NIMS Doctors Saves Young Man Life: ఓ యువకుడి ఛాతీలోకి ప్రమాదవశాత్తు బాణం చొచ్చుకుపోయింది. 24 గంటలుగా నొప్పితో ఆ యువకుడు విలవిల్లాడుతూ నరకయాతన అనుభవించాడు. చివరకు నిమ్స్ వైద్యులు ఆ యువకుడికి శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఊసూర్ ప్రాంతానికి చెందిన సోది నంద (17) అనే గుత్తికోయ తెగకు చెందిన యువకుడు గురువారం స్థానికంగా అడవికి వెళ్లాడు. ఈ క్రమంలో అతని ఛాతీలోకి ఓ బాణం ప్రమాదవశాత్తు చొచ్చుకుపోయింది. దీంతో విలవిల్లాడుతూ నకరయాతన అనుభవించాడు. స్థానికులు వెంటనే భద్రాచల ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచనతో వరంగల్ ఎంజీఎం (Warangala MGM), అక్కడి నుంచి శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నిమ్స్ (NIMS) తరలించారు. యువకుడి పరిస్థితి గమనించిన వైద్యులు తొలుత సీటీ స్కాన్ తీసి.. ఊపిరితిత్తుల పక్క నుంచి గుండెలోని కుడి కర్ణికలోకి బాణం గుచ్చుకున్నట్లు గుర్తించారు. అప్పటికే తీవ్ర రక్తస్రావం అయ్యింది.
శస్త్రచికిత్సతో..
సదరు యువకునికి శస్త్రచికిత్స చేసేందుకు వైద్యులు ఉపక్రమించారు. ఓవైపు రక్తం ఎక్కిస్తూనే.. దాదాపు 3 గంటలపాటు క్లిష్టమైన సర్జరీ చేసి బాణాన్ని తొలగించారు. అది దిగిన చోట రక్తస్రావమై గడ్డ కట్టడంతో ప్రాణాపాయం తప్పిందని అన్నారు. ఒకవేళ యువకుడు సొంతంగా బాణం తీసేందుకు యత్నించి ఉంటే.. మరింతగా రక్తస్రావమై పరిస్థితి చేజారిపోయేదని చెప్పారు. యువకుడికి ఈ సర్జరీ పూర్తి ఉచితంగా చేశామని.. కోలుకున్న వెంటనే డిశ్చార్జి చేస్తామని నిమ్స్ డైరెక్టర్ డా.బీరప్ప తెలిపారు. సర్జరీ విజయవంతగా చేసిన డా.అమరేశ్వరరావు, సీనియర్ వైద్యులు డా.గోపాల్‌ను అభినందించారు.
ఆలౌట్ తాగిన చిన్నారికి...
ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్ ప్రాంతానికి చెందిన 18 నెలల చిన్నారి తెలియక ఆలౌట్ సీసాలోని దోమల మందు మొత్తం తాగేసింది. ఆ మందు ఊపిరితిత్తులపై తీవ్రమైన ప్రభావం చూపడం మొదలుపెట్టింది. చిన్నారి ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారింది. ఈ విషయం గమనించిన తల్లిదండ్రులు.. తొలుత స్థానికంగా ఉన్న ఆస్పత్రికి, తర్వాత అక్కడి నుంచి రాయ్‌పూర్‌కు మెరుగైన వైద్యం కోసం తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు చిన్నారిని వెంటిలేటర్‌పై ఉంచి.. చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. ఆమె ఊపిరితిత్తుల పరిస్థితి బాగుపడకపోవడంతో ఆమెకు సరిగా ఊపిరి అందలేదు. దాంతో రాయపూర్ ఆస్పత్రి వర్గాలు హైదరాబాద్ కిమ్స్ కడల్స్ ఆస్పత్రి సాయం కోరారు. దీంతో హైదరాబాద్ నుంచి ఇద్దరు ఊపిరితిత్తుల నిపుణులు, ఒక పెర్ఫ్యూజనిస్టు, ఒక కార్డియాక్ సర్జన్, ఐసీయూ నర్సు కలిసి రాయ్‌పూర్‌కు వెళ్లి.. సదరు ఆస్పత్రిలో చిన్నారికి వైద్యం అందించారు. చిన్నారిని పరీక్షించిన డాక్టర్లు.. ఆలౌట్‌లోని హైడ్రోకార్బన్స్ కారణంగా కెమికల్ న్యూమోనైటిస్ అనే సమస్య ఏర్పడిందని అవగాహనకు వచ్చారు.
ఆ కారణంగా చిన్నారి శరీరానికి తగినంత ఆక్సిజన్ అందకపోవడం.. ఉన్న వెంటిలేటర్ సరిపోకపోవడంతో ఆమె కుడివైపు గుండె కూడా క్రమంగా దెబ్బతింటున్న విషయాన్ని గుర్తించారు. దాంతో ఆ పాపకు ఎక్మో (Extracorporeal Membrane Oxygenation) పెట్టి, ఊపిరితిత్తులు చేసే పనిని యంత్రం చేసేలా చేసి.. ఆ చిన్నారి లంగ్స్ ను మెరుగుపర్చేలా చేశారు. ఈ విధానం చాలా అరుదని వైద్యులు తెలిపారు. పాపకు 9 రోజుల పాటు ఎక్మో మీద పెట్టాక పరిస్థితి మెరుగుపడడంతో మరో ఐదారు రోజులు సాధారణ వెంటిలేటర్ మీద ఉంచారు. 18 రోజుల చికిత్స తర్వాత పాప పూర్తిగా కోలుకుందని.. ఆమెను డిశ్చార్జి కూడా చేశామని డాక్టర్లు తెలిపారు.