Minister KTR Letter : హైదరాబాద్ మెట్రో విస్తరణకు ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాశారు. హైదరాబాద్ ఫేజ్ టూ, ఫేజ్ వన్ కారిడార్ నెంబర్ 3 ( నాగోల్ -ఎల్బీనగర్) విస్తరణకు కేంద్రం ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఇప్పటికే బీహెచ్ఈఎల్, లక్డీకాపూల్ మధ్య 26 కిలోమీటర్ల ( 23 స్టేషన్లతో ) ఎల్బీనగర్ – నాగోల్ మధ్య (4 స్టేషన్లతో 5 కిలోమీటర్ల మేర) మెట్రోను విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించిందని కేటీఆర్ లేఖలో తెలిపారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి అవసరమైన ఆర్థిక సాయాన్ని కోరేందుకు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీని స్వయంగా కలిసి వివరించేందుకు సమయం అడిగినట్టు తెలిపారు కేటీఆర్. ఈ విషయంలో మరింత ఆలస్యం కాకుండా తెలంగాణ ప్రభుత్వం తరుపున మెట్రో విస్తరణకు సంబంధించిన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కేంద్రానికి పంపినట్టు తన లేఖలో తెలిపారు. 


మెట్రో మరో 31 కిలోమీటర్లు 


రోజు రోజుకు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో ప్రజారవాణా వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పుడే అభివృద్ధి కొనసాగుతుందన్నారు కేటీఆర్. కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ సర్కార్ భాగస్వామ్యంలో ప్రారంభమై విజయవంతంగా కొనసాగుతున్న హైదరాబాద్ మెట్రో ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ ప్రాజెక్టు అన్నారు. కోవిడ్ తరువాత హైదరాబాద్ లో ఊహించిన దానికంటే ఎక్కువగా ఉపాధి అవకాశాలు పెరగడం, పూర్తి స్థాయిలో కార్యాలయాలు పనిచేస్తుండడంతో  మెట్రోను మరింత విస్తరించాలనుకుంటున్నట్టు కేటీఆర్ తెలిపారు. ఫేజ్ -1 లో 69 కిలోమీటర్ల మేర నడుస్తున్న మెట్రోకు అదనంగా మరో 31 కిలోమీటర్లకు విస్తరించాలనుకుంటున్న తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలకు ఆర్థికంగా చేయూత ఇవ్వాలని తన లేఖలో కోరారు. బీహెచ్ఈఎల్-లక్డీకాపుల్, నాగోల్ –ఎల్బీనగర్ కారిడార్ నిర్మాణానికి రూ.8453 కోట్ల వ్యయం అయిందన్నారు. దీని నిర్మాణాన్ని భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వ ఉమ్మడి భాగస్వామ్యంలో నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం పంపిన  రూ.8453 కోట్ల రూపాయల ప్రాజెక్టు ప్రతిపాదనలకు సూత్రప్రాయ అంగీకారం ఇచ్చి వచ్చే బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించాలని కోరారు.  


బాలుడి ట్వీట్ పై స్పందించిన కేటీఆర్


మంత్రి కేటీఆర్ పొలిటికల్ గా ఎంత యాక్టివ్‌గా ఉంటారో, సోషల్ మీడియాలోనూ అంతే యాక్టివ్‌గా స్పందిస్తుంటారు. అయితే నేడు బాలల దినోత్సవం సందర్భంగా ఓ బుడ్డోడు చేసిన పనికి స్పందించిన మంత్రి కేటీఆర్ వారి సమస్యలను తీర్చడం హాట్ టాపిక్‌గా మారింది. ఓ బాలుడు ఒకే ఒక్క ట్వీట్‌తో ఏళ్లుగా ఉన్న తమ కాలనీ సమస్యకు పరిష్కారం చూపించి భేష్ అనిపించుకున్నాడు. తాము కష్టాల్లో ఉన్నామనో, లేక భూమి వివాదంలో చిక్కుకుందని కొందరు, అనారోగ్యంతో ఉన్న కుమారుడు, కుమార్తెకు ఆపరేషన్ కోసం ఆర్థిక సాయం కావాలంటూ నిత్యం మంత్రి కేటీఆర్ కు ఎన్నో రిక్వెస్ట్‌లు సోషల్ మీడియాలో ప్రజల నుంచి వస్తుంటాయి. పొలిటికల్‌గా యాక్టివ్‌గా ఉంటూనే సోషల్ మీడియాలో బాధితుల ట్వీట్లకు స్పందించి కేటీఆర్ సమాధానం ఇస్తుంటారు. సంబంధించిన అధికారులకు పని అప్పగించి, బాధితుల సమస్యకు పరిష్కారం చూపించేవారు. నేడు బాలల దినోత్సవం సందర్భంగా ఓ బుడ్డోడు తమ సమస్యను మంత్రి కేటీఆర్‌కు తెలిసేలా చేశాడు. మంత్రి కేటీఆర్ స్పందించడంతో అధికారులు ఉరుకులు పరుగుల మీద అక్కదికి వెళ్లి ఆ బాలుడు తెలిసిన సమస్యకు పరిష్కారం సాధించాడు. ‘కేటీఆర్ అంకుల్..   మేం హైదరాబాద్‌లోని గోల్డెన్ సిటీ కాలనీలో ఉంటున్నాం. గత 5 ఏళ్లుగా మా ఏరియాకు తాగునీరు అందడం లేదు. దీంతో మేం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం అని’ ఓ బాలుడు ప్లకార్డు ప్రదర్శిస్తున్న వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బాలల దినోత్సవం రోజు ఓ బాలుడు తమ సమస్యను చెబుతున్నాడు చూడండి కేటీఆర్ సార్ పటేల్ అనే నెటిజన్ ట్వీట్ చేశారు. వారి సమస్యను పరిష్కరించాలని జలమండలి ఎండీ దానకిషోర్‌కు మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు.