TRS Leaders Meet : ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. టీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ (ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు) పార్లమెంటరీ పార్టీ (ఎంపీలు), టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గంతో సంయుక్త సమావేశం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో పార్టీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలల్లో పార్టీ వ్యూహంపై నేతలను సమాయత్తం చేయడమే ముఖ్య ఎజెండాగా ఈ సమావేశం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే బీఆర్‌ఎస్‌పై బహిరంగ ప్రకటన జారీ చేశారు. బీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత పార్టీ యంత్రాంగం ఏ విధంగా పనిచేయాలో కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ కమిటీలు, ఇతర రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. మునుగోడు ఉపఎన్నిక అనుభవాలు, ఓటింగ్‌పై చర్చ అనంతరం మిగిలిన వాటిపై చర్చించనున్నట్టు సమాచారం.
బీఆర్ఎస్ వ్యూహంపై
తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచింది. కాంగ్రెస్ కూడా కొన్ని చోట్ల బలంగా ఉంది. బీజేపీ, కాంగ్రెస్ పట్ల ఎలా వ్యవహరించాలనే దానిపై ఈ భేటీలో చర్చ జరిగే అవకాశముంది. ప్రధాని మోదీతో పాటు, బీజేపీ పెద్దలు తెలంగాణపై దృష్టి పెట్టడంతో వాటిని ఎలా ఎదుర్కొవాలనే దానిపై ప్రధానంగా చర్చ జరగనుంది. బీజేపీని ఎలా ఎండగట్టాలనే అంశంపై టీఆర్‌ఎస్ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలనే దానిపై చర్చించనున్నారు. టీఆర్‌ఎస్ బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత జాతీయ స్థాయిలో ఎలాంటి పోరాటాలు చేయాలి, ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలో కేసీఆర్ పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు. రాజకీయంగా ఎలాంటి ఉద్యమాలు చేయాలనే దానిపై చర్చ జరిగే అవకాశమున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే కేంద్ర దర్యాప్తు సంస్థలు టీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేయడంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కేసీఆర్ ను టార్గెట్ చేసిన బీజేపీ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగాల స్టైల్ ఎప్పుడు ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం. జూలైలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మోదీ సభ జరిగింది. అప్పట్లో కూడా టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉద్రిక్తత ఉంది. తనను మోదీ చీల్చి చెండాడుతారని.. అంతకు ముందు మీడియా సమావేశంలో కేసీఆర్ అభిప్రాయపడ్డారు. కానీ మోదీ మాత్రం సభలో కేసీఆర్, టీఆర్ఎస్ ప్రస్తావన తీసుకురాకుండా ప్రసంగించారు. కానీ ఈ సారి మాత్రం నేరుగా కేసీఆర్‌ను టార్గెట్ చేశారు. అవినీతి ప్రభుత్వ కూలిపోతుందని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో తెలంగాణలో మోదీ వార్ డిక్లేర్ చేసినట్లయిందని చెబుతున్నారు. మోదీ తెలంగాణ పర్యటనలో ఈ సారి రాష్ట్రంలో పాగా వేసేందుకు ఫోకస్ పెట్టినట్లు భావిస్తున్నారు. ఎందుకంటే గత పర్యటనలకు భిన్నంగా ఈ సారి మోడీ టూర్ కొనసాగింది. ఎప్పుడు తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేయని మోదీ.. హైదరాబాద్ కు ఎంట్రీతోనే రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. హైదరాబాద్ కు రాగానే బేగంపేట సభలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన మోదీ రామగుండం సభలో సింగరేణిని ప్రైవేటీకరించబోమంటూ క్లారిటీ ఇచ్చి అధికార, విపక్షాల విమర్శలకు చెక్ పెట్టారు. సింగరేణిపై హైదరాబాద్ నుంచి కొందరు అసత్య ప్రచారం చేస్తున్నాని.. తన పర్యటనతో కొందరికి నిద్ర కూడా పట్టదంటూ కేసీఆర్ కు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.
టీఆర్ఎస్ ను బీజేపీ అధిష్ఠానం ఢీకొట్టేందుకు సిద్ధమైన తరుణంలో జరుగుతున్న టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం కీలకంగా మారింది.
Also Read : Mlas Poaching Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, మరిన్ని అరెస్టులకు అవకాశం?