BRS Mlas Poaching Case : బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసు విచారణను హైకోర్టు సీబీఐకి అప్పగించింది. సింగిల్ బెంచ్ నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది. అయితే తాజాగా హైకోర్టు సింగిల్ బెంచ్ నిర్ణయాన్ని సమర్థించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకు అప్పగిస్తూ ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. అయితే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామన్నారు. అయితే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు.  తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఎమ్మెల్యే బాలరాజు చెప్పారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన... సీబీఐ, ఈడీలు కేంద్రం ప్రభుత్వం జేబు సంస్థలుగా మారాయని విమర్శించారు. దర్యాప్తు సంస్థలతో తమను ఇబ్బంది పెట్టాలని కేంద్రం చూస్తుందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర ఎవరు చేశారో అందరికీ తెలిసిందేనన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ నేతలను ఇబ్బంది పెడితే సహించేది లేదని హెచ్చరించారు. 


సీబీఐ విచారణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ 


తెలంగాణలో మునుగోడు ఎన్నికల సమయంలో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని గతంలో సింగిల్ బెంచ్ తీర్పు ఇవ్వగా, తాజాగా డివిజన్ బెంచ్ కూడా దాన్నే సమర్థించింది. ఆ తీర్పులో తాము జోక్యం చేసుకోబోమని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహా, ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను డివిజన్ బెంచ్ కొట్టేసింది. దీంతో సీబీఐ విచారణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ డివిజన్ బెంచ్‌కు అప్పీలుకు వెళ్లిన తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. అయితే, ఈ విషయంపై తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని కాబట్టి, ఆర్డర్‌ ను సస్పెన్షన్‌లో ఉంచాలని ప్రభుత్వం తరపు న్యాయవాది ద్విసభ్య ధర్మాసనాన్ని కోరారు. అందుకు న్యాయమూర్తులు నిరాకరించారు.


సిట్ దర్యాప్తు పారదర్శకంగా లేదని 


ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు 2022 డిసెంబర్ 26న తీర్పునిచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ముమ్మాటికి తప్పేనని ..ముఖ్యమంత్రికి  సాక్ష్యాలు ఎవరు ఇచ్చారో చెప్పడంలో సిట్ విఫలమైందని హైకోర్టు వ్యాఖ్యానించింది. దర్యాప్తు సమాచారం సీఎంకు చేరవేతపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇన్వెస్టిగేషన్ అధికారుల దగ్గర ఉండాల్సిన ఆధారాలన్నీ మీడియాకి  ప్రజల వద్దకు వెళ్లిపోయాయని పేర్కొన్నారు. దర్యాప్తు సమాచారాన్ని మీడియాతో సహా ఎవరికీ చెప్పకూడదన్నారు. దర్యాప్తు ప్రారంభ దశలోనే కీలక ఆధారాలు బహిర్గతమయ్యాయని కామెంట్ చేశారు. సిట్ చేసిన ఇన్వెస్టిగేషన్ పారదర్శకంగా కనిపించలేదని తెలిపారు. దర్యాప్తు ఆధారాలను బహిర్గతం చేయడం వల్ల విచారణ సక్రమంగా జరగదన్నారు. ఆర్టికల్ 20, 21 ప్రకారం  న్యాయమైన విచారణతో పాటు దర్యాప్తు కూడా సరైన రీతిలో జరగాలని నిందితులు కోరవచ్చని చెప్పారు. అయితే ఈ తీర్పును డివిజన్ బెంచ్‌లో ప్రభుత్వం సవాల్ చేసింది. తాజాగా డివిజన్ బెంచ్ కూడా సింగిల్ బెంచ్ తీర్పును సమర్థించింది. సీబీఐ విచారణపై హైకోర్టు ఎటువంటి స్టే ఇవ్వలేదు. కానీ సీబీఐ మాత్రం ఇంకా విచారణ ప్రారంభించలేదు. విచారణకు అనుమతి కోసం తెలంగాణ ప్రభుత్వానికి సీబీఐ లేఖ రాసింది. ఫామ్ హౌస్ కేసు సీబీఐకి బ‌దిలీ చేసిన క్రమంలో ఎఫ్ఐఆర్ న‌మోదుకు అన్ని అంశాల‌ను ప‌రిశీలిస్తున్నట్టు ఆ లేఖ‌లో పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం జనరల్ కన్సెంట్ ను రద్దు చేయడంతో.. విధిగా అనుమతి తీసుకోవాల్సి ఉంది. అయితే హైకోర్టు ఆదేశించినందున అనుమతి నిరాకరించడానికి వీల్లేదు. ఈ కేసుపై హైకోర్టు డిజిజ‌న్ బెంచ్‌ కూడా సీబీఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇకపై సీబీఐ విచారణను స్పీడప్ చేస్తుందని అంటున్నారు విశ్లేషకులు.