President Droupadi Murmu : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ముందుగా ఏపీలోని శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లను దర్శించారు. అనంతరం హైదరాబాద్ చేరుకున్నారు రాష్ట్రపతి. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి హైదరాబాద్ చేరుకున్నారు. ఐదు రోజుల పాటు బొల్లారం రాష్ట్రపతి శీతాకాల విడిదిలో ఉండనున్నారు. సోమవారం సాయంత్రం హకీంపేట్ ఎయిర్ పోర్టు చేరుకున్న రాష్ట్రపతి ముర్ముకు గవర్నర్ తమిళసై, సీఎం కేసీఆర్ , సీఎస్ స్వాగతం పలికారు. హకీంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి ద్రౌపది ముర్ము వెళ్లారు. ఇవాళ రాజ్‌భవన్‌లో జరిగే విందు కార్యక్రమానికి రాష్ట్రపతి హాజరవుతారు. అయితే ఈ విందుకు సీఎం కేసీఆర్ హాజరుకావట్లేదని సమాచారం. రాష్ట్రపతికి స్వాగతం పలికిన అనంతరం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. రాజ్ భవన్ లో విందుకు మంత్రులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా సోమవారం నుంచి శుక్రవారం వరకు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అయితే రాష్ట్రపతికి స్వాగత కార్యక్రమంలో ఒకే వేదిక గవర్నర్ , సీఎం కేసీఆర్ కనిపించారు.
శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, తెలంగాణ గవర్నర్ తమిళసై సోమవారం దర్శించుకున్నారు. స్వామి అమ్మవారి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకు ఆలయ అర్చకులు, మంత్రులు బుగ్గన, కొట్టు సత్యనారాయణ, రోజా, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్, ఈవో.... పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. దర్శనంతరం వేద ఆశీర్వచన మండపంలో రాష్టప్రతికి పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామి అమ్మవార్ల చిత్రపటం జ్ఞాపిక, శేష వస్త్రాలు, లడ్డు ప్రసాదాలు అందజేశారు. కేంద్ర టూరిజం శాఖ ద్వారా రూ.43 కోట్లతో దేవస్థానం చేపట్టిన ప్రసాద్ ప్రాజెక్ట్ భవనాలు, యాత్రిక సదుపాయాల కేంద్రం,యాంఫీ థియేటర్ల శిలాఫలకాన్ని రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, తెలంగాణ గవర్నర్ తమిళ సై ఆవిష్కరించారు. ప్రసాద్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం క్షేత్రపరిధిలోని శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శనించిన రాష్ట్రపతికి గిరిజన విద్యార్థులు చెంచు నృత్యంతో స్వాగతం పలికారు. అనంతరం చెంచు గిరిజన మహిళలతో రాష్ట్రపతి ముఖాముఖి నిర్వహించి ఆప్యాయంగా పలకరించారు. శివాజీ స్ఫూర్తి కేంద్రం సందర్శనంతరం తిరిగి రోడ్డు మార్గంలో సున్నిపెంట హెలిప్యాడ్ కు చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో హైదరాబాద్ కు వెళ్లారు రాష్ట్రపతి.
28న రామప్ప ఆలయానికి రాష్ట్రపతి
మూలుగు జిల్లాలోని రామప్ప ఆలయం కేంద్ర బలగాల ఆధీనంలోకి వెళ్లిపోయింది. ఈనెల 28న వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప ఆలయాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శించనున్నారు. రాష్ట్రపతి పర్యటన కోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. రామప్ప ఆలయాన్ని కేంద్ర బలగాలు కంట్రోల్లోకి తీసుకున్నాయి. రక్షణ రంగానికి చెందిన హెలికాఫ్టర్లతో ట్రైల్ రన్ నిర్వహించారు. 27, 28 తేదీల్లో రామప్పకు సందర్శకులను నిలిపివేస్తూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.