CM KCR : సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటులో బిజీబిజీగా ఉన్నారు. జాతీయ పార్టీ ఏర్పాటు, పేరు, జెండా రూపకల్పనపై ఇప్పటికే పార్టీ వర్గాలతో చర్చించినట్లు సమాచారం. అలాగే దేశంలో ఎక్కడెక్కడ సభలు నిర్వహించాలనే దానిపై పార్టీ వర్గాలతో సీఎం కేసీఆర్ చర్చిస్తున్నారు. విజయ దశమి రోజున సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఊహాగానాల మధ్య ఆదివారం హైదరాబాద్ ప్రగతి భవన్ కీలక సమావేశం జరుగుతోంది. సీఎం కేసీఆర్ మంత్రులు, 33 జిల్లాల టీఆర్ఎస్ అధ్యక్షులతో కీలక సమావేశం ఏర్పాటుచేశారు.  ఈ సమావేశంలో జాతీయ పార్టీ ఏర్పాటుపై పార్టీ నేతలతో కేసీఆర్ విస్తృతంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.  


డిసెంబర్ 9న దిల్లీలో బహిరంగ సభ 


ఈ భేటీలో పార్టీ వర్గాలకు విజయదశమి నాడు జాతీయ పార్టీని అధికారికంగా ప్రకటించే విషయం సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. జాతీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశాలు, జెండా, అజెండాలపై మంత్రులు, పార్టీ జిల్లాల అధ్యక్షులకు వివరించనున్నారు.  మంత్రులు, అధ్యక్షుల సలహాలు, సూచనలు తీసుకోనున్నారు.  అయితే జాతీయ పార్టీ ప్రకటన అనంతరం తొలి బహిరంగ సభను కరీంనగర్‌లోనే నిర్వహించాలని కేసీఆర్ యోచిస్తున్నారు. దిల్లీ, ఉత్తర ప్రదేశ్ తో పాటు మహారాష్ట్రలోని మరఠ్వాడా ప్రాంతంలో  బహిరంగసభలు నిర్వహించాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. మునుగోడు బై పోల్ బాధ్యతలపైనా ఈ సమావేశంలో చర్చించనున్నారు. డిసెంబర్ 9న దిల్లీలో కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.  తెలంగాణ భవన్ లో దసరా రోజున ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్మన్ లు, జిల్లా అధ్యక్షులు, గ్రంథాలయ ఛైర్మన్ లతో  సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. 


వివిధ కార్యక్రమాలు 


అక్టోబర్ 5న దసరా రోజు మధ్యాహ్నం 1.19 గంటలకు సీఎం కేసీఆర్‌ జాతీయ పార్టీ ప్రకటన చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే రోజు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్మన్, జిల్లా అధ్యక్షులతో సీఎం కేసీఆర్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటుపై టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో తీర్మానం చేయనుంది. డిసెంబరు 9న దిల్లీలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. జాతీయ పార్టీ పేరు, జెండా, అజెండాతో ముఖ్యమైన అంశాలపై ఇవాళ్టి సమావేశంలో పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. విజయదశమి రోజున జాతీయ పార్టీ ప్రకటన నుంచి వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఫ్లెక్సీలు, బాణసంచా సందడి వంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళిక చేస్తున్నారు.  ప్రణాళిక చేస్తున్నారు.


Also Read : Minister KTR : బీజేపీ పేరు ఇలా మార్చేసుకోండి, ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ సెటైర్


 Also Read : KCR Speech: వెకిలి వ్యక్తుల ప్రయత్నాలతో ఆయన ప్రభ ఏనాటికీ తగ్గదు - వాళ్లు మహాత్ములు కాలేరు: కేసీఆర్