ABP  WhatsApp

Minister KTR : ప్రపంచంలోని 30 ఉత్తమ నగరాల్లో హైదరాబాద్ ఉండాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం : మంత్రి కేటీఆర్

ABP Desam Updated at: 03 Jun 2022 04:47 PM (IST)
Edited By: Satyaprasad Bandaru

Minister KTR : తెలంగాణలోని పట్టణాల్లో వేగంగా జనాభా పెరుగుతున్న కారణంగా మరిన్ని స్మార్ట్ సిటీలు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు మంత్రి కేటీఆర్. గత ఏడాది పురపాలకశాఖ వార్షిక నివేదికను కేటీఆర్ విడుదల చేశారు.

పురపాలక శాఖ నివేదిక విడుదల చేసిన మంత్రి కేటీఆర్

NEXT PREV

Minister KTR : తెలంగాణలో పట్టణ జనాభా అధికంగా ఉన్న కారణంగా ఎక్కువ స్మార్ట్ సిటీలు మంజూరు చేయాలని మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్మార్ట్ సిటీలు నిర్మాణానికి అనుగుణంగా నిధులు మంజూరు చేయాలని కోరారు. 2021-22 ఏడాదికి సంబంధించిన పురపాలక శాఖ వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నానక్‌రాంగూడలో విడుదల చేశారు. గడిచిన ఏడాది హైదరాబాద్ సహా పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులు, పౌరసేవలు, ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. హైదరాబాద్ నగర శివారులో ముంపు సమస్యను అధిగమించేందుకు ఎస్‌ఎన్‌డీపీ కార్యాక్రమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని మంత్రి అన్నారు. 


బెంగళూరును దాటేశాం 


హైదరాబాద్ తో రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో సమస్యలు లేకుండా చేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. పంచాయతీ కార్యదర్శుల తరహాలో వార్డు ఆఫీసర్లను నియమిస్తామన్నారు. ఈ ఏడాది అన్ని పోస్టులను భర్తీ చేస్తామన్నారు. పురపాలక శాఖలో ఎంత బాగా పనిచేసినా సమస్యలు ఉంటూనే ఉంటాయన్న మంత్రి వాటిని మీడియా సానుకూల దృక్పథంతో చూడాలన్నారు. 2050 నాటికి దేశంలోని 50 శాతం జనాభా పట్టణాల్లో ఉంటుందని నీతి ఆయోగ్ నివేదిక చెబుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో మాత్రం 2025 నాటికే పట్టణాల్లో జనాభా అధికంగా ఉండే అవకాశం ఉందన్నారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. హైదరాబాద్ ను ప్రపంచంలోని 30 ఉత్తమ నగరాల్లో ఉంచాలన్న లక్ష్యంతో ఉత్తమ ఇండెక్స్‌ల్లో అగ్రగామిగా ఉన్న హైదరాబాద్ నగరాన్ని కేవలం దేశంలోని ఇతర నగరాలతో కాకుండా ప్రపంచంలోని 30 ఉత్తమ నగరాల్లో ఉంచాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. స్థిరాస్తి వ్యాపారం, ఇళ్ల నిర్మాణంలో హైదరాబాద్ ముందుకు వెళ్తోందన్నారు. ఇళ్ల ధరలు ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లోనే తగ్గినట్లుగా ఉన్నాయన్నారు. ఆఫీస్ స్పేస్ విషయంలో బెంగళూరును హైదరాబాద్ అధిగమించిందన్నారు. 






27 కి.మీ సైకిల్ ట్రాక్ 


వరుసగా ఆరేళ్లు హైదరాబాద్ అత్యుత్తమ నివాస నగరంగా నిలిచిందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో 37 లింక్‌ రోడ్ల నిర్మాణం చేపట్టామని స్పష్టంచేశారు. ఓఆర్‌ఆర్‌పై రూ.100 కోట్లతో ఎల్‌ఈడీ లైటింగ్‌ ఏర్పాటు, 27 కి.మీ సైకిల్‌ ట్రాక్‌ నిర్మిస్తామన్నారు. మూసీ నదిపై 14 వంతెనల నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. రూ.3800 కోట్లతో నిర్మిస్తున్న ఎస్టీపీల ద్వారా వందశాతం మురుగునీరు శుద్ధి చేసే ఏకైక నగరంగా హైదరాబాద్ నిలుస్తోందన్నారు. 



స్వచ్ఛ సర్వేక్షణ్‌లో తెలంగాణకు 12 అవార్డులు వచ్చాయి. పట్టణ జనాభా ఎక్కువగా ఉన్న తెలంగాణను కేంద్రం ప్రత్యేకంగా చూడాలి. పూర్తయిన, పనులు కొనసాగుతున్న ఇళ్లను ఈ ఏడాది లబ్ధిదారులకు అందిస్తాం. మూసీ, నాలాలపై ఇళ్లు కట్టుకున్న వారిని ఆ ఇళ్లలోకి తరలిస్తాం. వర్షాకాలం రాబోతున్న కారణంగా నాలా సేఫ్టీ ఆడిట్ పూర్తిచేశాం. వర్షాకాలంలో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటాం. 111 జీఓ ఆంక్షల ఎత్తివేత నేపథ్యంలో జంట జలాశయాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతాం. - - కేటీఆర్, పురపాలకశాఖ మంత్రి 

Published at: 03 Jun 2022 04:47 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.