Minister Srinivas Goud : హైదరాబాద్ జింఖానా గ్రౌండ్ లో ఉద్రిక్తత నెలకొంది. భారత్-ఆసీస్ మ్యాచ్ టికెట్ల కోసం అధిక సంఖ్యలో అభిమానులు రావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు స్పృహతప్పి పడిపోయారు. ఈ ఘటనపై తెలంగాణ క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ భారత్-ఆసీస్ టీ20 టికెట్ల అమ్మకాల విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. నిర్వాహకులు ఇష్టానుసారం ఉంటామంటే కుదరదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేనట్లు వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
హైదరాబాద్ ను అప్రతిష్టపాలు చేసేందుకు కుట్రలు
"టికెట్స్ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. మ్యాచ్ టికెట్ల కోసం లక్షల మంది యువకులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారు. అనుకోకుండా జింఖాన గ్రౌండ్స్ లో తోపులాట జరిగింది. జింఖాన గ్రౌండ్స్ ఘటనలో బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తాం. తెలంగాణ, హైదరాబాద్ ను అప్రతిష్ట పాలు చేసేందుకు కుట్రలు. దళారులు టికెట్లు అమ్మే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ మ్యాచ్ ఘనంగా నిర్వహిస్తాం మరిన్ని మ్యాచ్ లు వచ్చే విధంగా కృషి చేస్తాం. భవిష్యత్తులో ఎలాంటి పొరపాటు జరగకుండా చూస్తాం. హెచ్సీఏ నిర్లక్ష్యం వల్ల ఈ రోజు ఘటన జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ, రాచకొండ కమిషనర్ ఆధ్వర్యంలో ఘటనపై విచారణ చేస్తున్నాం. ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుంటాం."- మంత్రి శ్రీనివాస్ గౌడ్
హెచ్సీఏ తీరుపై పోలీసులు ఆగ్రహం
ఉప్పల్ స్టేడియం తెలంగాణలోనే ఉందని గుర్తుపెట్టుకోవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. టికెట్ల విషయంలో అవకతవకలకు పాల్పడితే సహించమని స్పష్టంచేశారు. టికెట్ల విక్రయాల విషయంలో హెచ్‌సీఏ వైఖరిపై పోలీసులు మండిపడ్డారు. తొక్కిసలాట వ్యవహారంలో హెచ్‌సీఏపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పెద్ద సంఖ్యలో అభిమానులు టికెట్ల కోసం రావడంతో పరిస్థితి అదుపుతప్పిందని హెచ్సీఏ వర్గాలు అంటున్నాయి. హెచ్‌సీఏ వైఖరే తోపులాటకు కారణమని పోలీసులు చెబుతున్నారు. భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్ల కోసం హైదరాబాద్ జింఖానా గ్రౌండ్ కు అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. టికెట్ల కోసం ఒక్కసారిగా ఎగబడడంతో తొక్కిసలాటలో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని యశోద ఆసుపత్రికి తరలించారు. జింఖానా గ్రౌండ్ వద్ద పరిస్థితిని అదుపుచేయడానికి పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. మూడువేల టికెట్లకు 30 వేలకు పైగా క్రీడా అభిమానులు తరలివచ్చారు. తొక్కిసలాట జరగడంతో హెచ్‌సీఏ టికెట్ల కౌంటర్లను తాత్కాలికంగా మూసివేసింది.
తొక్కిసలాట
హైదరాబాద్ లో జరగనున్న భారత్ - ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్ల కోసం క్రికెట్ ఫ్యాన్స్ హంగామాతో నగరంలోని జింఖానా గ్రౌండ్స్ దగ్గర తొక్కిసలాట జరిగింది. వీరిలో ఓ మహిళకు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ప్రస్తుతం యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అంతకుముందు పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిపై లాఠీచార్జి చేశారు. దీంతో దాదాపు 20 మంది వరకూ క్రికెట్ అభిమానులు కింద పడిపోయారు. ఈ క్రమంలో పోలీసులకు కూడా గాయాలయ్యాయి. నేడు తెల్లవారుజాము నుంచే అభిమానులు టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్ వద్ద కిలో మీటర్ల కొద్దీ క్యూ కట్టారు. జింఖానా గ్రౌండ్ వద్ద అభిమానులను పోలీసులు నియంత్రించలేకపోవడంతో ఈ తొక్కిసలాట జరిగింది. జింఖానా గ్రౌండ్స్ వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో హెచ్‌సీఏ టికెట్ కౌంటర్లను మూసివేసింది. గాయపడ్డ వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.
ఆదివారం మ్యాచ్
వచ్చే ఆదివారం (సెప్టెంబరు 25) ఉప్పల్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్లు మూడో టీ 20లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ టికెట్లను సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్‌లో హెచ్‌సీఏ విక్రయిస్తుంది. దీంతో అభిమానులు పెద్ద సంఖ్యలో జింఖానా గ్రౌండ్ కు తరలివచ్చారు. క్యూలో ఉన్న క్రికెట్ అభిమానులు ప్రధాన గేటు నుంచి ఒక్కసారిగా తోసుకురావడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఒకరినొకరు తోసుకోవడంతో దాదాపు 20 మంది స్పృహ తప్పిపోయారు.
Also Read : KTR On Oscar : హక్కులు గురించి మాట్లాడరు.. చెప్పులు మోస్తారు - తెలంగాణ బీజేపీ నేతలపై కేటీఆర్ ఫైర్ !
Also Read : IND Vs AUS Tickets: జింకానా గ్రౌండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత, లాఠీఛార్జి - స్పృహతప్పిన పలువురు, మహిళకు సీరియస్!