Hyderabad Rains : హైదరాబాద్(Hyderabad Rains)లో వర్షం దంచికొడుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఎర్రగడ్డ, అమీర్ పేట్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, యూసఫ్‌గూడ, ఫిల్మ్‌నగర్, కొండాపూర్, మాదాపూర్, హైటెక్‌సిటీ, గచ్చిబౌలితో పాటు పలు ప్రాంతాలు నీట మునిగాయి. శుక్రవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. వర్షపు నీరు రోడ్లపై నిలవడంతో ట్రాఫిక్ జామ్ అయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు మూడు గంటల్లో నగరంలో పలు చోట్ల భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అయితే జీహెచ్ఎంసీ, విపత్తు నిర్వహణ బృందాలు అప్రమత్తమయ్యాయి. అత్యవసర సాయం కోసం 040-29555500 నెంబర్‌కు ఫోన్ చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు.
రోడ్లపై మోకాలి లోతు నీరు
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్‌లో ఇవాళ ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు నిలిచి ట్రాఫిక్ నిలిచిపోతోంది. సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, చిలకలగూడ, ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట్, అల్వాల్ ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరింది. బేగంపేట, రసూల్‌పురలోని పైకా ప్యాలెస్‌తో పాటు, బోయిన్‌పల్లి సీతారామపురంలో రోడ్లపై మోకాలి లోతు నీరు చేరింది.
పలు జిల్లాల్లో ఆరెంజ్, ఎల్లో అలర్ట్
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆరెంజ్, ఎల్లో అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. పలు జిల్లాల్లో శుక్రవారం ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఐదు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది. 18 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షానికి హైదరాబాద్ తడిసిముద్దవుతోంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తోంది. బాటసింగారం పండ్ల మార్కెట్‌ను వర్షం ముంచెత్తింది. పండ్ల మార్కెట్ లోని దుకాణాలు తడిసిముద్దయ్యాయి. మార్కెట్ ప్రాంగణంలో నీరు చేరి నిల్వ ఉంచిన పండ్లన్నీ తడిసిపోయాయి. బత్తాయి, వివిధ రకాల పండ్లు వర్షం నీటిలో కొట్టుకుపోయాయి. వాటిని కాపాడుకునేందుకు వ్యాపారులు, సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. మహబూబ్ నగర్ లో కుండ పోత వర్షాలు కురుస్తున్నాయి. తొర్రూరు దగ్గర వాగులో స్కూల్ బస్సు చిక్కుకుంది. స్థానికులు స్పందించి విద్యార్థులను రక్షించారు.
కుత్బుల్లాపూర్ లో భారీ వర్షం
హైదరాబాద్ కుత్బుల్లాపూర్ పరిసరాల్లో భారీ వర్షం పడింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. కుత్బుల్లాపూర్ పరిసరాల్లోని ప్రసూన నగర్, మల్లికార్జున నగర్, వాని నగర్, ఇంద్ర సింగ్ నగర్, శ్రీనివాస్ నగర్ ను వరద ముంచెత్తింది. నాలాల్లోని వరద కాలనీల్లోకి రావడంతో డ్రైనేజీ నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. సురారం ప్రధాన రహదారిపై భారీగా వర్షం నీరు నిలవడంతో వాహనాలు నెమ్మదిగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ జామ్ అయింది. శ్రీ రాం నగర్ లోని లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిలిచింది. జీడిమెట్ల డిపో వద్ద వరద నీరు రోడ్డుపై నిలిచింది. కుత్బుల్లాపూర్ వెంకటేశ్వర కాలనీలోని పలు ఇళ్లలోకి నీరు చేరింది. చింతల్ కాకతీయ నగర్లో నాలలోని డ్రైనేజీ నీరు వీధులను ముంచెత్తింది.