Bharat Jodo Yatra in Telangana : భారత్ జోడో యాత్ర దేశ భవిష్యత్తును మార్చే యాత్ర అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఆనాడు గాంధీ చేపట్టిన దండియాత్రలా భారత్ జోడో యాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు. చరిత్రలో ఒక కీలకమైన భారత్ జోడో యాత్రలో పాల్గొనడం ఒక గొప్ప అవకాశమని తెలిపారు. హైదరాబాద్ మణికొండలోని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ నివాసంలో మహారాష్ట్ర భారత్ జోడో యాత్ర పరిశీలన బృందంతో జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. మహారాష్ట్ర భారత్ జోడో యాత్ర పరిశీలన బృందం హైదరాబాద్ వచ్చారు.  కర్ణాటకలో 22 రోజులు, ఏపీలో 4 రోజులు రాహుల్ గాంధీ జోడో యాత్ర సాగనుందని రేవంత్ రెడ్డి అన్నారు. అక్టోబర్ 24న జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశిస్తుందని, తెలంగాణలో యాత్ర ముగిసిన తరువాత  మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుందని తెలిపారు. జోడో యాత్రపై ఒకరికొకరం సమన్వయం చేసుకోవాలని నిర్ణయించుకున్నామన్నారు. తెలంగాణ, మహారాష్ట్ర నేతలతో కలిసి సమన్వయ బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. కర్ణాటకలో కూడా మహారాష్ట్ర, తెలంగాణ నేతలు పర్యటించాలనే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, మహారాష్ట్ర సీల్పీ నేత బాల సాహబ్ తోరాట్, ఎమ్మెల్యేలు, ఏఐసీసీ సెక్రెటరీలు సోనాల్ పటేల్, ఆశిష్ తదితరులు పాల్గొన్నారు.  


13 రోజుల పాటు తెలంగాణలో పాదయాత్ర 


భారత్ జోడో యాత్ర తెలంగాణలో 13 రోజుల పాటు కొనసాగుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ, మహారాష్ట్రలో కామన్ సమస్యలు ఉన్నాయన్న ఆయన,  వాటిపై చర్చించామని రేవంత్ పేర్కొన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ నాయకులందరూ కలిసి కర్ణాటక వెళ్లి అక్కడి పరిస్థితులు అధ్యాయనం చేస్తామన్నారు. పాదయాత్రలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా చూడాలన్నారు. వంద సంవత్సరాల వరకూ మళ్లీ ఇలాంటి పాదయాత్ర ఉండదన్నారు. జోడో యాత్ర దేశ భవిష్యత్తును మార్చే పాదయాత్ర అన్నారు. కనీసం 25 వేల మంది కాంగ్రెస్ కార్యకర్తలతో మహారాష్ట్రకు రాహుల్ గాంధీని తీసుకెళ్తామని రేవంత్ రెడ్డి అన్నారు.  


అక్టోబర్ 24న తెలంగాణకు 


కాంగ్రెస్ అగ్రనేత‌ రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్రకు విశేష స్పందన వస్తుంది. త‌మిళ‌నాడు క‌న్యాకుమారిలో ప్రారంభమైన ఈ యాత్ర త్వరలో తెలంగాణలోకి ప్రవేశించనుంది. రాష్ట్రంలోకి యాత్ర వ‌చ్చాక ఓ కీల‌క ప‌రిణామం జరగనుంది. అన్ని మ‌తాల మ‌ధ్య ఐక్యతా భావాన్ని నింపేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రణాళిక‌లు చేస్తుంది. అందుకు రాష్ట్రంలోని దేవాల‌యాలు, చ‌ర్చిలు, మ‌సీదుల‌ను రాహుల్ గాంధీ సంద‌ర్శించ‌నున్నారు. మ‌త సామ‌ర‌స్యానికి ప్రతీక‌గా ఈ అవ‌కాశాన్ని ఉప‌యోగించుకోవాల‌ని కాంగ్రెస్ భావిస్తుంది. హైద‌రాబాద్ శివారులోని చిలుకూరి బాలాజీ ఆలయాన్ని రాహుల్ గాంధీ ద‌ర్శించుకొనున్నట్లు తెలుస్తోంది. ఆసియాలోనే అతి పెద్దదైన మెద‌క్ చ‌ర్చికి వెళ్లనున్నారు. అలాగే హైద‌రాబాద్ కు 44 కిలోమీట‌ర్ల దూరంలోని జ‌హంగీర్ ద‌ర్గాను కూడా సందర్శిస్తారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.  అక్టోబ‌ర్ 24న భారత్ జోడో యాత్ర తెలంగాణ‌కు చేరుకుంటుంది.  ప్రస్తుతం రాహుల్ గాంధీ కేరళలో పాదయాత్ర చేస్తున్నారు. 


Also Read : KCR Warangal Tour: వరంగల్‌లో ప్రతిమ మెడికల్‌ కాలేజ్‌‌ ప్రారంభించిన కేసీఆర్, అప్రమత్తంగా ఉండాలని వ్యాఖ్యలు


Also Read : Mission Bhagiradha : అవార్డు ఇచ్చింది మిషన్ భగీరధకు కాదు - టీఆర్ఎస్ ప్రచారంపై కేంద్రం అధికారిక స్పందన ఇదిగో !