చికాగోలో తప్పిపోయిన హైదరాబాద్‌కు చెందిన విద్యార్థిని కనిపెట్టడానికి చికాగోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రయత్నిస్తోంది. చికాగో వీధుల్లో భారత విద్యార్థి నిరాశ, ఆకలితో అలమటిస్తున్నట్లు సమాచారం అందడంతో ఆమెకు అన్ని సహాయాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
హైదరాబాద్‌లోని మౌలాలికి చెందిన సయ్యదా లులు మిన్హాజ్ జైదీ ఆగస్టు 2021లో డెట్రాయిట్‌లోని TRINE విశ్వవిద్యాలయంలో MS చదివేందుకు USA వెళ్లింది. అక్కడ ఉద్యోగం రాకపోవడం, ఆర్థిక పరిస్థితి కారణంగా ఆమె డిప్రెషన్‌కు గురైంది. గత రెండు నెలలుగా తల్లితో కాంటాక్ట్‌లో లేదు. ఇటీవల ఇద్దరు హైదరాబాదీయుల ద్వారా, తన కుమార్తె తీవ్ర డిప్రెషన్‌లో ఉందని, ఆమె వస్తువులు చోరీకి గురయ్యాయని, ఆమె ఆకలితో అలమటిస్తూ రోడ్లపై తెలుసుకున్న తల్లి తల్లడిల్లిపోయింది.
ఈ నేపథ్యంలో తన బిడ్డను రక్షించాలని కోరుతూ విదేశాంగ మంత్రి జై శంకర్‌కు లేఖ రాసింది. తన బిడ్డ చదువుకోసం అమెరికా వెళ్లిందని, అక్కడ తన వస్తువులు చోరీకి గురయ్యాయని, ఆకలితో అలమటిస్తోందని, రోడ్లపై ఉంటోందని, ఎలాగైనా తన బిడ్డను ఇండియాకు తీసుకు రావాలని ప్రాధేయపడింది. కూతురు కోసం తల్లడిల్లుతున్న తల్లి అమెరికాలో ఉన్న బిడ్డ దగ్గరకు వెళ్లేలా ఎలాగైనా సాయం చేయాలని బీఆర్ఎస్ నాయకుడు ఖలీకర్ రెహమాన్ విదేశాంగ మంత్రి జైశంకర్‌కు ట్విటర్ ద్వారా కోరారు.
దీనిపై చికాగోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా స్పందిస్తూ.. మిన్హాజ్ జైదీ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. స్థానిక పోలీసులు, ఎన్జీవోల సహాయం తీసుకుంటున్నట్లు తెలిపారు. జైదీకి అవసరమైన అన్ని కాన్సులర్, మెడికల్, ఇతర సహాయాన్ని కాన్సులేట్ అందజేస్తుందన్నారు.
ఆర్ఎస్ నాయకుడు ఖలీకర్ రెహమాన్ తన తాజాగా ట్విటర్‌లో స్పందిస్తూ చికాగోలో సామాజిక కార్యకర్త ముకర్రమ్, అతని కుటుంబం మిన్హాజ్ జైదీని కలిసిందని, ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగం రాకపోవడంతో జైదీ ఆర్థిక పరిస్థితి బాగాలేదని, తీవ్ర నిరాశలో ఉందని & మానసికంగా అస్థిర స్థితిలో ఉన్నట్లు వివరించారు. ఆమెను డిప్రెషన్ నుంచి బయటపడేయడమే అన్నిటికంటే ముఖ్యమైన విషయం అని, అప్పుడే ఆమె భారతదేశానికి రాగగలుగుతుందన్నారు. ఆమెను జాగ్రత్తగా చూసుకోవడానికి ఆమె తల్లి USA వెళ్లాలనుకుంటోందని, వీసా అందించాలని జైశంకర్‌ను కోరారు.