Why CM jagan No Tours : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విపత్తులు వచ్చినా క్షేత్ర స్థాయిలో పర్యటించడం లేదు. సొంత జిల్లాను వరదలు చుట్టుముట్టి అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయిన తీవ్ర ఘటన సమయంలోనూ ఆయన క్యాంప్ ఆఫీస్‌కే పరిమితమయ్యారు. ఇప్పుడు గోదావరి వరదల విషయంలోనూ అంతే. అయితే రెండు సందర్భాల్లో ఓ పూట ఏరియల్ సర్వే చేశారు. కానీ క్షేత్ర స్థాయిలో పర్యటనలుక మాత్రం దూరంగా ఉన్నారు. ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నా పట్టించుకోవడం లేదు. బాధితుల్లో తమను పట్టించుకోవడం లేదన్న భావన పెరుగిపోతుదంనే అభిప్రాయం వినిపిస్తున్నా లైట్ తీసుకుంటున్నారు. సీఎం జగన్ విపత్తుల సమయంలో ఎందుకు బయటకు రావడం లేదు ? ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో అప్పటి సీఎంపై చేసిన విమర్శలు తనకు అన్వయించేలా ఎందుకు వ్యవహరిస్తున్నారు ?
గోదావరి వరద బాధిత ప్రాంతాలకు వెళ్లని సీఎం జగన్ !
గోదావరి వరద వందేళ్లలో ఎప్పుడూ రానంత వచ్చిందని సీఎం జగన్ స్వయంగా చెప్పారు. పెద్ద ఎత్తున గ్రామాలు మనిగిపోయాయి. పోలవరం ముంపు గ్రామాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వేల మంది ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నా మీడియా, సోషల్ మీడియా రిపోర్ట్ చేస్తోంది. అదే సమయంలో ప్రభుత్వం ప్రకటించిన సహాయం కూడా ప్రజలకు సక్రమంగా చేరడం లేదనే ఆరోపణలు వచ్చాయి. అయితే.. ఒక్క సారి అదీ కూడా విశాఖలో ఓ పథకానికి మీట నొక్కి వస్తున్న క్రమంలో కాసేపు ఏరియల్ సర్వే చేశారు సీఎం జగన్. ఆ తర్వాత క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లే ఆలోచన చేయలేదు. దీంతో ప్రజలకు ప్రభుత్వం తమను వదలకు వదిలేసిందని అనుకునే పరిస్థితి ఏర్పడింది.
రాయలసీమ వరదల విపత్తులోనూ వెళ్లని సీఎం జగన్ !
ఇప్పుడే కాదు సీఎం జగన్ ఎప్పుడు ఎలాంటి విపత్తు వచ్చినా ప్రత్యక్ష పరిశీలనకు వెళ్లరు. సొంత జిల్లా కడపలో అన్నమయ్య జలాశయం కొట్టుకుపోయి పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తినష్టం జరిగింది. అయితే సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్ సమీక్షలకే పరిమితమయ్యారు. కానీ ప్రత్యక్షపరిశీలనకు వెళ్లలేదు. చివరికి పరిస్థితులు అన్నీ సద్దుమణిగిన తర్వాతా పరిశీలనకు వెళ్లారు. అయితే కష్టం వచ్చినప్పుడు కాకుండా తీరికగా రావాల్సిన అవసరం ఏమిటన్న విమర్శలు అప్పుడు వచ్చాయి.
తాను వెళ్తే సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుందని సీఎం వాదన !
విపత్తుల సమయంలో తాను ఆయా ప్రాంతాలకు వెళ్లకపోవడానికి సీఎం జగన్ అసెంబ్లీలో కారణం చెప్పారు. తాను వెళ్లడం వల్ల అధికార యంత్రాంగం మొత్తం తన పర్యటన ఏర్పాట్ల కోసం పని చేస్తుందని దాని వల్ల సహాయ కార్యక్రమాలకు వెళ్లడం లేదని చెప్పారు. బాధితుల్ని మరింత ఇబ్బంది పెట్టలేననే వాదన ఆయన వినిపించారు. అయితే ఈ వాదనను విపక్షాలు కొట్టి పారేస్తున్నాయి. సీఎం జగన్ క్షేత్ర స్థాయిలో ఉంటేనే అధికారులు మరింత జాగ్రత్తగా ప్రజలకుసేవలు చేస్తారని .. లేకపోతే ఎవరూ అదుపులో ఉండరని...పట్టించుకోరని చెబుతున్నారు. బాధితులకు పరామర్శ ఇవ్వడం ఇష్టం లేక.. ఎక్కడ సాయం ప్రకటించాల్సి వస్తుందోనన్న కారణంగానే జగన్ విపత్తు ప్రాంతాలకు వెళ్లరని విపక్షాలు విమర్శలు వస్తున్నాయి.
సీఎం గాలికొదిలేశారనే భావనలో బాధితులు !
ఎక్కడైనా ప్రభుత్వాధినేత పర్యటించి ధైర్యం చెబితే ప్రజలకు లభించే భరోసా వేరు. కానీ ఏపీ సీఎం మాత్రం తాను విపత్తుల సమయంలో పర్యటించడం వల్ల చాలా సమస్యలు వస్తాయని అంటున్నారు . కానీ ప్రభుత్వం నుంచి ఎంతో ఆశించే బాధితులు.. ముఖ్యమంత్రి కూడా కనీస పలకరింపుకు రాకపోవడం వల్ల తమను ప్రభుత్వం గాలికి వదిలేసిందన్న అభిప్రాయానికి వస్తున్నారు.ఇది ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడానికి కారణం అవుతోందన్న అభిప్రాయం ఉంది. అదే సమయంలో విపక్ష నేతలు ఎంత కష్టమనా పరిశీలన జరిపి బాధితులకు వీలైనంత సాయంతో పాటు.. భరోసా ఇస్తున్నారు. ఆ ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి జరగడం లేదు.