హిందువులు ఎంతో పవిత్రంగా భావించి కన్వర్ యాత్ర జులై 14వ తేదీన ప్రారంభమైంది. జులై 26 వతేదీ వరకు ఇది కొనసాగనుంది. ఈ సమయంలో హిందువులు హరిద్వార్, గోముఖ్, గంగోత్రి, సుల్తాన్‌గంజ్‌ లాంటి క్షేత్రాలకు వెళ్లి అక్కడ గంగానదిలో స్నానమాచరిస్తారు. కొందరు చెప్పుల్లేకుండానే వందల మైళ్లు నడుచుకుంటూ వెళ్లిపోతారు. ఏటా ఈ యాత్రకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఈసారి కూడా ఓ వీడియో ఇలానే వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి కావడిలో తన తల్లిదండ్రులను కూర్చోబెట్టి వారిని మోస్తూ ఈ యాత్ర కొనసాగిస్తున్నాడు. ఐపీఎస్ అశోక్ కుమార్ ఈ వీడియోని ట్విటర్‌లో షేర్ చేశారు. వృద్ధ తల్లిదండ్రులను కావడిలో మోస్తూ తీసుకెళ్తున్నాడు. వాళ్లు కూర్చునేందుకు వీలుగా చిన్న కుర్చీలు ఏర్పాటు చేశాడు. ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్తున్నాడు."తల్లిదండ్రులు ముసలివాళ్లైపోయాక వాళ్లను ఇళ్ల నుంచి బయటకు వెళ్లగొట్టేస్తున్నారు. పిల్లలతో కలిసి జీవించే అదృష్టం వారికి ఉండదు. కానీ శివభక్తుల్లో శ్రవణకుమారులు ఉంటారని ఈ వ్యక్తి రుజువు చేశాడు" అని ఐపీఎస్ అశోక్ కుమార్ ట్వీట్ చేశారు. ఇప్పటికే ఈ వీడియోను వేలాది మంది చూడగా, వందలాది మంది లైక్ చేశారు. నెటిజన్లు ఆ వ్యక్తిని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.