IT Raids : మంత్రి మల్లారెడ్డి, ఆయన బంధువుల ఇళ్లు , సంస్థలపై రెండు రోజుల పాటు ఐటీ సోదాలు జరిగాయి. ఈ సోదాలు ముగిసిన అనంతరం మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంటి వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. తన ఇంట్లో రెండు కోట్ల రూపాయలు దొరికినది వాస్తవమే అన్నారు. ఆ డబ్బు కాలేజీలలో పని చేస్తున్న వారి జీతాల కోసం ఇంట్లో పెట్టిన డబ్బు అన్నారు. ఐటీ సోదాలు చేయడం రాజ్యాంగబద్ధమే కానీ తన కూతురు, తల్లిదండ్రులకు కనీస మర్యాద కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యమైన విద్య అందిస్తూ డబ్బు సంపాదిస్తున్నామన్నారు. అక్రమ సంపాదన కాదన్నారు. మంత్రి మల్లారెడ్డిని, ఆయన కుటుంబాన్ని ఐటీ అధికారులు మానసికంగా ఆందోళన గురిచేశారని ఆరోపించారు. ఐటీ అధికారులకు అన్ని విధాల సహకరించామని మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఐటీ అధికారులు మర్చిపోయిన లాప్ టాప్ ను స్థానిక పోలీస్ స్టేషన్ అప్పజెప్పామన్నారు.
బీఆర్ఎస్ తో చక్రం తిప్పుతాం
మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ... తన కుమారుడిని హాస్పిటల్ లో చేర్పించారనే విషయం కూడా తెలియజేయలేదన్నారు. ఇంత రాక్షసత్వంగా ఐటీ అధికారులు ప్రవర్తించారని ఆరోపించారు. అక్రమ సంపాదన తమ దగ్గర లేదన్నారు. కక్షపూరితంగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాపై దాడులు చేస్తుందన్నారు. ఐటీ దాడులు నాకేం కొత్త కాదన్న మంత్రి మల్లారెడ్డి.. ఐటీ సోదాలు జరగడం ఇది మూడోసారి అన్నారు. తెలంగాణ లో నాణ్యమైన విద్యను పేద విద్యార్థులకు అందిస్తున్న ఏకైక సంస్థ మల్లారెడ్డి కాలేజెస్, మర్రి లక్ష్మారెడ్డి కాలేజెస్ అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఎన్ని దాడులు చేసిన సీఎం కేసీఆర్ మాకు అండగా ఉన్నారన్నారు. రాబోయేది కూడా మా ప్రభుత్వమే అన్న మల్లారెడ్డి బీఆర్ఎస్ తో దేశంలో చక్రం తిప్పుతామన్నారు.
రాజకీయ కక్షతోనే
రెండు రోజులుగా జరుగుతున్న ఐటీ దాడులపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. ఐటీ దాడులు ముగిసిన అనంతరం బోయిన్ పల్లిలోని తన నివాసంలో మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు.రెండు రోజుల నుంచి 65 బృందాలతో తనపై, తన కుటుంబ సభ్యులపై ఐటీ సోదాలు చేశారన్నారు. బీజేపీ కుట్ర పన్నుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ మాకు ముందే ధైర్యం చెప్పారన్నారు. తాను చిన్నప్పటి నుంచి పాలు, పూలు అమ్మి వ్యవసాయం చేసుకుంటూ బతికానని, విద్యా సంస్థలు పెట్టి పేద వాళ్లకు చదువుకునే అవకాశం కల్పించానన్నారు. తన కాలేజీలో MBA ఫీజ్ రూ.35 వేలు మాత్రమే అన్నారు. చదువుకున్న విద్యార్థులకు జాబ్ లు కూడా ఇప్పిస్తున్నానన్నారు.
ఐటీ దాడులు కొత్తేంకాదు
"మారుమూల గ్రామాల నుంచి వచ్చిన పేద విద్యార్థులకు చదువు అందిస్తున్నాను. ఇంజినీరింగ్ కాలేజీ వ్యవస్థను తీసుకొచ్చింది నేనే. నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. ఎలాంటి అక్రమాలు చెయ్యడం లేదు. అంతా లీగల్ గా నడిపిస్తున్నాం. మా కుటుంబ సభ్యులను రెండు రోజుల పాటు ఐటీ అధికారులు ఇబ్బందులు పెట్టారు. ప్రతీ కాలేజ్ ప్రిన్సిపాల్ ల దగ్గరి నుంచి క్లర్క్ వరకు సోదాలు చేసి విచారించారు. ఐటీ సోదాలు నాపై ఇదేం కొత్త కాదు. 1994, 2008లో ఇప్పుడు 2022 జరిగాయి. మెడికల్ కాలేజీలో సీట్లు కొనుగోలు అంతా ప్రొపర్ గా జరుగుతుంది. 150 సీట్లు ఉంటే అందులో 65 సీట్లు కౌన్సెలింగ్ ద్వారా ఇస్తున్నాం. ఉచితంగా రోజు 1000 మందికి భోజనం అందిస్తున్నాం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్ మెంట్ అందిస్తున్నాం. అంత ఆన్ లైన్ లో జరుగుతుంది. ఇప్పటి వరకు 28 లక్షలు మాత్రమే ఐటీ అధికారులకు దొరికాయి." - మంత్రి మల్లారెడ్డి