మైక్రోవేవ్ అవెన్ ఎలక్ట్రానిక్ అప్లయన్స్ వచ్చిన తర్వాత చాలా మంది సోమరిపోతుల్లాగా మారిపోతున్నారు. ఈ బిజీ లైఫ్ లో చాలా మంది దీని మీదే ఆధారపడుతున్నారు. తినాలనుకున్న పదార్థాలను అవెన్ లో పెట్టి వేడి చేసుకోవడం గబగబా దాన్ని తినేయడం, పనుల మీద బయటకి పరిగెత్తడం పరిపాటిగా మారుతుంది కొందరికి. అయితే ఈ మైక్రోవేవ్ అవెన్ దగ్గరకి గర్భిణీలు వచ్చి పదార్థాలు వేడి చేసుకుని తినడం అసలు మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గర్భంతో ఉన్నప్పుడు స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ పని చేస్తున్నా అది వాళ్ళ శరీరం మీద ఎంత వరకు ప్రభావం చూపిస్తుందనే విషయం మీద అవగాహన ఉండాలి. అలా మైక్రోవేవ్ దగ్గరకి గర్భిణీలు రావచ్చా అంటే నిపుణులు రాకూడదనే అంటున్నారు. ఎందుకంటే మైక్రోవేవ్ అవెన్ లోని విద్యుదయస్కాంత తరంగాలు మీ కడుపులోని బిడ్డకి హాని కలిగిస్తాయి.


సాధారణంగా గర్భం ధరించిన తర్వాత చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు రేడియేషన్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అందుకే గర్భం ధరించిన తర్వాత ఫోన్ కూడా ఎక్కువగా చూడొద్దని అంటారు. దాని వల్ల వచ్చే రేడియేషన్ ప్రభావం బిడ్డ మీద పడుతుందని ఫోన్ తల దగ్గర లేదా పక్కన పెట్టి పడుకోవద్దని హెచ్చరిస్తారు. అలాగే మైక్రోవేవ్ అవెన్ కి కూడా దూరంగా ఉండాలని అంటారు. దాని వల్ల బిడ్డకి ప్రమాదం అనే అపోహ ఉంది. మరి అది నిజంగానే అపోహ లేదా వాస్తవమా అనేది తెలుసుకుందాం.  


భారతీయ గృహాల్లో ఎక్కువగా మైక్రోవేవ్ అవెన్ ద్వారా ఆహారాన్ని మళ్ళీ వేడి చేసుకోవడానికి లేదా బేకింగ్ చెయ్యడానికి ఉపయోగిస్తారు. అవెన్ లో లీకేజీలు ఉన్నట్లయితే విద్యుదయస్కాంత తరంగాలు కొద్దిగా బహిర్గతం కావడం వల్ల పుట్టబోయే బిడ్డపై దాని ప్రభావం పడుతుంది. చాలా సందర్భాలలో పరికరం చాలా పాతది అయినప్పుడు లేదా దాని తలుపు సక్రమంగా లేకపోవడం వల్లో లేదా దాన్ని సరిగ్గా లాక్ చేయకపోతేనో లీకేజి సమస్యలు వస్తాయి. ఇవి 12సెం.మీ వరకు తరంగాలను విడుదల చేస్తాయి. ఇవి పిండం/పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపుతాయి.


ఇలా చేస్తే ప్రమాదం ఉండదు


FDA మార్గదర్శకాల ప్రకారం మైక్రోవేవ్ అవెన్ ను ఉపయోగించినట్లయితే అది ఎక్కువగా రేడియేషన్ ని విడుదల చేయదు. అప్పుడు కడుపులోని బిడ్డకి ఎటువంటి హాని కలిగించాడు. లీకేజీల విషయంలో జాగ్రత్తలు తీసుకుని పరికరాన్ని మార్చడం ఉత్తమం. గర్భిణీ స్త్రీలకు హాని కలిగించకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.


తీసుకోవాల్సిన జాగ్రత్తలు


❂ మైక్రోవేవ్ తలుపు సరిగా మూసుకోకపోతే దాన్ని ఉపయోగించడం మానుకోవాలి. మీ క్షేమం కోసం దాన్ని మార్చేయడం ఉత్తమం.


❂ అవెన్ లో వంట చేయడం సురక్షితమే అయినప్పటికీ డిష్ ని లోపల ఉంచి ఉష్ణోగ్రత, టైమర్ ని సెట్ చేసిన తర్వాత దానికి దూరంగా ఉండాలి. డిష్ పూర్తయ్యే దాకా వాటికి దూరంగానే ఉండాలి. ఇలా చేయడం వల్ల రేడియేషన్ కి గురి కాకుండా ఉండేందుకు సహాయపడుతుంది. 


❂ పాత ప్లాస్టిక్ కంటైనర్లు లేదా మైక్రోవేవ్ కంటైనర్లలో గీతలు ఉన్న వాటిలో వంట చేయడం లేదా వాటిలో ఆహారాన్ని వేడి చేయడం మానుకోవాలి. ఇది ఆహారంలోకి రసాయనాలు లీక్ చేసే అవకాశం ఉంది.


❂ మిగిలిపోయిన ఆహారాన్ని మళ్ళీ మళ్ళీ వేడి చేస్తున్నట్లయితే ఆ ఆహారాన్ని ఎక్కువగా వేడెక్కించకూడదు.


❂ మైక్రోవేవ్‌లో లీకేజీలను గుర్తించడం చాలా కష్టం, అయితే మైక్రోవేవ్ పాతది అయినప్పుడు లీకేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల దాన్ని మార్చి కొత్తది తీసుకోవడం ఉత్తమం.


❂ మైక్రోవేవ్ కొనుగోలు చేసే ముందు తప్పని సరిగా ISI గుర్తుతో ఉన్నవాటినే తీసుకోవాలి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: నూనె Vs వెన్న - హార్ట్ పేషెంట్లకు ఏది మంచిది?


Also Read: రాగి పాత్రల్లో నీరు ఆరోగ్యానికి మంచిదే - కానీ, ఈ సమస్యలు ఉంటే మాత్రం వద్దు!