Minister Roja : నగరి నియోజకవర్గంలో మంత్రి రోజాకు సొంత పార్టీ నేతల నుంచే తరచూ నిరసనలు ఎదురవుతున్నాయి. వైసీపీ నేతల నుంచి ఏదో ఒక రూపంలో వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. తిరుపతి జిల్లా పడమాలపేట మండలం పత్తిపుత్తూరు సచివాలయాన్ని ప్రారంభించేందుకు మంత్రి రోజా సిద్ధమయ్యారు. అయితే వైసీపీ జడ్పీటీసీ మురళీధర్‌రెడ్డి మంత్రి రోజా పర్యటనపై అభ్యంతరం తెలిపారు. ఒకే ప్రాంగణంలో సచివాలయం, ఆర్బీకే, పాల శీతలీకరణ కేంద్రానికి రూ.34 లక్షలు వ్యయంతో నిర్మించామని మురళీధర్‌రెడ్డి తెలిపారు. నిర్మాణ ఖర్చుల్లో ఇంకా రూ.23 లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉండగానే మంత్రి రోజా హడావుడిగా ప్రారంభోత్సవం చేయాల్సిన అవసరం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించాకే భవనాలను ప్రారంభించాలని తాళాలు వేశారు.
జడ్పీటీసీ అరెస్ట్
అలాగే ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని మురళీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. అయితే మంత్రి రోజా అనుచరులు భవన సముదాయం తాళం పగులగొట్టడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. అనంతరం జడ్పీటీసీ మురళీధర్‌రెడ్డితో పాటు ఆయన సోదరుడు రవిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో మంత్రి రోజా పత్తిపుత్తూరు చేరుకుని సచివాలయాన్ని ప్రారంభించారు.
నగరిలో వర్గపోరు
నగరి వైసీపీలో వర్గపోరు నడుస్తోంది. ఇటీవల వర్గవిభేదాలు మరోసారి బయటపడ్డాయి. తనను బలహీన పరిచే కుట్ర జరుగుతోందంటూ మంత్రి ఆర్కే రోజా చేసిన వ్యాఖ్యలు ఇటీవల సంచలనంగా మారాయి. తనకు సమాచారం ఇవ్వకుండా నియోజకవర్గంలో పనులు జరగడంపై మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు దేశం, జనసేన పార్టీ నేతలు నవ్వుకునే విధంగా భూమి పూజ జరిగిందంటూ మంత్రి రోజా మాట్లాడినట్లు ఓ ఆడియో వైరల్ అయింది. నగరి నియోజకవర్గం నిండ్ర మండలం కొప్పేడులో రైతు భరోసా కేంద్రానికి ఇటీవల భూమి పూజ జరిగింది. స్థానిక ఎమ్మెల్యే రోజా లేకుండానే రైతు భరోసా కేంద్రానికి శ్రీశైలం బోర్డు చైర్మెన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ కేజే శాంతి హాజరయ్యారు. తనకు సమాచారం ఇవ్వకుండా, కార్యక్రమానికి ఆహ్వానం లేకుండా భూమి పూజ చేయడంపై రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో తనను బలహీన పరిచేందుకు కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపించారు.
కోవర్టులున్నారని ఆరోపణ
నగరి నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాల్లో కీలక నేతలు తనపై తిరుగుబాటు చేస్తున్నారని, అయితే వారందరూ కోవర్టులని వారిపై చర్యలు తీసుకోవాలంటూ గత ఏడాది ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లా వైఎస్ఆర్‌సీపీలో ఈ ఘటన కలకలం రేపింది. చిత్తూరులో ఎస్పీని కలిసి ఆమె తన నియోజకవర్గంలో వైఎస్ఆర్‌సీపీ నేతల్లో కోవర్టులున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. కొంత మంది వైఎస్ఆర్‌సీపీ నేతలు పార్టీలోనే ఉంటూ తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపారని వారిని ఉపేక్షించేది లేదని అప్పట్లో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.