Vemula Prashanth Reddy Counter to Botsa : పక్క రాష్ట్రంలో కరెంట్ కోతలు, రోడ్లు సరిగ్గా లేవని తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు వరుసగా కౌంటర్ ఇస్తున్నారు. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ తాను ఇటీవల హైదరాబాద్ లో ఉన్నానని, విద్యుత్ లేక జనరేటర్ వాడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌లో విద్యుత్‌ కోతలతో జనరేటర్‌ వాడుతున్నామని మంత్రి బొత్స చేసిన ఆరోపణలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ఏపీలో పరిస్థితి గురించి మంత్రి కేటీఆర్ వాస్తవాన్నే ప్రస్తావించారన్నారు. మంత్రి కేటీఆర్‌ ఏపీ గురించి నిజమే చెప్పారన్నారు. ఏపీని అభివృద్ధి చేస్తే ఎవరూ అడ్డుపడరన్నారు. విజయవాడ నుంచి స్థిరాస్తి వ్యాపారులు హైదరాబాద్‌ వస్తున్నారని ప్రశాంత్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మౌలిక సదుపాయాలు బాగున్నాయన్నారు. మంత్రి బొత్స కుటుంబం కూడా హైదరాబాద్ లోనే ఉంటుందని గుర్తుచేశారు. ముందు ఏపీలో రోడ్లు బాగుచేసుకోవాలని హితవు పలికారు. 


కరెంటు బిల్లు కట్టలేదేమో!  


ఏపీ మంత్రి బొత్స కరెంట్ బిల్లు కట్టకపోయి ఉండొచ్చని అందుకే కరెంట్ కట్ చేసి ఉంటారని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కరెంట్ కోతలు లేవన్నారు. రాష్ట్రంలో రెండు నిమిషాలు కూడా కరెంట్ పోవడం లేదన్నారు. వైసీపీ నేతలు, వారి కుటుంబాలు మొత్తం హైదరాబాద్‌లోనే ఉంటున్నారని, వాళ్లను అడిగితే వాస్తవాలు తెలుస్తాయన్నారు. తెలంగాణలో కేసీఆర్ పాలన బాగుందని, కేసీఆర్ అభిమానులమని చాలా మంది వైసీపీ ఎంపీలు పలు మార్లు చెప్పారని రంజిత్‌ రెడ్డి అన్నారు. ఏపీ పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నారని అనడం విడ్డూరంగా ఉందన్నారు. 


మంత్రి బొత్స ఏమన్నారంటే? 


ఏపీలో దుర్భర పరిస్థితులు ఉన్నాయని మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ పై మంత్రి బొత్స స్పందించారు. తాను నిన్నటి వరకూ హైదరాబాద్‌లో ఉన్నానని అప్పుడు అసలు కరెంటే లేదని జనరేటర్ మీద ఆధారపడాల్సి వచ్చిందని బొత్స అన్నారు. తాము ఎవరికీ చెప్పలేదన్నారు. కేటీఆర్ అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. తాము అభివృద్ధి చేస్తే గొప్పగా చెప్పుకోవాలి కానీ పక్క రాష్ట్రం గురించి వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఆక్షేపిస్తున్నానన్నారు. బాధ్యత గల వ్యక్తులు అలా మాట్లాడకూదని కేటీఆర్ తన వ్యాఖ్యలను విత్ డ్రా చేసుకోవాలని  బొత్స డిమాండ్ చేశారు. 


డబుల్ బెడ్ రూమ్ ఇస్తామన్నారు, ఏమైంది? : కారుమూరి 


కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పందించారు. కేటీఆర్ ఏదో మెహర్బానీ కోసం మాట్లాడారని విమర్శించారు. ఎవరో చెప్పిన విషయం పట్టుకుని మంత్రి కేటీఆర్  మాట్లాడారన్నారు. రోడ్లు గతంలో పాడయ్యాయని, ఇప్పుడు రోడ్ల మరమ్మతులు జరుగుతున్నాయన్నారు. జూన్ వరకు రోడ్లు పూర్తవుతాయని తెలిపారు. తెలంగాణలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామన్నారని, ఏమైందని ప్రశ్నించారు.