AAP Councillor Climbs Tower:


అమ్ముకున్నారంటూ ఆరోపణలు..


ఎన్నికలొస్తున్నాయంటే పార్టీలకు గెలుపోటముల టెన్షన్‌తో పాటు మరో టెన్షన్ కూడా ఉంటుంది. "ఎవరికి టికెట్ ఇవ్వాలి" అని బుర్ర బద్దలు కొట్టుకుంటాయి. ఒకరికి ఇచ్చి మరొకరికి ఇవ్వకపోతే అలకలు, ఆగ్రహాలు...అదీ కాకపోతే ఏకంగా పార్టీ మారిపోవడాలు. ఇలాంటివెన్నో జరుగుతూనే ఉంటాయి. ప్రతి ఎన్నికల్లోనూ కనిపించే సీనే ఇది. ఒక్కోసారి టికెట్ దక్కని ఆశావహులు అధిష్ఠానాన్ని తిట్టిపోస్తారు. కానీ...ఈ అభ్యర్థి మాత్రం అంతకు మించి చేశాడు. భార్య పుట్టింటికి రాలేదని, లవర్ తన లవ్‌ని యాక్సెప్ట్ చేయలేదని టవర్‌ ఎక్కుతుండటం చూస్తూ ఉంటాంగా. ఇప్పుడు ఓ రాజకీయ నేత టికెట్ దక్కలేదని ఇదే పని చేశాడు. ఢిల్లీలోని ఆమ్‌ఆద్మీ పార్టీ మాజీ కౌన్సిలర్ హసీబ్ ఉల్ హసన్ ఇలా వింతగా ప్రవర్తించి వార్తల్లో నిలిచాడు. మరి కొద్ది రోజుల్లోనే ఢిల్లీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో టికెట్ ఆశించిన హసీబ్..అది దక్కకపోయే సరికి అసహనానికి గురయ్యాడు. శాస్త్రి పార్క్ మెట్రో స్టేషన్‌కు సమీపంలో ఉన్న ఓ ట్రాన్స్‌మిషన్ టవర్‌ ఎక్కి తన నిరసన వ్యక్తం చేశాడు. గాంధీనగర్‌లో ఈ వార్త పెద్ద సంచలనమైంది.


ఉదయం 11 గంటల ప్రాంతంలో హసీబ్ విద్యుత్ టవర్‌ను ఎక్కి నానా రచ్చ చేశాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులతో పాటు ఫైర్ బ్రిగేడ్‌, ఆంబులెన్స్‌లు అక్కడికి వచ్చాయి. కిందకు దిగాలని హసీబ్‌ను విజ్ఞప్తి చేశాయి. చాలా సేపు పైనే ఉండి చివరకు కిందకు దిగేందుకు ఒప్పుకున్నాక అంతా ఊపిరి పీల్చుకున్నారు. "నేను టికెట్ ఆశించాను. కానీ రూ.3కోట్లకు వేరే అభ్యర్థికి టికెట్ అమ్ముకున్నారు. నన్నూ డబ్బు డిమాండ్ చేశారు. కానీ నా వద్ద అంత డబ్బు లేదు" అని చెప్పాడు హసీబ్ ఉల్ హసన్. డిసెంబర్ 4వ తేదీన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఆమ్‌ఆద్మీ పార్టీ 117 మంది అభ్యర్థులతో కూడిన తుది జాబితాను విడుదల చేసింది. అందులో తన పేరు కనిపించకపోయే సరికి హసీబ్ ఇలా హంగామా సృష్టించాడు.