Hyderabad Lal Darwaza Bonalu : తెలంగాణలో ఆషాడ బోనాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ పాతబస్తీలో లాల్ దర్వాజాలో కూడా బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. షట్లర్ పీవీ సింధు, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్నారు. అయితే బోనాల ఉత్సవాల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. సింహవాహిని అమ్మవారి ఆలయ సమీపంలో ఓ బృందంపై కొందరు ఒక్కసారిగా కర్రలతో దాడికి దిగారు. పోతలింగం ఆలయానికి చెందిన పోతురాజులు రవీందర్‌, సుధాకర్‌లు 20 మంది బృందంతో లాల్‌ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయానికి వచ్చారు.  అమ్మవారిని దర్శించుకుని తిరిగి వెళ్తున్నప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. 


కర్రలతో దాడి 


కర్రలతో దాడికి చేసుకున్నారు. ఈ దాడిలో కొందరు తీవ్రంగా గాయపడ్డారు. పోతురాజు రవీందర్‌కు ఎడమకంటి వద్ద గాయమై తీవ్ర రక్తస్రావమైంది. పాత గొడవలే ఈ దాడికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. సౌత్‌జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపుచేశారు. లా అండ్‌ ఆర్డర్‌ అడిషనల్‌ సీపీ చౌహాన్‌ ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ మరో వర్గం సింహవాహిని అమ్మవారి దేవాలయం వద్ద నిరసన తెలిపారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని మరో వర్గం డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పడంతో ఆందోళన విరమించారు.


అమ్మవారిని దర్శించుకున్న మంత్రి


దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. తెలంగాణ రాష్టం వచ్చిన తర్వాత  బోనాల జాతర ఘనంగా నిర్వహిస్తున్నామని, బోనాలను ప్రభుత్వం అధికార పండుగగా జరుపుతోందని అన్నారు. దేవాలయాలకు నిధులు ఇచ్చే ఘనత సీఎం కేసీఆర్‌ కే దక్కిందని, అనుకున్న దాని కంటే ఎక్కువ వర్షాలు కురిశాయి కాబట్టి అమ్మవారు శాంతించేలా పూజలు చేయాలని అన్నారు. భక్తులకు అసౌకర్యం లేకుండా ఆలయ కమిటీ మంచి ఏర్పాట్లు చేసిందని అన్నారు. లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయ అభివృద్ధికి రూ.20 కోట్లు కేటాయించామని, త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు.


Also Read : KTR Birthday: కేటీఆర్‌కు సెలబ్రిటీల నుంచి విషెస్ వెల్లువ, రామ్ చరణ్ స్పెషల్! పార్టీ ఎక్కడ భాయ్ అన్న సోనూసూద్


Also Read : PV Sindhu: బోనాల సంబరాల్లో పీవీ సింధూ, లాల్‌దర్వాజ అమ్మవారికి బంగారు బోనం