TSRTC Ziva Water : టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను అన్వేషిస్తుంది. ఆ దిశగా వినూత్న ఆలోచనలతో ముందుకెళ్తుంది. ఇప్పటికే పెట్రోల్ బంక్‌లు, లాజిస్టిక్స్ సేవలను విజయవంతంగా నిర్వహిస్తుంది. తాజాగా మంచి నీటి వ్యాపారంలోకి ఎంటర్ అయింది టీఎస్ఆర్టీసీ. ఇందులో భాగంగా ఆర్టీసీ సొంత బ్రాండ్ ‘జీవ’ పేరుతో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. సోమవారం హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్ ప్రాంగణంలో 'జీవ' వాటర్ బాటిళ్లను ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ తో కలిసి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ముందుగా లీటర్ వాటర్ బాటిళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. త్వరలోనే 250 ఎంఎల్ వాటర్ బాటిళ్లను, ఏసీ బస్సుల ప్రయాణికుల కోసం అర లీటర్ బాటిళ్లను ఉత్పత్తి చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
టోల్ ప్లాజాల వద్ద టీఎస్ఆర్టీసీకి ప్రత్యేక లైన్లు
సంక్రాంతి పండుగ సెలవులు మొదలైన రోజు నుంచి హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాలలో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో రోడ్లుపై బస్సులు బారులు తీరుతాయి. ఇక ప్రైవేటు ట్రావెల్స్ బస్సులైతే చెప్పనక్కర్లేదు. ఓవైపు ఆర్టీసి, మరోవైపు పోటీగా ప్రైవేటు ట్రావెల్స్ ఇలా గమ్యస్దానాలు చేరేవరకూ రోడ్లపై పూర్తిగా ట్రాఫిక్ జామ్.. ఒక్కోసారి బస్సులు టోల్ ప్లాజా దాటాలంటే రెండు మూడు గంటలు ఇక్కడే అయిపోతుందా అనిపిస్తుంది. ఇకపై ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు తెలంగాణ ఆర్టీసీ వినూత్నంగా ఆలోచించింది. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రజలను వీలైనంత త్వరగా గమ్యస్థానాలకు చేర్చేందుకు చర్యలు చేపట్టింది. టోల్‌ప్లాజాల వద్ద సులువుగా ఆర్టీసీ బస్సులు వెళ్లేలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ప్రధాన మార్గాల్లోని టోల్ ప్లాజాల వద్ద టీఎస్‌ఆర్టీసీ బస్సులకు ప్రత్యేక లేన్‌లను కేటాయించాలని కోరుతూ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్.హెచ్.ఎ.ఐ), తెలంగాణ ఆర్ అండ్ బీ విభాగాలకు లేఖలు రాసింది. ఇదే అంశంపై టోల్ ప్లాజా నిర్వాహకులనూ సంప్రదించింది. తమ సంస్థ బస్సులకు ప్రత్యేక లేన్‌ను కేటాయించాలని కోరింది. ఆర్టీసి అభ్యర్దననకు ఆయా విభాగాల నుండి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జనవరి 10వ తేదీ నుంచి ఈ 14 తేదీ వరకు టీఎస్‌ఆర్టీసీ బస్సులకు టోల్ ప్లాజా వద్ద ప్రత్యేక లేన్‌ను కేటాయిస్తామని సమాచారం అందింది.
సంక్రాంతికి ప్రత్యేక బస్సులు
ఇప్పటికే టోల్ ప్లాజాల వద్ద టీఎస్ ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. రద్దీ ఎక్కువగా ఉండే హైదరాబాద్ - విజయవాడ మార్గంలోని పతంగి, కోర్లపహాడ్, హైదరాబాద్-వరంగల్ మార్గంలోని గూడురు, హైదరాబాద్-సిద్దిపేట మార్గంలోని దుద్దేడ, హైదరాబాద్-నిజామాబాద్ మార్గంలోని మనోహరబాద్, హైదరాబాద్-కర్నూలు మార్గంలోని రాయికల్ టోల్ ప్లాజాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటోంది. ఆయా టోల్ ప్లాజాల వద్ద ఆరుగురు ఆర్టీసీ సిబ్బంది మూడు షిప్ట్‌ల్లో 24 గంటలపాటు విధులు నిర్వహించేందుకు ఇప్పటికే ఉద్యోగులకు ఆదేశాలు జారీచేశారు ఆర్టీసి అధికారులు. ఆర్టీసీ బస్సులు ఇబ్బందుల్లేకుండా ప్రత్యేక లేన్ నుండి బయటకు వెళ్లేందుకు స్థానిక పోలీసుల సహకారం కూడా టీఎస్‌ఆర్టీసీ తీసుకోబోతోంది. ఈ సంక్రాంతికి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది టిఎస్ ఆర్టీసి 4,233 ప్రత్యేక బస్సులను మంగళవారం నుంచి 14వ తేది వరకు నడుపుతున్నారు. ఈ వినూత్న నిర్ణయం ఆర్టీసికి ఈ సంక్రాంతికి లాభాల పంట పండించేలా కనిపిస్తోంది. ప్రైవేట్ బస్సులో వెళ్లి టోల్ ప్లాజాల వద్ద ఇబ్బందులు పడే కన్నా.. టీఎస్‌ఆర్టీసీ బస్సులో ప్రయాణించి వేగంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రయాణికులను కోరుతోంది.