Sriram Shobha Yatra : శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీలోని సీతారాంబాగ్ రామమందిరం నుంచి శ్రీరామ్ శోభాయాత్ర ప్రారంభమైంది. సీతారాంబాగ్ ఆలయం నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు శోభాయాత్ర కొనసాగనుంది. మొత్తం 6.5 కిలో మీటర్ల మేర శోభాయాత్ర జరగనుంది. శ్రీరామ్ శోభాయాత్రలో భారీగా భక్తలు పాల్గొన్నారు. సీతారాంబాగ్ ఆలయం - బోయగూడ కమాన్ నుంచి మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ రోడ్డు, జాలి హనుమాన్, దూల్‌పేట, పురానాపూల్, జుమేరాత్ బజార్, చుడిబజార్, బేగంబజార్ చత్రి, బర్తన్ బజార్, సిద్దంబర్ బజార్ మసీదు, శంకర్ షేర్ హోటల్, గౌలిగూడ కమాన్, గురుద్వారా, పుత్లిబౌలి బౌరస్తా, కోఠి ఆంధ్రా బ్యాంక్ మీదుగా సుల్తాన్ బజార్‌లోని హనుమాన్ వ్యాయామశాలకు యాత్ర చేరుకుంటుంది.
భారీ భద్రత
శ్రీరామ్ శోభయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు రెండు వేల మందితో బందోబస్తు నిర్వహించారు. టాస్క్ ఫోర్స్, ఆక్టోఫస్ బలగాలు శోభాయాత్రపై నిఘా పెట్టాయి. డ్రోన్ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఈ యాత్రను పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ఏర్పాటుచేశారు. శ్రీరామ్ శోభాయాత్రపై హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ.. శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, ట్రాఫిక్ మళ్లింపుతో సహా అన్ని ఏర్పాటు చేశామన్నారు. సీతారాంబాగ్ నుంచి కోటి వ్యాయామశాల వరకు సాగే ఈ శోభయాత్రకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అలాగే ఎమర్జెన్సీ సర్వీసుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామని చెప్పారు. శోభయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన వెల్ కమ్ స్టేజెస్ భారీ కెడ్స్ అవతల పెట్టిస్తున్నామన్నారు. ట్రాఫిక్ పోలీసులకు భక్తులందరూ సహకరించాలని సుధీర్ బాబు కోరారు.
శ్రీరాముని పల్లకిసేవ
శ్రీరామనవమి వేడుకలు పురస్కరించుకుని మంగలహాట్ లోని బడాబంగ్లా నుంచి బీఆరెస్ నేత ఆనంద్ సింగ్ ఆధ్వర్యంలో శ్రీరాముని పల్లకి యాత్ర నిర్వహించారు. ఈ యాత్రను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బీఆరెస్ సీనియర్ నేత నంద్ కిషోర్ వ్యాస్ బిలాల్ ప్రారంభించారు. ఈ యాత్రలో భారీగా బీఆరెస్ నేతలు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.