తప్పనిసరిగా మాస్క్‌లు ధరించండి: అధికారులు 


ఓ వైపు కరోనా పూర్తిగా పోనే లేదు. ఈలోగా మంకీపాక్స్ కలవరం మొదలైంది. ఇప్పటికే భారత్‌లో మూడు మంకీపాక్స్‌ కేసులు నమోదయ్యాయి. వీటిని కంట్రోల్ చేయటానికే ప్రభుత్వాలు తలలు పట్టుకుంటుంటే ఇప్పుడు మరోటి వచ్చి పడింది. స్వైన్‌ఫ్లూ (H1N1) కూడా కలవర పెడుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫతేపూర్‌లో రాంబాబు అనే ఓ వ్యక్తికి స్వైన్‌ఫ్లూ సోకింది. కాన్‌పూర్‌లోని ఓ ఆసుపత్రికి తరలించి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. బాధితుడు పది రోజులుగా తీవ్ర జ్వరం, జలుబు, దగ్గు, నడుము నొప్పితో బాధ పడుతున్నాడు. అనుమానం వచ్చి టెస్ట్ చేయించగా స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌గా నిర్ధరణైంది. ఈ టెస్ట్ రిపోర్ట్‌ వచ్చాక, వెంటనే బాధితుడి కుటుంబాన్ని అప్రమత్తం చేశారు. ఐసోలేట్ అవ్వాలని అధికారులు సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో అందరూ తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని మెడికల్ ఆఫీసర్స్ చెబుతున్నారు. ప్రస్తుతానికి పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని వెల్లడించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో పందులు భారీ సంఖ్యలో చనిపోతున్నాయి. కాన్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు..మృతి చెందిన పందుల నుంచి శాంపిల్స్ సేకరించి టెస్ట్‌కు పంపుతున్నారు. భోపాల్‌లోని లాబొరేటరీకి ఈ నమూనాలు పంపారు. 


ముంబయిలోనూ స్వైన్‌ఫ్లూ కేసులు


ఆఫ్రికన్ స్వైన్‌ ఫివర్‌తోనే ఈ పందులు మృతి చెందినట్టు అనుమానించారు. అయితే వీటి నమూనాలను పరీక్షించాక కానీ ఇది నిర్ధరణ అయ్యేలా లేదు. ఈ శాంపిల్స్ టెస్ట్ చేశాక నలుగురు అధికారులతో కూడిన కమిటీ ఆ రిపోర్ట్‌ను పరిశీలించనుంది. అటు ముంబయిలోనూ స్వైన్‌ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే నలుగురికి ఈ వ్యాధి సోకింది. ఆరోగ్యం విషమించటం వల్ల లైఫ్ సపోర్ట్‌ సిస్టమ్‌పై ఉంచారు. 
జులైలో ఇప్పటి వరకూ 11 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. స్వైన్‌ఫ్లూ పందుల ద్వారా సోకుతుంది. తీవ్ర జ్వరం, జలుబు, దగ్గు, వణుకు, నీరసం, ఒళ్లు నొప్పులు..ఈ వ్యాధి లక్షణాలు. కేరళ వయనాడ్ జిల్లాలోని మనంతవాడి వద్ద రెండు పందుల పెంపక కేంద్రాల్లో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కేసులు వెలుగుచూశాయి. ఒకే ఫాంలో ఎక్కువ పందులు చనిపోవడంతో అనుమానం వచ్చిన అధికారులు 
శాంపిళ్లను టెస్టింగ్‌కు పంపించారు. భోపాల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్‌ ఈ శాంపిల్స్‌ను పరీక్షించింది. పందులకు ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాధి సోకినట్లు నిర్ధారించారు. ఆఫ్రికన్ స్వైన్ వ్యాధి నిర్ధరణ కావడంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. వ్యాధి వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఫాంలోని 300 పందులను చంపేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు పశు సంవర్ధకశాఖ అధికారులు తెలిపారు.