Minister Jagadish Reddy : తెలంగాణ పర్యటకు వచ్చిన ప్రధాని మోదీ టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవినీత ప్రభుత్వాన్ని కూలదోస్తామన్నారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పై విషం చిమ్మేందుకే మోదీ తెలంగాణకు వచ్చారన్నారు. మునుగోడులో ఓట‌మి పాలైనందుకు మోదీ టీఆర్ఎస్ పై అక్కసును వెళ్లగ‌క్కార‌ని విమర్శించారు. వ‌డ్డీతో స‌హా ఇస్తార‌న్న మీకే ప్రజ‌లు తిరిగి చెల్లిస్తారన్నారు. బ్యాంక్ లోన్లు రాకుండా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుని, టీఆర్ఎస్ పార్టీలో అలజడి చేసేందుకు కుట్రలు చేస్తున్నార‌ని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు మరోసారి మోసపోవడానికి గుజరాత్ ప్రజల్లాంటి వారు కాద‌న్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. ఇతర పార్టీల నాయకులను భయపెట్టి ఎదురు లేకుండా చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తుంద‌న్నారు. సీఎం కేసీఆర్‌పై విషం కక్కినా తెలంగాణ ప్రజలు హంసల్లాంటి వారని, నీళ్లు, పాలు వేరు చేసినట్లు విషాన్ని కూడా వేరు చేస్తారన్నారు. బీజేపీ వదిలించుకునేందుకు కేసీఆర్ నాయకత్వంలో మరింతగా ముందుకు వెళ్తా్మన్నారు. అబద్ధాల పునాదుల మీద పార్టీ విస్తరణకు ప్రధాని మోదీ ప్రయ‌త్నం చేస్తున్నార‌ని మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి విమర్శించారు. 


టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ  ఏమన్నారంటే? 
 
 తెలంగాణ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బేగంపేటలో బీజేపీ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన... తెలంగాణలో అవినీతి ప్రభుత్వాన్ని కూలదోస్తామన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతోందని టీఆర్ఎస్ ను టార్గెట్ చేశారు. అవినీతి పాలనపై బీజేపీ కార్యకర్తలు పోరాటం చేస్తున్నారన్నారు. తెలంగాణ అభివృద్ధిలో పాలుపంచుకోవడం సంతోషకరంగా ఉందన్నారు.  బీజేపీ కార్యకర్తలు పోరాటం చేస్తున్నారని, వారిని చూసి తానేంతో ప్రభావితం అయ్యానన్నారు. తెలంగాణలో బీజేపీ కార్యకర్తలు ఒక యుద్ధం చేస్తున్నారన్నారు.  తెలంగాణ పేరుతో కొందరు అధికారం పొంది తమ జేబులు నింపుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో త్వరలోనే అంధకారం పోతుందని హామీ ఇచ్చారు. కొత్త సూర్యోదయం రాబోతుందన్నారు.  తెలంగాణ ప్రజలకు కొందరు నాయకులు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. 


తెలంగాణ ప్రజకు మాటిస్తున్నా


"ఎప్పుడు చీకటి కమ్ముకుంటుందో, నలుదిక్కులా చిమ్మచీకట్లు ముసురుకుంటాయో అప్పుడు కమలం వికసిస్తుంది. బీజేపీ కార్యకర్తల పోరాటంతో తెలంగాణలో చీకట్లు తొలగిపోతున్నాయి.  మునుగోడులో బీజేపీ కార్యకర్తలు ఎంతో వీరోచితంగా పోరాడారు. కష్టకాలంలో బీజేపీని తెలంగాణ ప్రజలు వదిలిపెట్టలేదు. 1984లో బీజేపీ కేవలం ఇద్దరు ఎంపీలే ఉన్నప్పుడు, హన్మకొండ నుంచి జంగారెడ్డిని గెలిపించారు.  రాష్ట్ర ప్రభుత్వమే మూఢ నమ్మకాలను ప్రోత్సహిస్తుంది. తెలంగాణ ప్రజలకు మాటిస్తున్నాను.. అవినీతి ప్రభుత్వాన్ని కూలదోస్తాం. కొందరు భయంతో మోదీని బూతులు తిడుతున్నారు, ఆ బూతులను నేను పట్టించుకోను. నన్ను తిట్టినా పట్టించుకోను కానీ తెలంగాణ ప్రజలను తిడితే ఊరుకునేది లేదు."- ప్రధాని మోదీ  


పరిణామాలు తీవ్రంగా ఉంటాయ్ 


తెలంగాణ ప్రజలకు ఎవరైనా అన్యాయం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించనని ప్రధాని మోదీ అన్నారు. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలతో ఆడుకుంటే ప్రతిఫలం తప్పదన్నారు. తెలంగాణలో ప్రధానిమంత్రి ఆవాస్‌ యోజన కింద ఇళ్లు నిర్మించకుండా అడ్డుకున్నారని మోదీ అన్నారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ పేరుతో ఇళ్లు ఇస్తామని మోసం చేశారని మండిపడ్డారు. బీజేపీ యువకుల పార్టీ అని, పేదలకు అండగా నిలబడి మంచి పాలన అందిస్తుందన్నారు. తెలంగాణను కుటుంబ పాలన, అవినీతి నుంచి విముక్తి చేయడం బీజేపీ ధ్యేయమని ప్రధాని మోదీ అన్నారు.