CM KCR On PM Modi : ప్రధాని మోదీని బీజేపీ నేతలు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. పొగడడంలో కూడా ఒక లిమిట్ ఉంటుంది. మరీ ఎక్కువ పొగిడినా ప్రమాదమే. దానికీ ఓ సందర్భం ఉండాలి. మంచిపని చేస్తే నిజంగా పొగడాలి. కానీ ప్రతిసారి పొగిడితే మోదీ తాను నిజంగానే గొప్ప అనుకుంటారు. అది నిజంగా జరుగుతుంది. మోదీ పార్లమెంట్ లోకి రాగానే మోదీ మోదీ అని భజన చేస్తున్నారు.  ద్రవ్యవినిమయ బిల్లుపై జరిగిన చర్చలో అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడారు. 



మోదీపై పిట్టకథ 


"ఓ రాజు ఉంటాడు. ఆ రాజు పేరు తిరుమలరాయుడు. అతనికి ఒకటే కన్ను ఉంటుంది. కన్ను లేదని అతడు బాధపడతాడు. ఆ రాజును కవి పొగడాలి. కన్ను లేకపోయినా పొగడాలి. ఆయనను సంతోషపెడితా నీకు మంచి లాభం ఉంటుందని కవితో అంటారు. కవికి ఇష్టంలేకపోయినా అన్నాతిగూడి హరుడవు.. అన్నాతిని గూడనపుడు అసుర గురండవు. అన్నా తిరుమలరాయ కన్నొక్కటే లేదు కానీ, నీవు కౌరవపతివే అని రాజును పొడిగాడు కవి. అంటే భార్యతో ఉన్నప్పుడు నీవు శివుడవు అంటే నీకు మూడు కళ్లు. నీకు కన్నులేదని బాధపడకు. ఇక భార్యతో లేనప్పుడు అసరు గురుడవు అంటే రాక్షసుల గురువు శుక్రాచార్యుడవి. ఆయనకు ఒకటే కన్ను ఉంటుంది. అప్పుడూ నువ్వు గొప్పవాడివే. ఆ కన్ను కూడా లేకపోయినా నువ్వు  కౌరవపతివే. అంటే ధృతరాష్ట్రుడంతటి వాడివి అని ఆ కవి రాజును పొగిడాడు. అలాగే మోదీని కూడా బీజేపీ నేతలు పొగుడుతున్నారు. ఎక్కడ లోపాలున్నాయో చెప్పకుండా అంతా బాగుంది బాగుందని ఎక్కడదాకా చెప్తారంటే మోదీ మాజీ ప్రధాని అయ్యో వరకూ చెబుతారు. మనకేం తక్కువ సార్ దిగిపోయినా మాజీ ప్రధాని అవుతావు చెబుతారు బీజేపోళ్లు. అదానీ వ్యవహారంపై దేశం మొత్తం చర్చించుకుంటుంది. మన దగ్గర మోదీ మీడియా అయ్యింది కాబట్టి వాళ్లు నిజాలు రాయడంలేదు. ఎందుకో వాళ్లకే తెలుసు. కానీ అంతర్జాతీయ మీడియా మాత్రం నిజాలు బయటపెడుతోంది." - సీఎం కేసీఆర్ 


 మోదీ గెలిచారు, దేశం ఓడింది


"మన్మోహన్ సింగ్ బాగా పనిచేసినా బీజేపీ బద్నాం చేసింది. మోదీ కంటే మన్మోహన్‌సింగ్ ఎక్కువ పనిచేశారు. కాంగ్రెస్ బాగా పనిచేయలేదని 2014లో మోదీకి ఓటేశారు. పెనంపై నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యింది. మోదీ గెలిచారు దేశం ఓడింది. మన్మోహన్‌ కన్నా మోదీ పాలనలో దేశం ఎక్కువ నష్టపోయింది. ఎప్పుడో చనిపోయిన నెహ్రూ, ఇందిరాగాంధీ పేర్లతో రాజకీయమేంది?  నువ్వెన్ని ప్రభుత్వాలు కూలగొట్టావంటే నువ్వెన్ని అంటూ మోదీ, రాహుల్‌ గొడవపడుతున్నారు. దేశం పరిస్థితి క్రిటికల్‌గా ఉంటే మోదీ మాట్లాడరు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగింది. దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి కూడా రాలేదు. ఇదేనా ఫెడరల్ వ్యవస్థ?. మనకు రావాల్సిన రూ.470 కోట్లు ఏపీకి ఇచ్చారు. మావి మాకు ఇవ్వాలని ఏడేళ్ల నుంచి అడుగుతున్నాం. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న మోదీ దిల్లీకి కూడా నీళ్లు ఇవ్వడం లేదు. పరిశ్రమలు మూతబడుతున్నాయ్.. బీజేపీ అధికారంలోకి వచ్చాక 20 లక్షల మంది దేశ పౌరసత్వాన్ని వదిలేశారు. ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది?" -సీఎం కేసీఆర్