Mlas Bribery Case : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై తెలంగాణ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. విచారణకు హాజరు కావాలని సిట్ ఇచ్చిన నోటీసులపై జగ్గుస్వామి, బీఎల్ సంతోష్ హైకోర్టును ఆశ్రయించారు. సిట్ నోటీసులపై జగ్గూ స్వామి హైకోర్టు క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషనపై వాదనలు కొనసాగుతున్నాయి. బీఎల్ సంతోష్ కి ఇచ్చిన సీఆర్పీసీ 41 కింద ఇచ్చిన నోటీసులపై కూడా విచారణ కొనసాగుతోంది. ఇవాళ్టితో బీఎల్ సంతోష్ నోటీసులపై ఇచ్చిన స్టే ముగియనుంది. ఈ స్టే ఆదేశాలను హైకోర్టు మరోసారి పొడిగించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోష్ కు ఇచ్చిన స్టే ను హైకోర్టు ఈ నెల 13వ తేదీ వరకు పొడిగించింది. బీఎల్ సంతోష్ నోటీసులపై హైకోర్టు గతంలో స్టే విధించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగ్గూ స్వామి కూడా హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. జగ్గూ స్వామి నోటీసులపై కూడా హైకోర్టు  స్టే విధించింది.  ఈ కేసులో తదుపరి విచారణను డిసెంబర్ 13కు వాయిదా వేసింది. 


బీఎస్ సంతోష్ నోటీసులపై మరోసారి స్టే 


 తెలంగాణ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన కేసులో తనను నిందితునిగా చేర్చడంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై తప్పుడు కేసు పెట్టారని ఆ కేసును క్వాష్ చేయాలని పిటిషన్‌లో కోరారు. విచారణకు హాజరు కాకముందే..  బీఎల్ సంతోష్‌ను ఏ-4 నిందితునిగా చేరుస్తూ.. ఏసీబీ కోర్టులో ప్రత్యేక దర్యాప్తు బృందం మెమో దాఖలు చేసింది.  ముందు ఇచ్చిన సిట్ నోటీసులకు బీఎల్ సంతోష్ స్పందించకపోవడంతో రెండోసారి  సిట్ అధికారులు 41 ఏ సీఆర్‌సీపీ  కింద  నోటీసులు జారీ చేశారు.  41ఏ సీఆర్‌పీసీ సెక్షన్ కింద  బీఎల్ సంతోష్ పాటు  తుషార్, జగ్గుస్వామిలపై  కూడా   పోలీసులు  కేసు నమోదు  చేశారు.  ఈ  కేసులో  అరెస్టైన  నిందితులు  బీఎల్ సంతోష్ తో  మాట్లాడినట్టుగా సిట్  వాదిస్తుంది.  ఈ  కేసులో  సంతోష్ ను విచారిస్తే  కీలక  విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని సిట్  చెబుతుంది. ఎమ్మెల్యేలతో నిందితులు  మాట్లాడినట్టుగా  బయటకు వచ్చినట్టుగా  ఉన్న  ఆడియోలు, వీడియోల్లో  కూడా  సంతోష్  పేరును కూడా  ఉపయోగించారు. ఈ  కేసులో  తన  పేరును తొలగించాలని  కోరుతూ  బీజేపీ  నేత  బీఎల్ సంతోష్   తెలంగాణ హైకోర్టులో పిటిషన్  దాఖలు  చేశారు. దీనిపై హైకోర్టు స్టే విధించింది. 


జగ్గూ స్వామి క్వాష్ పిటిషన్ 


తెలంగాణ హైకోర్టులో జగ్గూ స్వామి కూడా క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ పంపిన 41A CRPC నోటీసులతో పాటు.. లుకౌట్ నోటీసులను కొట్టివేయాలని జగ్గూ స్వామి కోరారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతో తనకు ఎలాంటి సంబంధంలేదని అక్రమంగా కేసులో తన పేరుని చేర్చారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇక దీనిపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది.  ఇదిలా ఉండగా జగ్గూ స్వామికి ఈ కేసులో ప్రమేయం ఉందని, ఆయన ఈ కేసులో కీలక నిందితులైన తుషార్ రామచంద్ర భారతిలకు మధ్యవర్తిగా వ్యవహరించినట్లు తమవద్ద ఆధారాలు ఉన్నాయని సిట్ అధికారులు స్పష్టం చేస్తున్నారు.  ఈ కేసులో ప్రధాన నిందితుడు రామచంద్రభారతితో కేరళ వైద్యుడు కొట్టిలిల్‌ నారాయణ జగ్గూ అలియాస్‌ జగ్గూ స్వామి ఫోన్‌ సంభాషణలు రికార్డయ్యాయి. రామచంద్రభారతి తన ఫోన్‌లో జగ్గూ స్వామికి ‘విటమిన్‌ సీ’ సిద్ధం చేయాలని సందేశం పంపినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. కస్టడీలో నిందితులు వెల్లడించిన వివరాల మేరకు.. జగ్గూ స్వామిని విచారించేందుకు సిట్‌ సభ్యురాలు, నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరీ బృందం కేరళకు వెళ్లగా.. ఆయన అమృత ఆసుపత్రి నుంచి పరారయ్యారు. అప్పటి నుంచి అజ్ఞాతంలోనే ఉన్నారు. దీంతో సిట్‌ అధికారులు సాక్ష్యులైన జగ్గూ స్వామి సోదరుడు మణిలాల్, అతని ముగ్గురు పర్సనల్‌ అసిస్టెంట్లు శరత్, ప్రశాంత్, విమల్‌ లకు 41–ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేసింది.