Corona Fouth Wave : దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి. దేశంలో ఫోర్త్ వేవ్ వస్తుందని కొన్ని కథనాలు వస్తున్నాయి. ఈ తరుణంలో తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్. శ్రీనివాసరావు స్పందించారు. సీరో సర్వే ప్రకారం తెలంగాణలో ఫోర్త్‌వేవ్ వచ్చే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. గతంలో థర్డ్ వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామన్నారు. ఫోర్త్ వేవ్‌పై అనేక సందేహాలు ఉన్నాయని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. అయితే రానున్న రోజుల్లో తెలంగాణలో కేసులు పెరగనున్నాయి అని తెలిపారు. ప్రస్తుతానికి తెలంగాణలో రోజుకు 20-25 కరోనా కేసులు మాత్రమే నమోదు అవుతాయని చెప్పారు. రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందని డీహెచ్ వెల్లడించారు. మాస్కులు, శానిటైజర్లు ఉపయోగించాలని ప్రజలకు డీహెచ్  సూచించారు. 


రాష్ట్రంలో కోవిడ్ నిబంధనలు ఎత్తివేయలేదు 


తెలంగాణలో కోవిడ్ నిబంధనలు ఎత్తివేయలేదని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. మాస్క్ ధరించకపోతే రూ.1000 ఫైన్ విధిస్తామని హెచ్చరించారు. కోవిడ్‌ పూర్తిగా పోలేదని, రానున్న మూడు నెలల పాటు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు పెరగలేదని హైదరాబాద్ తప్ప మరెక్కడా 10కి పైగా కేసులు నమోదు కావడం లేదన్నారు. గత నాలుగు రోజులుగా కోవిడ్ వివరాలను సీఎం తెలుసుకుంటున్నారని తెలిపారు.  ఏప్రిల్, మే, జూన్ నెలల్లో వివాహాలు, విహారయాత్రలు ఎక్కువగా ఉన్న కారణంగా కేసుల పెరిగే అవకాశం ఉందన్నారు. ఫోర్త్ వేవ్‌ నుంచి ప్రజలు బయటపడాలంటే ప్రతి ఒక్కరు తప్పకుండా వ్యాక్సిన్‌ వేసుకోవాలని శ్రీనివాసరావు తెలిపారు. ప్రతి ఒక్కరూ కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో 106 శాతం జనాభాకు మొదటి డోసు వ్యాక్సిన్స్ ఇచ్చామన్నారు. రెండో డోసు వంద శాతం మంది తీసుకున్నారని డీహెచ్ తెలిపారు. ప్రభుత్వ చర్యలు, ప్రజల అప్రమత్తతో థర్డ్‌ వేవ్‌లో తక్కున నష్టంతో బయటపడ్డామని ఆయన పేర్కొన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో తాజాగా కేసులు పెరుగుతున్నాయని డీహెచ్ హెచ్చరించారు. 60 ఏళ్ల పైబడిన వారికి ప్రభుత్వం వైద్యారోగ్య శాఖ కేంద్రాల్లో బూస్టర్‌ డోసు ఇస్తున్నామన్నారు. అర్హత ఉన్నవారు వ్యాక్సిన్‌ తీసుకోవాలని శ్రీనివాసరావు సూచించారు.  


డిసెంబర్ నాటికి ఫ్లూగా మారవచ్చు


కోవిడ్ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని డీహెచ్ శ్రీనివాసరావు సూచించారు. వచ్చే మూడు నెలల పాటు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉందన్నారు. అయితే పక్క రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏప్రిల్, మే, జూన్ వరకు వివాహాలు, విహారయాత్రలు ఎక్కువగా ఉంటాయన్న ఆయన.. వచ్చే మూడు నెలలు ప్రభుత్వ మార్గదర్శకాలు ప్రజలు పాటించాలన్నారు. కోవిడ్‌ ఎక్స్‌ఈ వేరియంట్‌ ఎక్కువ ప్రభావం ఉండకపోవచ్చారు. 2022 డిసెంబర్ నాటికి కోవిడ్ పూర్తిగా ఫ్లూగా మారే అవకాశం ఉందన్నారు.