Minister KTR : తెలంగాణ మంత్రి కేటీఆర్ లెటర్స్ ఉద్యమానికి పిలుపునిచ్చారు. చేనేత కార్మికుల సమస్యలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లేందుకు లక్షలాది ఉత్తరాలు రాయాలని సూచించారు. మంత్రి కేటీఆర్ స్వయంగా ప్రధాని మోదీకి పోస్టుకార్డు రాశారు. చేనేత ఉత్పత్తులపై కేంద్రం విధించిన ఐదు శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని పోస్టు కార్డు ద్వారా కోరారు. చేనేత కార్మికుల సమస్యలను పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి స్పందన లేదని కేటీఆర్‌ తెలిపారు. చేనేత సమస్యలపై సీఎం కేసీఆర్‌ కూడా పలుమార్లు ప్రధానికి స్వయంగా లేఖలు రాశారని కేటీఆర్ గుర్తుచేశారు. 


పన్ను విధించిన తొలి ప్రధాని మోదీ 


దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా చేనేత ఉత్పత్తులపై పన్ను విధించిన తొలి ప్రధాని మోదీ అని మంత్రి కేటీఆర్ అన్నారు. చేనేత కార్మికుల సంక్షేమ పథకాలను కేంద్రం రద్దుచేసిందన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో జాతిని ఏకతాటిపై నడిపించిన చేనేత వస్త్రాలపై పన్ను వేసిన తొలి ప్రధాని మోదీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ మహాత్ముని సూత్రాలు, స్వదేశీ మంత్రం, ఆత్మనిర్భర్ భారత్ అంటూ ప్రకటనలు చేసే కేంద్ర ప్రభుత్వం తమ విధానాల్లో మాత్రం ఆ స్ఫూర్తికి తూట్లు పొడుస్తుందని ఆరోపించారు. దేశంలో వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ మంది ఉపాధి కల్పిస్తున్న టెక్స్ టైల్ రంగంలో చేనేత కార్మికులు కీలకమన్నారు.  దేశ సాంస్కృతిక సారథులైన చేనేత కార్మికులపై విధించిన పన్నును రద్దు చేయాలని మంత్రి కేటీఆర్ కోరారు. చేనేత కార్మికుల పట్ల ప్రేమ ఉన్న ప్రతీ ఒక్కరూ పోస్టు కార్డు ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.






పోస్టుకార్డు ఉద్యమంలో భాగస్వాములవ్వండి 


 ఈ మేరకు ప్రగతి భవన్ లో చేనేత కార్మికుల పక్షాన ప్రధానికి మంత్రి కేటీఆర్ పోస్టు కార్డు రాశారు. రాష్ట్రంలో చేనేత కార్మికులు అందరితోపాటు చేనేత కార్మికులు వారి ఉత్పత్తుల పట్ల ప్రేమ ఉన్నవారంతా  ఈ పోస్టు కార్డు ఉద్యమంలో భాగస్వాములు కావాలన్నారు.  నోరులేని నేత కార్మికుల బాధల్ని ప్రధానమంత్రి కార్యాలయానికి తెలియజేయాలని కోరారు.