TS Teachers Transfers : ఉపాధ్యాయ దంపతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉపాధ్యాయుల స్పౌజ్ కేటగిరీ బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బదిలీల విషయంలో గత కొంత కాలంగా ఉపాధ్యాయ దంపతులు ఆందోళన చేస్తున్నారు. ఉపాధ్యాయుల స్పౌజ్‌ కేటగిరీ బదిలీలకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. టీచర్ దంపతులను ఒకే చోటుకు బదిలీ చేయాలని ఇటీవల ఉపాధ్యాయులు ఆందోళన చేయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో నిలిపివేసిన 12 జిల్లాల్లోని ఉపాధ్యాయ దంపతుల బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సూర్యపేట మినహా 12 జిల్లాల్లో 427 మంది టీచర్లను ట్రాన్స్ ఫర్ చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ఈనెల 27వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.


బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ మొదలు


తెలంగాణలో శుక్రవారం (జనవరి 27) నుంచి టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ మొదలుకానుంది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ గురువారం (జనవరి 26న) ఉత్తర్వులు (జీవో నంబ‌ర్ 5) జారీ చేశారు. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు, మాన్యువల్‌గా పదోన్నతులు జరగనున్నాయి. జనవరి 27న కేటగిరీ ఖాళీలు, ప్రధానోపాధ్యాయుల పదోన్నతికి అర్హులైన స్కూల్ అసిస్టెంట్స్ సీనియారిటీ జాబితాలు ఆన్‌లైన్‌లో ప్రకటిస్తారు. జనవరి 28 నుంచి 30 వరకు బదిలీల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించునున్నారు. ఉపాధ్యాయులు తమ దరఖాస్తుల హార్డ్‌ కాపీలను ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు సంబంధిత ప్రధానోపాధ్యాయులకు సమర్పించాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత టీచర్లు సంబంధిత ఎమ్​ఈవోలకు హార్డ్‌కాపీలను సమర్పించాలి. ఇక మండల పరిషత్ ప్రాథమిక, ప్రాథమికోన్నత ఉపాధ్యాయులు సంబంధిత కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు డీఈవోకు సమర్పించాలి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2లోపు ఈ ప్రక్రియ ముగియాల్సి ఉంటుంది. మార్చి 5 నుంచి 19వ తేదీ వరకు అప్పీళ్లకు అవకాశం కల్పించారు. దరఖాస్తులు అందిన 15 రోజుల్లోనే అప్పీళ్లను పరిష్కరించనున్నారు.


2018 తర్వాత 


సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో టీచర్ల బదిలీలు, పదోన్నతులపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇటీవల అధికారులతో ఇటీవల సమీక్ష నిర్వహించారు. జనవరి 28 నుంచి ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని ఈ మేరకు అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. బదిలీల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలన్నారు. బదిలీలు, పదోన్నతుల పూర్తి షెడ్యూల్‌ వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ముందు గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులకు బదిలీలు చేపట్టనున్నారు. అనంతరం హెచ్‌ఎం ఖాళీలను స్కూల్‌ అసిస్టెంట్లకు ప్రమోషన్ ఇచ్చి ట్రాన్స్ ఫర్ చేస్తారు.  సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు పదోన్నతులు ఇచ్చి స్కూల్‌ అసిస్టెంట్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు. తెలంగాణలో 2015 జులైలో బదిలీలు, పదోన్నతులు చేపట్టారు. మరోసారి 2018లో టీచర్ల బదిలీలు చేశారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. 


మూడేళ్ల మినహాయింపు!  


అయితే పదవీ విరమణకు ఇంకా మూడేళ్ల సర్వీస్‌ మాత్రమే ఉన్నవారిని ఈసారి బదిలీ చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో రెండేళ్ల సర్వీస్‌ ఉన్నవారికి బదిలీ నుంచి మినహాయింపు ఇచ్చింది. పదవీ విరమణ వయసును 58 నుంచి 61 ఏళ్లకు పెంచడంతో ఈసారి మూడేళ్ల సర్వీస్‌ మిగిలి ఉన్నా బదిలీ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇప్పటి వరకు బదిలీలను వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా, పదోన్నతులను ఆఫ్‌లైన్‌లో నిర్వహించేవారు. అయితే ఈసారి పదోన్నతులను వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా కేటాయించే అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.