Hyderabad Rains : హైదరాబాద్ లో మరోసారి వర్షం దంచికొట్టింది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నగరంలోని ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. సాయంత్రం సమయంలో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు జలమయమయ్యాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఖైరతాబాద్, పంజాగుట్ట, రాజ్‌భవన్ రోడ్, లక్డీకపూల్ ప్రాంతాల్లో రోడ్డుపై మోకాలి లోతులో నీళ్లు నిలిచిపోయాయి. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, మూసాపేట, ఎర్రగడ్డ, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, ముషీరాబాద్, చిక్కడపల్లి, రాంనగర్, కవాడిగూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఉప్పల్, సికింద్రాబాద్, బేగంపేట, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురంతో పాటు ఇతర ప్రాంతాల్లో వర్షం పడింది.
ఈ రూట్ లో ట్రాఫిక్ జామ్
గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. భారీ వర్షాలతో మూసీ నది పరివాహక ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతోంది. భారీ వర్షంతో అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ సహాయక బృందాలు, ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. రహదారులపై నిలిచిన వర్షపు నీటిని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. బేగంపేట నుంచి సికింద్రాబాద్ వైపు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. వరద నీటిలో వాహనాలు నెమ్మదిగా కదులుతుండటం పలు చోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది.
మ్యాన్ హోల్స్ తెరిచిఉన్నాయ్ జాగ్రత్త
బీహెచ్ఈఎల్, మియాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బీహెచ్ఈఎల్ నుంచి మియాపూర్ వరకు రోడ్లపై వర్షపు నీరు చేరడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రెండు గంటల పాటు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్‌ను క్లియర్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. మలక్ పేట, నాగోల్, దిల్ సుఖ్ నగర్, ఉప్పల్ ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదు అయింది. ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బందులు కలుగుతోంది. అయితే నీరు త్వరగా వెళ్లిపోయేందుకు మ్యాన్ హోల్స్ తెరిచినందున ప్రజలు జాగ్రత్తవహించాలని జీహెచ్ఎంసీ హెచ్చరించింది.