Panjagutta Police Video : గస్తీ విధులు గాలికి వదిలేసిన పోలీసులు మద్యం సేవిస్తూ చిక్కారు. మద్యం సేవిస్తూ అడ్డంగా దొరికి పోయారు హైదరాబాద్ పంజాగుట్ట గస్తీ పోలీసులు. మూడు రోజుల క్రితం ఎర్రమంజిల్ గలేరియా మాల్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విధుల్లో ఉండి మద్యం సేవిస్తూ అడ్డంగా బుక్కైపోయిన ఖాకీలపై ఉన్నతాధికారులు చర్యలకు చేపట్టారు.
గస్తీ గాలికి వదిలేని మద్యంతో చిల్
పంజాగుట్ట పోలీసులు గస్తీ గాలికి వదిలేసి చక్కగా చుక్క వేసుకుంటున్నారు. అర్ధరాత్రి కదా ఎవరూ రారనే ధైర్యంతో రోడ్డు పక్కనే సిట్టింగ్ పెట్టారు. రోడ్డు పక్కనే పెట్రోలింగ్ పోలీసు వాహనాన్ని అడ్డుగాపెట్టి మద్యం సేవిస్తున్నారు ఇద్దరు పోలీసులు. అటుగా వెళ్తున్న కొందరు పోలీసుల బాగోతాన్ని వీడియో తీశారు. దీంతో గస్తీ పోలీసులు అడ్డంగా బుక్కయ్యారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పంజాగుట్ట ప్రాంతంలో రాత్రి పూట పెట్రోలింగ్ చేయాల్సిన పోలీసులు విధులను గాలికి వదిలేసి రోడ్డు పక్కన కూర్చొని మందేస్తూ ముచ్చట పెట్టారు. మంచింగ్ కోసం తెచ్చుకున్న చికెన్ ను ప్లేట్ పెట్టుకుని అది గాలికి ఎగరకుండా వాకీటాకీని బరువుకు పెట్టారు. మద్యం బాటిల్ ఎవరికీ కనిపించకుండా దాచిపెట్టారు. అయితే సేవిస్తున్న గ్లాసుల్లోని మద్యాన్ని దాచలేకపోయారు. వీడియోలో పోలీసులు మద్యం సేవిస్తున్న రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.
ఉన్నతాధికారుల దృష్టికి
ఈ ఘటన మూడు రోజుల క్రితం ఎర్రమంజిల్ గలేరియా మాల్ సమీపంలో జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో ఉన్నతాధికారులు చర్యలకు ఆదేశించారు. విధుల్లో ఉండి మద్యం సేవిస్తూ దొరికిన పోలీసులపై చర్యలకు ఉపక్రమించారు. విధుల్లో ఉండి రాత్రి పూట పెట్రోలింగ్ చేయాల్సిన పోలీసులు ఇలా మందు కొడుతూ ఉండడంతో నెటిజన్లు మండిపడుతున్నారు.
సీఎంను దూషించిన కానిస్టేబుల్
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ సీఎం జగన్ ను దూషించిన వీడియో వైరల్ అయింది. జీతాల విషయంలో సీఎం జగన్ పై అనుచితంగా మాట్లాడడంతో పోలీసులు కానిస్టేబుల్ ను శుక్రవారం అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం కోర్టు ముందు హాజరు పర్చగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. హైవే మొబైల్ వెహికల్ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు సీఎం జగన్ ను దూషించాడు. ఏఆర్ కానిస్టేబుల్ వీడియో రికార్డు చేసిన వ్యక్తి పోలీసు అధికారులకు పంపించాడు. జీతాల విషయంలో సీఎం జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల కానిస్టేబుల్ ను పోలీసులు అరెస్టు చేశారు.
కానిస్టేబుల్ కు బెయిల్ మంజూరు
ఏఆర్ కానిస్టేబుల్ తన్నీరు వెంకటేశ్వరరావు బెయిల్ పిటిషన్ స్థానిక కోర్టు శనివారం విచారించింది. అనంతరం కానిస్టేబుల్ కు బెయిల్ మంజూరు చేసింది. వేతనాలపై సీఎం ను దూషించారని శుక్రవారం వెంకటేశ్వరరావును రిమాండ్ కు తరలించారు. బెయిల్ పిటిషన్ పై ఇవాళ జగ్గయ్యపేట కోర్టులో వాదనలు జరగగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వెంకటేశ్వరరావు తరపున లాయర్లు దొద్దాల కోటేశ్వరరావు, మాగులూరి హరిబాబు వాదనలు వినిపించారు. వాదనలు విన్న జగ్గయ్యపేట కోర్టు వెంకటేశ్వరరావుకు బెయిల్ మంజూరు చేసింది.