాయణపై చిత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి ఈ ఏడాది ఏప్రిల్‌లో అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. అయితే న్యాయస్థానం అయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో కింది కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది చిత్తూరు కోర్టులో మరో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం నారాయణ బెయిల్ రద్దు చేస్తూ నవంబర్ 30వ తేదీ లోపల పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 30 లోపు పోలీసులకు లొంగిపోవాలంటూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది.దీనిపైనే కోర్టున ుఆశ్రయించారు.
ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఇటీవలే ఆయనను ఇంట్లో ప్రశ్నించిన సీఐడీ
మాజీ మంత్రి నారాయణపై సీఐడీ పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. ఇటీవలే ఏపీ రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు మాస్టర్ ప్లాన్ అవకతవకలపై ఆయనను సీఐడీ పోలీసులు ప్రశ్నించారు. అనారోగ్యంతో బాధపడుతున్న నారాయణ.. ఇటీవలే శస్త్రచికిత్స చేయించుకున్నారు. దీంతో సీఐడీ విచారణకు హాజరుకాలేడని ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. వారి అభ్యర్థన మేరకు నారాయణను హైదరాబాద్లోని ఆయన స్వగృహంలో ప్రశ్నించవచ్చని సీఐడీకి హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు అధికారులు ఆయన కూతురు నివాసంలో నారాయణను ప్రశ్నించారు. తాజాగా ప్రశ్నాపత్రాల కేసులో ఆయనకు ఊరట లభించింది.
‘బాబాయ్ కేసు పక్క రాష్ట్రానికి, అబ్బాయ్ చంచల్ గూడ జైలుకి’ నారా లోకేష్