Hyderabad Rains : హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి ఎండ మండిపోగా.. సాయంత్రం వరుణుడు విరుచుకుపడ్డాడు. నగరంలో భారీగా ఈదురుగాలుల వీస్తు్న్నాయి. పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈదురుగాలులకు పలుచోట్లు చెట్లు విరిగిపడ్డారు. రహదారులపై నీరుచేరడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. జీడిమెట్ల, సురారం, బాలానగర్, కూకట్ పల్లితో సహా నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షంతో పాటు వడగండ్ల వాన కురిసింది. ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్, దిల్‌షుక్ నగర్, మలక్ పేట, చార్మినార్ ప్రాంతాల్లో వడగండ్ల వాన పడింది. నగర శివారు ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. ఉప్పల్ వైపు వెళ్లే మార్గాలు జలమయం అయ్యాయి. తార్నకలోని పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వాహన రాకపోకలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
.
ఆదిలాబాద్ జిల్లాలో వర్ష బీభత్సం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా నల్లని మబ్బులు కమ్ముకున్నాయి. ఈదురు గాలులు వీస్తు ఆదిలాబాద్, కుమ్రం భీం జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు మండలంలోని నందిగామ గ్రామంలో వడగళ్ల వర్షం కురిసింది. వడగళ్ల వర్షం కశ్మీర్ ను తలపించింది. భారీగా వడగళ్ల వర్షం కురవడంతో పలువురి ఇళ్ల పైకప్పులు, పంటలు ధ్వంసమయ్యాయి. జిల్లాలోని ఇచ్చోడ, గుడిహథ్నూర్, నార్నూర్ మండలంలోని నడంగూడ గ్రామాల్లోను వడగళ్ల వర్షం కురిసింది. ఈదురు గాలులకు పలువురి ఇళ్లపై కప్పులు లేచిపోయాయి. ఉట్నూరులో భారీ వర్షం కురవడంతో రోడ్లన్ని జలమయమయ్యాయి. రోడ్డుపై వర్షం నీరు చేరడంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇచ్చోడ మండలంలోని బాదిగూడ గ్రామానికి పంద్రం జంగు ఇళ్లు ధ్వంసమవ్వగా ఇచ్చోడ ఎంపీపీ ప్రీతం రెడ్డి రూ.5000సహయం అందజేశారు. రైతులు ఎంతో ఆశగా మామిడి తోటలపై ఆధారపడగా ఈదురుగాలుల బీభత్సానికి మామిడిపండ్లు నెలమట్టమయ్యాయి. వరి, జొన్న, మొక్కజొన్న , రైతులు సైతం పంటలు కుప్పలు వేసుకోగా వర్షానికి తడిసిపోయాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకొంటున్నారు.
కుమ్రంభీం జిల్లాలో
కుమ్రం భీం జిల్లాలోను భారీ వర్షం కురిసింది. పలుచోట్ల వడగళ్ళ వర్షం కురవడంతో పంటలు నష్టపోయాయి. బెజ్జుర్ మండలం ముంజంపల్లి గ్రామంలో గాలి దుమారంతో కురిసిన వడగళ్ల వానకు మల్లేశ్ ఇంటి పైకప్పు రేకులు గాలికి లేచిపోవడంతో బియ్యం, పప్పు, దినుసులు, సహా యాభై వేల విలువ చేసే నిత్యావసర సరుకులు తడిసిముద్దయ్యాయి. చింతలమానేపల్లి మండలం డబ్బా ఆడేపల్లి బారెగుడ దరంపల్లి గ్రామాలలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఇండ్ల పైకప్పులు, రేకులు, మామిడి కాయలు వడగళ్ల వర్షంతో గాలి దుమారంతో ఉప్పుల నరసింహచారి ఇల్లు కుప్ప కూలింది. డబ్బా గ్రామ నర్సరీతో సహా నెలారాలి అపార నష్టం వాటిల్లింది. జిల్లాలో వందల ఎకరాల వరి, జొన్న పంట నష్టం వాటిల్లింది. దీంతో అన్నదాత, గ్రామస్తులు, ప్రజలు తమకు జరిగిన నష్టానికి ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.