ఆంధ్రప్రదేశ్‌లో దుర్బర పరిస్థితులు ఉన్నాయంటూ కేటీఆర్ చేసిన కామెంట్పై వైఎస్ఆర్‌సీప మంత్రులు స్పందిస్తున్నారు. తాను నిన్నటి వరకూ హైదరాబాద్‌లో ఉన్నానని తనకు అసలు కరెంటే లేదని జనరేటర్ మీద ఆధారపడాల్సి వచ్చిందని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. తాము ఎవరికైనా చెప్పలేదన్నారు. కేటీఆర్ అలాంటి వ్యాఖ్యలు చేయకూడదన్నారు. తాము అభివృద్ది చేస్తే గొప్పగా చెప్పుకోవాలి కానీ పక్క రాష్ట్రం గురించి వ్యాఖ్యలు చేయడం సరి కాదన్నారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఆక్షేపిస్తున్నా. బాధ్యత గల వ్యక్తులు అలా మాట్లాడోచ్చా? ఆయన తన వ్యాఖ్యలను విత్ డ్రా చేసుకోవాలని’’  బొత్స డిమాండ్ చేశారు. 



ఏపీ పరిస్థితిపై కేటీఆర్ చెప్పింది అక్షర సత్యమని జనసేన పార్టీ ప్రకటించింది. వైఎస్ఆర్‌సీపీ నాయకులు విజయవాడ నగరంలో అభివృద్ధి కేటీఆర్ గారికి కాదు తమకు చూపించాలని సవాల్ చేసారు. రంగు మారిన మంచి నీళ్లు 10 రోజుల నుంచి సరఫరా అవుతుంటే చర్యలు తీసుకోలేక పోయారని.. అభివృద్ధి అంటే రాజధానిని నిర్వీర్యం చేయడమా అని ఆ పార్టీ నేత పోతిన మహేష్ ప్రశ్నించారు. 





కేటీఆర్ వ్యాఖ్యలను టీడీపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పాలనా తీరు ఎలా ఉందో అందరికీ తెలిసిపోతోందని ఎద్దేవా చేస్తున్నారు.


 






తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ లోని విద్యుత్ సమస్యల పై కామెంట్ చేయడాన్ని మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్పుబట్టారు. తెలంగాణలో సింగరేణి గనులలో బొగ్గు  పుష్కలంగా ఉండడంతో విద్యుత్ కోతలు లేవని అన్ని రాష్ట్రాలలో అదే పరిస్థితి  ఉండదు అన్న విషయాన్ని గమనించాలని సూచించారు. రాబోయే రోజుల్లో ఎలక్షన్లు  వస్తున్న నేపథ్యంలోనే ఇలాంటి కామెంట్లు చేయడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు.


వైఎస్ఆర్‌సీపీ నేతలు..  కూడా పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. టీడీపీ నేతలు.. కేటీఆర్ కామెంట్లను సమర్థిస్తున్నారు. కానీ  వైఎస్ఆర్‌సీపీ నేతలు మాత్రం ఉద్దేశపూర్వకంగా అలా చేస్తున్నారని విమర్శిస్తున్నారు.  కేటీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణలో కన్నా ఏపీలో ఎక్కువ రాజకీయ దుమారం రేగే అవకాశం కనిపిస్తోంది.  కేటీఆర్ వ్యాఖ్యలకు మద్దతుగా.. వ్యతిరేకంగా  అధికార, ప్రతిపక్షాలు వాదోపవవాదాలకు దిగడం  ఖాయంగా కనిపిస్తోంది.