అంతరించిపోతున్న గిరిజన కళలు, జాతులను కాపాడుతూ వాటిని భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు సీఎం కేసిఆర్ నాయకత్వంలో కృషి చేస్తున్నామని రాష్ట్ర గిరిజన, స్త్రీ–శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఎక్కడో మారుమూల ప్రాంతంలో మేడారం జాతరలో సమ్మక్క–సారలమ్మల చరిత్రను డోలి వాయిద్యంలో చెప్పే రామచంద్రయ్యను పద్మశ్రీ పురస్కారానికి ప్రతిపాదించడం ఈ ప్రభుత్వానికి ఆదివాసీ కళల పట్ల ఉన్న చిత్తశుద్ధి, అంకితభావానికి నిదర్శనమన్నారు. గత ఏడాది గుస్సాడి కనకరాజును, ఈ ఏడాది రామచంద్రయ్యలను పద్మశ్రీలకు ప్రతిపాదించడం ద్వారా గిరిజన కళల గొప్పతనాన్ని, ఆవశ్యకతను చాటి చెప్పారన్నారు. 



తెలంగాణ జానపద కళాకారులు, డోలి వాయిద్య కారుడు పద్మశ్రీ రామచంద్రయ్యను మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత, విప్ రేగా కాంతారావు, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యదర్శి  క్రిస్టినా జడ్ చోంగ్తు, అధికారులు ఇవాళ మాసబ్ టాంక్ లోని నెహ్రూ సెంటినరీ ట్రైబల్ మ్యూజియంలో ఘనంగా సత్కరించారు. ఆయనకు పట్టుబట్టలు పెట్టి, శాలువా కప్పి, లక్ష రూపాయల నగదు అందించి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ఆదివాసీ కోయ బిడ్డ ఎక్కడో పుట్టి, కళకు గొప్ప సేవ చేసి భారత పురస్కారం పద్మశ్రీ పొందారన్నారు. కోయ చరిత్రలు చెబుతూ తన పని తాను చేసుకుంటూ పోతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆయనను పద్మ పురస్కారాలకు సిఫారసు చేయడం ఈ కళల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనంమన్నారు. 


గిరిజనులకు దక్కిన గొప్ప గౌరవం 


'ఈ రెండు సంవత్సరాలలో మా గిరిజనులకు గొప్ప గౌరవం దక్కింది. గత ఏడాది గుస్సాడి కనకరాజుకి, ఈ ఏడాది డోలి రామచంద్రయ్యకు పద్మశ్రీలు లభించాయి. గిరిజనుల కళల గొప్పతనానికి ఇవి నిదర్శనం. మేడారం జాతరలో డోలి కళను ప్రదర్శించడం, అమ్మవార్ల చరిత్ర ఔన్నత్యాన్ని చెప్పడం, ఈ కళను భావి తరాలకు తీసుకెళ్లే ప్రయత్నం రామచంద్రయ్య చేశారు. పద్మశ్రీ పురస్కారాలు గొప్ప వారికే కాదు మారుమూల గిరిజనులకు కూడా వస్తాయని చెప్పడానికి ఈ ఆదివాసీ ఆణిముత్యాలు నిదర్శనం. సీఎం కేసిఆర్  స్వయంగా కళాకారులు కావడం వల్ల ఈ రాష్ట్రంలో కళాకారులకు అత్యంత గౌరవం దక్కుతుంది. గిరిజన సంస్కృతి, కళలు అంతరించకుండా గిరిజన సంక్షేమ శాఖ ఎనలేని కృషి చేస్తోంది. జోడేఘాట్లో కొమురం భీమ్ మ్యూజియం, మేడారంలో ఆదివాసీ మ్యూజియం కట్టి వారి కళలు, చరిత్రను భావితరాలకు తెలియ చేస్తున్నాం. అంతరిస్తున్న గిరిజన కళలను భావి తరాలకు అందించేందుకు ఈ ప్రభుత్వం గొప్ప కృషి చేస్తోంది.' అని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.


చాలా సంతోషంగా ఉంది : రామచంద్రయ్య 


పద్మశ్రీ రామచంద్రయ్య  మాట్లాడుతూ 'నేను ఎక్కడో కోయ జాతిలో పుట్టాను. నాకు 58 సంవత్సరాలు. ప్రతి సారి మేడారం జాతరలో అమ్మవార్ల చరిత్రను చెబుతాను. ఈసారి కూడా ముందు మేడారం జాతరకు వెళ్లాలని ఉంది. ఈ అవార్డు రావడం వల్ల ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు అందరూ నాకు సన్మానం చేస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను, నా కుటుంబాన్ని, నా కోయ జాతిని మంచిగా చూసుకోవాలని సీఎం కేసిఆర్ కు పదివేల నమస్కారాలు' అన్నారు.