Mlas Poaching Case : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఏపీ, కేరళ, హరియాణా, కర్ణాటక, హైదరాబాద్ లో సిట్ అధికారుల బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. హరియాణా, కర్ణాటకలోని రామచంద్ర భారతి నివాసాల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అలాగే తిరుపతిలోని సింహయాజీ స్వామీజీ ఆశ్రమంలో సిట్ సోదాలు చేస్తుంది. కేరళలోని ఓ డాక్టర్ ఇంట్లో సిట్ బృందం తనిఖీలు చేసినట్లు సమాచారం. రామచంద్ర భారతికి కొచ్చిలో ఉండే డాక్టర్ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే సిట్ తనిఖీల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. సింహయాజీ తిరుపతి నుంచి హైదరాబాద్ రావడానికి ఓ జాతీయ పార్టీ నేత బంధువు ఫ్లైట్‌ టికెట్ బుక్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు.


నందకుమార్ అక్రమ నిర్మాణాలు కూల్చివేత 


ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితుడు నందకుమార్ కు చెందిన చెందిన అక్రమ నిర్మాణాలు జీహెచ్ఎంసీ ప్లానింగ్ సిబ్బంది కూల్చివేసింది. నిర్మాత దగ్గుపాటి సురేశ్ బాబుకు చెందిన స్థలాన్ని నందకుమార్ లీజుకు తీసుకున్నారు. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా దక్కన్ కిచెన్ ప్రాంగణంలో రెండు అక్రమ నిర్మాణాలు చేపట్టారు.  ఈ విషయం నిర్మాత సురేష్ బాబు అధికారులకు ఫిర్యాదు చేయగా.. స్పందించిన అధికారులు నందకుమార్ కు నోటీసులు ఇచ్చారు. అక్రమంగా నిర్మిస్తున్న భవనం నిర్మాణ పనులను వెంటనే ఆపేయాలని తెలిపారు. అయినప్పటికీ నంద కుమార్ పట్టించుకోకపోవడంతో ఫిలింనగర్ లో ఉన్న నందకుమార్ అలియాస్ నందు హోటల్ డెక్కన్ కిచెన్ భవనాన్ని కూల్చి వేశారు. అయితే అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  


సిట్ దర్యాప్తు 


ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు ముందుకు సాగుతోంది. తెలంగాణ సర్కార్ సిట్ ఏర్పాటు చేసింది. ముగ్గురు నిందితుల రెండు రోజుల కస్టడీ కూడా పూర్తయింది. రెండు రోజుల్లో తెలుసుకోగలిగినంత సమాచారం తెలుసుకున్నారు.  కేసీఆర్ చెప్పిన దాని ప్రకారం చూస్తే.. 23 మంది ముఠా ఉందని అందరికీ తెలిసింది. వీళ్లెవరు ? ఎక్కడెక్కడ ఉంటారు ? వారందర్నీ ఎలా పట్టుకొస్తారనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఈ కేసులో ముందుగానే విడుదల చేసిన సాక్ష్యాలు ఎంత వరకూ చెల్లుతాయనే సందేహం ఉండనే ఉంది. ఈ క్రమంలో అన్నీ వివరాలు తెలుసుకోవడానికి పోలీసులు ఆ నలుగురు ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తారా లేదా అన్న చర్చ కూడా ప్రారంభమయింది. 


ఎమ్మెల్యేలకు బెదిరింపులు 


తెలంగాణలో కొద్ది రోజులుగా ఎమ్మె్ల్యేల కొనుగోలు వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనిపై విచారణ కోసం ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు టీమ్ దీనిపై విచారణ జరుపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నలుగురు ఎమ్మెల్యేల్లో ఒకరైన వికారాబాద్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ మేరకు తనకు అపరిచిత వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  తనకు ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్‌ రాష్ట్రాలకు చెందిన దాదాపు 11 నెంబర్ల నుంచి ఫోన్ కాల్స్‌ వచ్చాయని ఫిర్యాదులో చెప్పారు. ఆ ఫోన్ కాల్స్ చేసిన వారిలో కొంత మంది తనను హత్య చేస్తామంటూ బెదిరించినట్టుగా రోహిత్‌ రెడ్డి పోలీసులకు చెప్పారు. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు. అలాగే మరో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో పోలీసులు మరో కేసు నమోదు చేశారు.