Revanth Reddy : ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ ఈడీ విచారణకు పిలవడంపై తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేశాయి. హైదరాబాద్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు ఈడీ కార్యలయం ముందు ధర్నా చేశారు. ఈ ధర్నాలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సోనియాగాంధీకి ఈడీ ముందు విచారణకు హాజరవ్వాలని నోటీసులివ్వడం కక్ష సాధింపు చర్య అని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం సోనియాగాంధీకి అండగా నిలబడుతోందన్నారు. 135 సంవత్సరాలు క్రితమే దేశానికి స్వాతంత్య్రం, స్వేచ్చనివ్వడం కోసం కాంగ్రెస్ పార్టీ ఏర్పడిందన్నారు. భాక్రానంగల్, నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులు నిర్మించి హరిత విప్లవం సాధించిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. పాకిస్తాన్ మీద రెండుసార్లు యుద్ధం చేసి ప్రపంచ దేశాలకు భారత్ ప్రతాపం చూపిన పార్టీ అన్నారు. రాజీవ్ గాంధీ ప్రధాని అయి ప్రపంచ దేశాలకు భారత అభివృద్ధి చూపించారన్నారు. 18 సంవత్సరాలకే ఓటు వయసు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. రాజీవ్ హత్యానంతరం దేశం కోసం తమ ప్రాణాలకు అర్పించడానికి సిద్ధమని సోనియా, రాహుల్ గాంధీలు బాధ్యతలు స్వీకరించారన్నారు.
తెలంగాణ తల్లిని అవమానిస్తారా?
దేశం శ్రీలంక లాంటి ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు పీవీ నరసింహారావును ప్రధాని చేసి దేశంలో ఆర్థిక సరళీకృత విధానాలు తీసుకొచ్చారు. 2004-14 వరకు సోనియా నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. విద్యా హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం, ఆహారభద్రత చట్టం, ఉపాధిహామీ తీసుకొచ్చారు. దోచుకున్న దొంగలను శిక్షించడానికి సమాచార హక్కు చట్టం తెచ్చారు. ఆమెనే దోచుకున్నట్టు అయితే ఈ చట్టం తెచ్చేవారా?. దీపం పథకం తెచ్చి అడబిడ్డలను కట్టెలపోయి నుంచి విముక్తి కల్పించారు. 4 కోట్ల ప్రజలు స్వతంత్రంగా బతకాలని తెలంగాణ రాష్ట్రాన్ని ఆకాంక్షించారు. ఆత్మబలిదానాలు చూసి ప్రజల ఆకాంక్షను సోనియాగాంధీ నెరవేర్చారు. పార్లమెంట్ తలుపులు మూసి రాష్ట్రాన్ని ఏర్పరిచారు. తెలంగాణ తల్లిని అవమానించడానికి ఈడీ ఆఫీస్ కి పిలిచారు. -రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
ధరల పెంపుపై పోరాటాన్ని పక్కదారి పట్టించేందుకే
15 సంవత్సరాల క్రితం సామాన్య రైతు కుటుంబంలో జడ్పీటీసీగా గెలిచిన తనకు 15 సంవత్సరాల్లోనే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడయ్యే అవకాశం వచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు. రాంలీలా మైదానంలో మీరో మేమో తేల్చుకుందామని ప్రధాని నరేంద్రమోదీకి రేవంత్ సవాల్ విసిరారు. సోనియా గాంధీని పార్లమెంట్ నడుస్తుంటే ఈడీ విచారణకు పిలుస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో గ్యాస్, జీఎస్టీ, పెట్రోల్ ధరల మీద పోరాటం చేస్తుంటే పక్కదారి పట్టించడానికి ఈడీ ఆఫీస్ కి పిలిచారని ఆరోపించారు. రాష్ట్రం ఇచ్చిన తల్లికి జెండాలు, ఎజెండాలు , మతాలు పక్కన బెట్టి అండగా నిలబడదామన్నారు. ఇది రాజకీయ పోరాటం కాదని, ఆత్మగౌరవ పోరాటమన్నారు. సోనియాగాంధీ మీద దాడి అంటే భారత మాత మీద దాడి, తెలంగాణ తల్లి మీద దాడిగా రేవంత్ రెడ్డి అభివర్ణించారు.