New Traffic Rules: హైదరాబాద్ వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు షాకింగ్ న్యూస్ చెప్పారు. ఇక నుంచి చలాన్లు కట్టకుండా తిరుగుతున్న వారిపై మళ్లీ చలాన్లు విధిస్తున్నారు. ప్రతిరోజూ ఉల్లంఘనలకు పాల్పడడం, జారీ అయిన ఈ చలాన్లు పట్టించుకోకుండా వ్యవహరించడం వంటివి వాటికి చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామనిచెబుతున్నారు. మూడు నెలల వ్యవధిలో పదేపదే వైలేషన్స్ కు పాల్పడి, జరిమానాలు చెల్లించని వారికి భారీగా వడ్డించనున్నారు. కేవలం తీవ్రమైన ఉల్లంఘనలకు మాత్రమే ఈ విధానం అమలు కానుంది. ఇందుకు సంబంధించి నగర ట్రాఫిక్ విభాగం ప్రాథమనిక కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం హెల్మెట్ లేకుండా వాహనం నడిపే ద్విచక్ర వాహన చోదకులకు రూ.100 జరిమానా పడుతోంది. ఇలా జారీ అవుతున్న ఈ చలాన్లను అనేక మంది చెల్లించలేదు. ఇకపై ఒకసారి చలాన్ జారీ నాటి నుంచి మూడు నెలల వ్యవధిలో ఆ ఈ చలాన్ చెల్లించకుండా మరో ఉల్లంఘనకు పాల్పడితే అప్పుడు విధించే జరిమానా పెరుగుతుంది.


చలాన్లు చెల్లించకుండా తిరిగితో మళ్లీ మళ్లీ ఫైన్ లు..
 
రెండోసారికి అయితే రూ.200, మూడో సారి అయితే రూ.600 చొప్పున విధిస్తారు. ఎప్పటి జరిమానాలు అప్పుడు చెల్లించేస్తే... మాత్రం రూ.100 చొప్పునే పడుతుంది. ఇదొక్కటే కాదు మరికొన్ని తీవ్రమైన ఉల్లంఘనల విషయంలోనూ ఈ విధానం అమలు చేయనున్నారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 200, 600, 800 చొప్పున విధించనున్నారు. తేలిక పాటి వాహనాలకు, భారీ వాహనాలకు 1000, 1500, 2 వేల రూపాయల జరిమానా విధిస్తూ ఈ చలాన్ జారీ చేస్తారు. అలాగే ఎక్కడ పడితే పార్కింగ్ చేస్తే ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 200 రూపాయలు, పీఎస్ కు తరలిస్తే మాత్రం 350, 700, 1000 చొప్పున, భారీ వాహనాలకు 1000, 1200, 1700 చొప్పుల విధిస్తారు. 


వాహనదారుల్లో క్రమశిక్షణ పెంచేందుకు..


ఈ విధానం కోసం ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు పెంచట్లేదు. మోటారు వాహనాల చట్టంలో ఉన్న కీలక సెక్షన్లు వినియోగిస్తున్నారు. దీని కోసం పెద్ద అధ్యయనమే నిర్వహించారు. అందులో రాంగ్ సైడ్ డ్రైవింగ్, డేంజరస్ డ్రైవింగ్ ఇలా వేర్వేరు సెక్షన్లకు వేర్వేరుగా జరిమానాలు ఉన్నాయి. మరోపక్క ఒకసారి జారీ చేసిన చలాన్ ను నిర్ణీత గడువులోగా చెల్లించకపోతే అది ఉత్తర్వుల ధిక్కరణ కిందకు వస్తుందని, ఇందుకు 500 రూపాయల జరిమానా విధించవచ్చని ఎంవీ యాక్ట్ చెప్తోంది. ఇలాంటి అనేక కీలక సెక్షన్లు ఇప్పటి వరకు వాడలేదు. వాహన చోదకుల్లో క్రమశిక్షణ పెంచడంతో పాటు ట్రాఫిక్ జామ్స్, ప్రమాదాలు తగ్గించడానికి ఇకపై వినియోగించాలని నిర్ణయించారు. 


ఆ సిరీస్ ఆటోలకు నో ఎంట్రీ ప్రకటించిన ట్రాఫిక్ పోలీసులు..


ట్రాఫిక్ తో పాటు కాలుష్య నియంత్రణకు హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.  నిబంధనలకు విరుద్ధంగా నగరంలో తిరుగుతున్న ఆటోలను సీజ్ చేస్తున్నారు. దీంతో పాటు ఇతర జిల్లాల రిజిస్ట్రేషన్లు కలిగిన ఆటోలకు ఇకపై హైదరాబాద్ లో ప్రవేశం లేదని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.   ఇతర జిల్లాల్లో రిజిస్టర్ అయిన ఆటోలకు(Autos) హైదరాబాద్‌ నగరంలో ప్రవేశం లేదని పోలీసులు స్పష్టం చేశారు. కేవలం హైదరాబాద్‌లో రిజిస్టర్ అయిన ఆటోలకు మాత్రమే నగరంలో నడిపేందుకు అనుమతి ఉన్నట్లు చెప్పారు. ఇతర జిల్లాల ఆటోలు నగరంలో కనిపిస్తే సీజ్‌ చేస్తామని పోలీసులు(Police) హెచ్చరించారు. ఇప్పటికే ఆటో సంఘాలు, ఓలా, ఉబర్‌ సంస్థలకు సూచనలు జారీ చేశారు. హైదరాబాద్ లో ఆటోలు భారీగా పెరిగిన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు వివరించారు.