Chikoti Praveen: క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారారు. సోమవారం ఈడీ ముందు మరోసారి ప్రవీణ్ హాజరుకానున్నారు. చికోటి చీకటి సామ్రాజ్యంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్పీ ఛైర్మన్లు ఇలా చాలా మంది ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే చికోటి ఈడీ ముందుకు వెళ్తే తమ పేర్లు బయటపడతాయన్న భయంతో కొందరు అతడి ఇంటి వద్ద పహారా పెట్టినట్లు సమాచారం. చికోటి ప్రవీణ్ ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు పహారా కాసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇంటి సమీపంలో దుండగులు తిష్ట వేశారన్నారు. దీంతో చికోటి ప్రవీణ్ ప్రైవేటు సెక్యూరిటీ అప్రమత్తం అయింది.
చికోటికి భద్రత కావాలి : కుటుంబసభ్యులు
గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరగడంతో చికోటి ప్రైవేటు సెక్యూరిటీ అప్రమత్తమైంది. ఇంటి చుట్టూ అమర్చిన సీసీటీవీ కెమెరాల ద్వారా వారిని కుటుంబ సభ్యులు పరిశీలిస్తున్నారు. సోమవారం ఈడీ ముందు చికోటి ప్రవీణ్, మాధవరెడ్డి హాజరు కానున్నారు. చికోటి ప్రవీణ్ కు ప్రాణహాని ఉందని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనకు హాని తలపెట్టవచ్చని అంటున్నారు. సోమవారం ఈడీ కార్యాలయానికి చికోటి ప్రవీణ్ వెళ్లే వరకు భద్రత ఇవ్వాలని కుటుంబ సభ్యులు అధికారులను కోరారు. అయితే వారి విజ్ఞప్తిపై అధికారులు, పోలీసులు ఎలా స్పందించనున్నారో చూడాలి.
అసలేం జరిగింది..?
ఇప్పుడు ఎక్కడ చూసిన చికోటి ప్రవీణ్ గురించి వార్తలే కనిపిస్తున్నాయి. చికోటి ప్రవీణ్ పేరు ప్రస్తావిస్తూ రాజకీయ నాయకులు సైతం విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకునే వరకు వచ్చింది సంగతి.
ఇటీవల చికోటి ప్రవీణ్ ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. అప్పటి నుంచి ఒక్కొక్కటిగా చికోటి సంబంధించిన లింకులు బయటకు వస్తున్నాయి.
చికోటీ ప్రవీణ్ లింకులు
బాలీవుడ్, టాలీవుడ్ హీరో, హీరోయిన్లతో, ఇతరు నటీనటులు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లతో చికోటి ప్రవీణ్ కు సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. వారిని వివిధ పార్టీలకు పిలవడం అందుకోసం భారీగా ఖర్చు చేయడం ప్రవీణ్ స్టైల్. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలోని రాజకీయ నాయకులతో ప్రవీణ్ కు చీకటి ఒప్పందాలు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం పదవిలో ఉన్న మంత్రులతో పాటు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, ఇతర కార్పొరేషన్ల ఛైర్మన్లతో చికోటి ప్రవీణ్ చీకటి సామ్రాజ్యం విస్తరించాడని ఆరోపణలు వచ్చాయి.
Also Read : Chikoti Casino Case : కేసినో కేసులో ఏడుగురికి ఈడీ నోటీసులు - పట్టించేసిన రూ. కోట్ల లావాదేవీలు !