Hyderabad Rains : హైదరాబాద్ వాతావరణం చల్లబడింది. నగరంలో పలు చోట్ల వర్షం పడింది. ఉరుములు, మెరుపులతోపాటు ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్, జీడిమెట్ల, కొండాపూర్, కుత్బుల్లాపూర్, దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపరి, కొత్తపేట ప్రాంతాల్లో వర్షం పడింది. మధ్యాహ్నం వరకూ భానుడి మండిపోయాడు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న వేళ ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో నగరవాసులకు కాస్త ఉపశమనం కలిగింది. 






చిరుజల్లులతో కాస్త ఉపశమనం 


గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు భానుడి ఎండి తీవ్రత అధికంగా ఉంది. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారింది. దీంతో నగరంలోని పలు చోట్ల చిరు జల్లులు పడ్డాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం పడింది. మాదాపూర్, జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, నాంపల్లి, ఎల్బీనగర్, హయత్ నగర్, సికింద్రాబాద్, ఉప్పల్, నాగోల్, శామీర్ పేటలో వర్షం కురిసింది. మలక్ పేటలో ఈదురుగాలుల దాటికి చెట్లు విరిగిపడ్డాయి. ఉదయం నుంచి ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన నగరవాసులు చిరుజల్లులతో కాస్త ఉపశమనం పొందారు. 


ఈదురుగాలులతో కూలిన చెట్లు


హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, హైదర్‌నగర్‌, ప్రగతినగర్‌, నిజాంపేట్‌, మలక్‌పేట ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం పడింది. పాతబస్తీ ప్రాంతంలోని చాంద్రాయణగుట్ట, బార్కాస్, బహదూర్‌పురా, ఫలక్‌నుమా తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. మలక్‌పేటలో ఈదురుగాలుతో ద్విచక్రవాహనంపై చెట్టు కూలింది. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్ అయింది. మరోవైపు రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ఎండల తీవ్రత కారణంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎండలతో తీవ్ర ఉక్కపోత, వడదెబ్బలతో జనాలు విలవిలలాడిపోతున్నారు. మధ్యాహ్నం పూట ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టాలంటేనే హడలెత్తిపోతున్నారు.